Mallu Bhatti Vikramarka : బడ్జెట్లో రూ. 40 వేల కోట్లు కేటాయించాలి - కేసీఆర్‌కు భట్టి విక్రమార్క డిమాండ్ !
బడ్జెట్‌లో దళిత, గిరిజనులకు 40 వేల కోట్లు కేటాయించాలని మల్లు భట్టివిక్రమార్క్ కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. మధిర నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర సాగుతోంది.
రాష్ర్టశాసనసభ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేయడం ముఖ్యమంత్రి కెసిఆర్ భారత రాజ్యాంగాన్ని అవమాన పరచడమేనని
సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యంగాన్ని అవమాన పరుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి తీరును అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎండగడతామని ప్రకటించారు. ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలో భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర గురువారం నాటికి 5 వ రోజుకు చేరుకుంది. మండలంలోని మల్లన్న పాలెం, పమ్మి, కమలాపురం, అయ్యాగారిపల్లి, బానాపురం గ్రామాల్లో పీపుల్స్ మార్చ్ కొనసాగింది. పాదయాత్ర సందర్బంగా పలు గ్రామాల్లో ప్రజలు వచ్చి ఆయనకు సమస్యలను ఏకరువు పెట్టారు.
రాజ్యాంగం ప్రసాదించిన హక్కులతో భారత దేశంలో వ్యవస్థలు కొనసాగుతున్నాయని, ఆ రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వాలు నడుస్తున్నాయన్నారు. దేశంలో, రాష్ర్టంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికి ఆ పార్టీ రాజ్యాంగానికి లోబడి మాత్రమే ప్రభుత్వాలను , అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలన్నారు.
ప్రపంచదేశాలలో భారత దేశ రాజ్యాంగానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని ఇటువంటి రాజ్యాంగంలో రాసిన చట్టాలను రాష్ట్ర పాలకులు తుంగతో తొక్కడం సరికాదన్నారు. రాష్ట్ర శాసనసభలో గవర్నర్ పాత్ర చాలా ముఖ్యమైనదని ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుచూపుతో గుర్తించి రాజ్యాంగంలో పొందుపరిచినాడని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని విస్మరించి సొంత రాజ్యాంగం అమలు చేయాలని చూస్తే ప్రజలు నుంచి తిరుగుబాటు తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేయాల్సిన పాలకులు శాసనసభ వ్యవహారాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మంచిది కాదని సూచించారు.
బడ్జెట్ లో దళిత గిరిజనుల అభ్యున్నతికి భారీగా నిధులు కేటాయింపులు చేస్తున్నట్టు కాగితాల లెక్కలు చూపిస్తున్న ప్రభుత్వం ఆ నిధులను వారి కోసం ఖర్చు చేయకుండా దారి మళ్ళించి ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ చట్టానికి తూట్లు పొడుస్తోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని తుంగలో తొక్కిన సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం పేరిట డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాల్సిన ప్రభుత్వం ఈసారి దళిత బంధుకు రూ. 20వేల కోట్లు కేటాయిస్తున్నట్లు గొప్పగా చెప్పుకోవడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. ఈ బడ్జెట్లో దళిత గిరిజన జనాభా దామాషా ప్రకారం దాదాపుగా రూ. 40 వేల కోట్లు పైగా నిధులు కేటాయించాలన్నారు. దళిత బంధు పేరిట రూ. 20 వేల కోట్లు కేటాయించి మిగత నిధులకు కోత పెడితే ప్రభుత్వానికి వాతలు పెట్టడం ఖాయమని హెచ్చరించారు. అంబేద్కర్ విగ్రహాలను అవమానించే వారి తోలు తీస్తానని పమ్మి గ్రామంలో జరిగిన సభలో భట్టి విక్రమార్క హెచ్చరించారు. భట్టి విక్రమార్క పాదయాత్రకు స్థానిక సిపిఎం, టిడిపి, ఎంఆర్పిఎస్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు.