చంద్రబాబును బస్‌లోనే తీసుకెళ్లేందుకు యత్నం - కాన్వాయ్ రెడీ చేస్తున్న పోలీసులు
చంద్రబాబు బయటకు రాకపోయినా, టీడీపీ లీడర్లు అడ్డు తొలగకపోయినా ఆయన విశ్రాంతి తీసుకుంటున్న బస్‌ను టోయింగ్ చేసుకొని తీసుకెళ్తామన్నారు. ఇలా సుమారు గంటల పాటు అక్కడ హైడ్రామా కొనసాగింది.
టీడీపీ అధినేత చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్న ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వందల సంఖ్యలో వచ్చి పోలీసులు ఓవైపు, చంద్రబాబు రక్షణగా ఉన్న టీడీపీ నేతలు, శ్రేణులు మరో వైపు. ఇలా ఇరు వర్గాల మోహరింపుతో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. సుమారు గంటల పాటు ఇది కొనసాగింది.
ముందుగా టీడీపీ శ్రేణులను నెట్టుకొని లోపలికి వెళ్లారు. అక్కడ ఉన్న టీడీపీ నేతల వాహనాలను బలవంతంగా బయటకు పంపించేశారు. ప్రధానమైన నేతలు మినహా శ్రేణులను దూరంగా పంపేశారు. దీంతో మిగతా నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసలు అర్థరాత్రి రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. అయినా పోలీసులు వెనక్కి తగ్గలేదు. తమ పనికి అడ్డుపడొద్దని హెచ్చరించారు.
చంద్రబాబు బయటకు రాకపోయినా, టీడీపీ లీడర్లు అడ్డు తొలగకపోయినా ఆయన విశ్రాంతి తీసుకుంటున్న బస్‌ను టోయింగ్ చేసుకొని తీసుకెళ్తామన్నారు. ఇలా సుమారు గంటల పాటు అక్కడ హైడ్రామా కొనసాగింది. అక్కడ ఉన్న టీడీపీ నేతలతోపాటు మీడియాను కూడా బయటకు పంపేశారు. మెడికల్ యూనిట్‌లను సిద్ధం చేశారు. చంద్రబాబును అరెస్టు చేస్తారని శుక్రవారం మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాతోపాటు కొన్ని న్యూస్ ఛానల్స్‌లో వచ్చింది.
నంద్యాలకు చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి పోలీసులను రప్పించారని టాక్ నడుస్తోంది. నిన్న సాయంత్రం నుంచే చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం చేశారని సమాచారం. లేదు లేదంటూనే సైలెంట్‌గా పని కానిచ్చేశారని ఈ పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది. మొత్తం ఆరు బస్సుల్లో బలగాలు ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. డీఐజీ రఘురామరెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
నంద్యాల వ్యాప్తంగా ఎక్కడికక్కడ బారికేడ్లు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు. అన్ని పక్కగా చేసిన తర్వాత డీఐజీ రఘురామరెడ్డి ఆధ్వర్యంలో ఐదు వందల మంది పోలీసుల టీం చంద్రబాబు ఉంటున్న బస్ వద్దకు వచ్చింది. పోలీసులు ఇలా ఒక్కసారిగా రావడంపై టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. అసలు అర్థరాత్రి జెడ్‌ప్లస్ కేటగిరి ఉన్న వ్యక్తిని డిస్టర్బ్ చేయడమేంటని ప్రశ్నించాయి.
మొదట చంద్రబాబును అరెస్టు చేయడానికి వచ్చామని మొదట చెప్పినట్టు టీడీపీ లీడర్లు చెబుతున్నారు. తర్వాత చంద్రబాబు విదేశాలకు పారిపోతారనే అనుమానం ఉందని అందుకే వచ్చామని తర్వాత చెప్పారట. ఇలా పదే పదే మాట మారుస్తూ అక్కడ టీడీపీ లీడర్లతో వాగ్వాదం జరిగింది.
పోలీసులు అటుగా వెళ్లకుండా తొలుత టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. వారిని బలవంతంగా నెట్టుకొని లోపలికి వెళ్లాయి. అక్కడ టీడీపీకి చెందిన జిల్లా నేతలు, మాజీ మంత్రులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు ప్రధాన భద్రత అధికారి, ఎన్‌ఎస్‌జీ అధికారులతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. ఎన్‌ఎస్‌జీ కమాండెంట్‌కి పోలీసులు సమాచారం ఇచ్చారు.
అర్ధరాత్రి చంద్రబాబుని నిద్రలేపడం పద్ధతి కాదని... ఆయన ఎక్కడికీ పారిపోరని టీడీపీ నేతలు చెప్పారు. తప్పుడు సమాచారం ఆధారంగా వచ్చారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. పోలీసులు ఐపీఎస్ చదువులు మర్చిపోయి వైసీపీ చట్టాలను వంటబట్టించుకున్నారని విమర్శలు చేశారు. చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్న బస్సు డోర్ కొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు.