KTR Karnataka Politics : కర్ణాటకలోనూ బీజేపీని టార్గెట్ చేస్తున్న కేటీఆర్ ! కాంగ్రెస్‌తో కలిసి పొలిటికల్ గేమ్ ఆడుతున్నారా ?
దక్షిణాదిలో బీజేపీకి పట్టు ఉన్న కర్ణాటకలో ఆ పార్టీకి జెల్ల కొట్టడానికి కేటీఆర్ పరోక్షంగా కాంగ్రెస్‌కు సాయపడుతున్నారు. ఇటీవల బెంగళూరు పరిస్థితుల్ని టార్గెట్ చేస్తున్న ఆయనకు తాజాగా టీ పీసీసీ చీఫ్ శివకుమార్ జత కలిశారు. దీంతో బీజేపీ ఉలిక్కి పడింది.
కర్ణాటక రాజకీయాల్లో కేటీఆర్ హాట్ టాపిక్ అవుతున్నారు. బెంగళూరు విషయంలో ఆయన ఇటీవలి కాలంలో తరచూ నెగెటివ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ మాటకు వస్తే కేటీఆర్ మాత్రమే కాదు కేసీఆర్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. కానీ ఇంత కాలం ఆ వ్యాఖ్యలు కర్ణాటకలో చర్చనీయాంశం కాలేదు. కానీ హఠాత్తుగా కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ స్పందించడం... దానిపై అక్కడి మంత్రి అశ్వత్ నారాయణ కూడా కేటీఆర్‌పై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఒక్క సారిగా కర్ణాటక రాజకీయాల్లో కేటీఆర్ హాట్ టాపిక్‌గా మారిపోయింది.
ఇటీవలి కాలంలో బెంగళూరుతో పోల్చి హైదరాబాద్‌ను హైలెట్ చేస్తున్న కేటీఆర్ !
కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ విధానాలను వ్యతిరేకించే స్టాండప్ కమెడియన్లు కునాల్ కమ్రా, మునావర్ ఫారుఖీల షోలకు అనుమతులను బెంగళూరు పోలీసులు రద్దు చేశారు. ఆ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత పెట్టుబడిదారులతో జరిగిన ఓ సదస్భులో ఆయన ప్రత్యేకంగా ఈ విషయాన్ని ప్రస్తావించి అప్పుడు హైదరాబాద్‌లో అలాంటి ఇబ్బంది లేదని ఎప్పుడైనా ప్రదర్శనలకు రావచ్చని కేటీఆర్ ఆహ్వానించారు. ఆ తర్వాత బెంగళూరులో మౌలిక సదుపాయాల ఇబ్బందులపై పలుమార్లు పారిశ్రామికవేత్తల సమావేశాల్లో చర్చించారు. ఇటీవల అమెరికా పర్యటనలోనూ బెంగళూరులో అనేక సమస్యలు ఉన్నాయని ఐటీ కంపెనీలకు హైదరాబాద్ మాత్రమే డెస్టినేషన్ అని ప్రసంగించారు. అది కూడా హైలెట్ అయింది. అదే సమయంలో సీఎం కేసీఆర్ కూడా పలుమార్లు కర్ణాటకలో బీజేపీ హిజాబ్ రాజకీయాల్ని ప్రస్తావిస్తూ.. అక్కడ అంత ఉద్రిక్తంగా ఉంటే.. ఐటీ అభివృద్ది ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు.
ఖాతాబుక్ సీఈవో ట్వీట్‌తో రేగిన దుమారం !
