TS Congress : పోరాడాల్సింది ప్రత్యర్థులపై - సొంత పార్టీపై కాదు ! ఈ సింపుల్ లాజిక్ టీ కాంగ్రెస్ నేతలెందుకు మిస్సవుతున్నారు ?
పోరాడాల్సింది సొంత పార్టీపై కాదని.. ప్రత్యర్థులపై అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మర్చిపోయారు. టీఆర్ఎస్, బీజేపీలకు శ్రమ లేకుండా చేస్తున్నారు.
TS Congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చిన్న పాటి సునామీ వచ్చినట్లుగా పరిస్థితి మారుతోంది. టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఇంకా చల్లారలేదు. రేవంత్ రెడ్డి కింద పని చేయలేమంటూ ఇప్పటికీ సీనియర్లు వెళ్తూనే ఉన్నారు. కొద్ది రోజుల కిందటే మర్రిశశిధర్ రెడ్డి గుడ్ బై చెప్పారు. అంతటితో ఆగడం లేదు. తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ పలు కమిటీల్ని ప్రకటించడంతో మరోసారి తెరపైకి అసంతృప్తి బయటకు వచ్చింది. ఇది దావాలనంలా మారుతోంది. ఒక్కొక్కరు మీడియా ముందుకు వచ్చి తమదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు.ఒక్క మాటలో చెప్పాలంటే వీరంతా తమ పార్టీపైనే పోరాటం చేస్తున్నారు.
కాంగ్రెస్‌ను కాంగ్రెస్సే ఓడించుకుంటుంది.. నో డౌట్ !
కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరని.. ఆ పార్టీని ఆ పార్టీయే ఓడించుకుంటుందని.. చాలా కాలంగా ఆ సెటైర్ రాజకీయవర్గాల్లో ఉంది. ఇదేమీ అబద్దం కాదు. ప్రజలు ఓడించడానికి కూడా కాంగ్రెస్ నేతలే కారణం. ఆ పార్టీని ఆ పార్టీనే ఓడించుకుంటుందనడానికి గత రెండు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే సాక్ష్యం. ఎవరికి వారు తామే సీఎం అభ్యర్తి అనుకుని.. పార్టీ గెలిస్తే ఇతర నేతలు పోటీ వస్తారన్న ఉద్దేశంతో కుట్రలు చేసుకుని రాజకీయాలు చేశారు. ఫలితంగా తెలంగాణ ఇచ్చిన ఇమేజ్ ఉన్నా.. రెండు సార్లు పార్టీ ఓడిపోయింది. ఇక భవిష్యత్ లేదనుకున్నవారుఇతర పార్టీల్లో ఆఫర్లు చూసుకుని వెళ్లిపోయారు. అటు టీఆర్ఎస్‌కు వెళ్లిపోయిన వాళ్లు వెళ్లిపోయారు.. బీజేపీలో చేరిన వాళ్లు చేరారు. పోనీ ఉన్న వాళ్లయినా కలసికట్టుగా పోరాడుతున్నారా అంటే అదీ లేదు.
సొంత పార్టీపైనే అలుపెరుగని పోరాటం చేస్తున్న కాంగ్రెస్ నేతలు !
కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ నేతలు సొంత పార్టీ పైనే అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత పార్టీకి ఓ ఊపు వచ్చిందని అనుకున్నారు. కానీ దాన్ని విజయవంతంగా నేలకు దించడంలో అసంతృప్త వాదులందరూ కలిసి పోరాడారు. టీ పీసీసీ ఏ కార్యక్రమం చేపట్టినా వెంటనే కోమటిరెడ్డి లేదా.. జగ్గారెడ్డి.. లేకపోతే మరో సీనియర్ నేత రచ్చ ప్రారంభించేవారు. అలా ప్రారంభించిన వివాదాలు.. చివరికి.. కాంగ్రెస్ ఎలా గెలుస్తుందో చూస్తామనే దాకా వచ్చాయి. మునుగోడు ఉపఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఫార్సు చేసి మరీ పాల్వాయి స్రవంతికి టిక్కెట్ ఇప్పించారు..కానీ తర్వాత ఆయన కాంగ్రెస్ ఓటమికి కృషి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. కాంగ్రెస్ పైనే పోరాడిన కాంగ్రెస్ నేతల జాబితా ఎక్కువగానేఉంది.
కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ ఎక్కడ సీఎం అయిపోతారోనని మిగతా నేతల ఆందోళన !
తాము కాంగ్రెస్‌లో ఎప్పటి నుంచో ఉన్నామని.. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి పీసీసీ చీఫ్ అయి.. పార్టీ గెలిస్తే సీఎం అయితే.. తాము ఎందుకు అంగీకరిస్తామని కోమటిరెడ్డి బ్రదర్స్ నేరుగానే చెప్పారు. ఆయనను తాము ఎందుకు సీఎం చేయాలని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నిజానికి కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి సీఎం అవుతారో లేదో ఎవరికీ తెలియదు. కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి చాన్సిస్తే వారు సీఎం అవుతారు. ఆ విషయం కాంగ్రెస్ నేతలకు తెలియనిదికాదు. కానీ ఆయనకే ఎక్కువ చాన్సులున్నాయి కాబట్టి.. ఆ పరిస్థితి రాకూడదని. కాంగ్రెస్ పై పోరాడుతున్నారని చెప్పకనే చెబుతున్నారు.
ముందు కాంగ్రెస్ గెలిస్తేనే కదా పదవుల పోరాటం !
అసలు గెలవకుండానే.. కాంగ్రెస్ గెలిస్తే ఎవరు సీఎం అన్న దగ్గర వివాదాలు తెచ్చుకుని కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు పోరాడుకుంటున్నారు. పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకర తెరపైకి వస్తూనే ఉన్నారు. తాజాగా మాజీ డీప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ కూడా బయటకు వచ్చారు. పార్టీలో కోవర్టులున్నారని ఆరోపించారు. నిజానికి ఆయనే బీజేపీ నేతలతో చర్చలు జరిపారన్న ప్రచారం జరుగుతోంది.అయినా ఆయన ఇలా తెర మీదకు వచ్చి విమర్శలు చేశారు. జగ్గారెడ్డి ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. ఇలాంటి వారు ముందుగా... కాంగ్రెస్ గెలిస్తేనే.. ఇతరపదువుల గురించి చర్చ వస్తుందని.. గెలవకపోతే.. మొదటికే మోసం వస్తుందని గమనించలేకపోతున్నారు. ఇతర నేతలకు చాన్స్ వస్తుందేమో అని మత రాజకీయ జీవితం.. తమ పార్టీ రాజకీయ భవిష్యత్ తోనూ ఆడుకుంటున్నారు.
పార్టీ గెలిస్తే వచ్చే పదవులే కీలకం.. పార్టీ పదవులు కాదు.. ఈ చిన్న లాజిక్‌ను మిస్సయి... అధికారం కోసం హోరాహోరీ తలపడుతున్న బీజేపీ, టీఆర్ఎస్‌లతో తాము పోటీ పడకుండా..తమలో తాము కలహించుకుంటోంది.. కాంగ్రెస్. ఇక ఆ పార్టీ రేసులో ఉంటుందని ఎవరైనా అనుకుంటారా?