ఇటీవల ఖాతాబుక్ అనే సంస్థ సీఈవో బెంగుళూరు ట్రాఫిక్ దగ్గర్నుంచి చాలా సమస్యలపై అసహనంతో ట్వీట్ పెట్టారు. వెంటనే కేటీఆర్ బ్యాగులు సర్దుకుని హైదరాబాద్ రావాలని సూచించారు. ఇది కలకలం రేపింది. నిజానికి కేటీఆర్ కామెంట్లు కర్ణాటకలో హైలెట్ అవుతున్నాయి కానీ ఎవరూ స్పందించలేదు. కానీ హఠాత్తుగా కేటీఆర్ ట్వీట్ ను ఉద్దేశించి కర్ణాటక పీసీసీ చీఫ్ శివకుమార్ మీ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నామని, 2023లో కర్నాటకలో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, మళ్లీ బెంగుళూరుకు పూర్వ ఐటీ వైభవాన్ని తీసుకు వస్తామని ట్వీట్ చేశారు. నిజానికి కేటీఆర్ చేసిన ట్వీట్‌లో ఎలాంటి చాలెంజ్ లేదు. కానీ ఆయన చాలెంజ్ అన్నారు. కేటీఆర్ కూడా స్పందించారు. ఐటీ, బీటీలపై ఫోకస్ పెడదాం. కానీ హలాల్, హిజాబ్ లాంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఇది బీజేపీకి డైరక్ట్‌గా ఇచ్చిన కౌంటర్. ఎందుకంటే ప్రస్తుతం బీజేపీ కర్ణాటకలో హలాల్ వివాదంపై రాజకీయం చేస్తోంది.
బీజేపీ మత రాజకీయాలను హైలెట్ చేసేలా కేటీఆర్, కేసీఆర్ తీరు !
కర్ణాటకలో బీజేపీ పాలక పార్టీ . నిజానికి అక్కడ బీజేపీ గెలవలేదు. కాంగ్రెస్ - జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ బీజేపీ మార్క్ రాజకీయాలతో మధ్యలోనే వారిని దించేసి బీజేపీ అధికారం చేపట్టింది. కానీ ఇప్పుడు బీజేపీ సమస్యలు ఎదుర్కొంటోంది. యడ్యూరప్పను తొలగించి బొమ్మైకు పదవి ఇవ్వడం మరిన్ని ఇబ్బందిని తెచ్చి పెడుతోంది. ఈ క్రమంలో బీజేపీ స్ట్రాటజీనో.. మరొకటో కానీ వరుసగా హిజాబ్, హలాల్ వివాదాలు తెరపైకి వచ్చాయి. దీనిపై భావోద్వేగాలు ప్రారంభమయ్యాయి. బీజేపీ రాజకీయాల వల్ల కర్ణాటక ఇమేజ్ దెబ్బతింటోందని బెంగళూరుకు మరక పడుతోందన్న అభిప్రాయాన్ని అక్కడి ప్రజల్లో కల్పించడానికి కేటీఆర్ మాటలు ఉపయోగపడుతున్నాయి. అవును నిజమేనని .. అవును నిజమేనని కేటీఆర్ మాటలతో కర్ణాటక పీసీసీ చీఫ్ కోరస్ అందుకున్నారు.
ఉలిక్కి పడ్డ కర్ణాటక బీజేపీ - కేటీఆర్ మాటలకు ఖండన !
ఈ పొలిటికల్ గేమ్‌ను కర్ణాటక బీజేపీ బిత్తరపోయింది. వెంటనే కర్ణాటక మంత్రి అశ్వత్ నారాయణ మీడియా ముందుకు వచ్చి.. కేటీఆర్ వ్యాఖ్యను ఖండించారు. మనం భారతీయులమని గుర్తుంచుకోవాలన్నారు.
Tweet wasn't in good taste. Being in responsible position,it shouldn't be the attitude.Trying to pull legs of each other doesn't go good for any govt.We're Indians,need to compete with entire world. Condemnable: Karnataka Min CN Ashwathnarayan on Telangana Min KT Rama Rao's tweet pic.twitter.com/ofAVWwjHpW
— ANI (@ANI) April 4, 2022
మొత్తంగా తెలంగాణలో బీజేపీని టార్గెట్ చేస్తున్న కేటీఆర్ వ్యూహాత్మకంగానే కర్ణాటకలో బీజేపీని కూడా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ కాంగ్రెస్‌కు ట్వీట్ సాయం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.