KCR schemes plan : ఎన్నికలకు ముందు వరుస పథకాలు - కేసీఆర్ ప్లాన్ వర్కవుట్ అయితే వంద సీట్లు ఖాయమా ?
ఎన్నికల కోసం కేసీఆర్ పథకాల ప్లాన్ ఓటర్లకు రూ. లక్షల ఆశలుఅందరి దగ్గర దరఖాస్తులుకొంత మందికే అమలుమళ్లీ ఓటు వేస్తేనే పథకాలొస్తాయన్న భావనకేసీఆర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా ?
KCR schemes plan : తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవలి కాలంలో వరుసగా పథకాలు ప్రవేశ పెడుతున్నారు. ఆ పథకాలన్నీ ఆషామాషీవి కాదు. ప్రజలకు రూ. లక్షలు నగదు బదిలీ చేసేవే. కానీ అన్నీ అమలు చేస్తారా అంటే... అమలు చేయడం ప్రారంభిస్తారు. కానీ ఎన్నికల్లోపు పూర్తి కావు. ఎన్నికల తర్వాత మాత్రమే ఎక్కువ మందికి అందుతాయి. అలాంటి స్కీమ్స్ నే కేసీఆర్ ఇప్పుడు ప్రకటిస్తున్నారు.
పథకాలతో ఓట్ల పంట పండించడం కేసీఆర్ స్టైల్
డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం కేసీఆర్‌కు ఎన్ని రకాల విజయాలు అందించిందో చెప్పడం కష్టం. గ్రేటర్ హైదరాబాద్‌లో ఒకప్పుడు బీఆర్ఎస్ పోటీ చేయలేకపోయింది. కానీ అధికారంలోకి వచ్చిన 99 కార్పొరేటర్ సీట్లను గెల్చుకుంది. దీనికి ప్రధాన కారణం డబుల్ బెడ్ రూం ఇళ్లేనని రాజకీయవర్గాలు గుర్తు చేసుకుంటాయి. తలసాని నియోజకవర్గంలో పాడుబడిపోయిన ఇళ్ల స్థానంలో ఓ అపార్టుమెంట్ కట్టించారు. దాన్నే మోడల్ ఫ్లాట్ గా చూపించి.. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించారు. అందు కోసం దాదాపుగా బస్తీల్లో ఉండే.. ముఖ్యంగా ఓట్లు వేసే ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. దరఖాస్తులు ఇచ్చిన వారంతా తమకు ఇళ్లు వస్తాయనే ఆశతో ఉన్నారు. ఇతర పథకాల్లోనూ అదే స్ట్రాటజీ అమలు చేస్తున్నారు.
పథకాల కోసం ప్రభుత్వం వద్దల లక్షల సంఖ్యలో దరఖాస్తులు
దళిత బంధు పథకాన్ని ఇప్పుడున్న పద్దతిలో అమలు చేయాలంటే..అందరికీ మరో పాతికేళ్లు పడుతుంది. ఎందుకంటే అంత తక్కువగా లబ్దిదారుల ఎంపిక జరుగుతోంది. బీసీ బంధు, మైనార్టీ బంధు కూడా తెచ్చారు. మరి మాకేంటి అని తెలంగాణలోని అన్ని వర్గాలు అడుగుతున్నాయి. బీసీ బంధు అయినా.. మైనార్టీ బంధు అయినా ఇప్పటికిప్పుడు పూర్తిగా ఇచ్చే పరిస్థితి ఉండదు. తాను మళ్లీ వస్తే అందరికీ వస్తాయని చెప్పడమే సీఎం కేసీఆర్ వ్యూహం. బీసీ చేతివృత్తుల వారికి లక్ష ఆర్థిక సాయం మొదటిదశలో నియోజకవర్గానికి కేవలం 50 మందికే ఇచ్చారు. ఈ లెక్కన 7 వేల మందికి లోపే సాయం అందింది. కానీ, ఈ స్కీం కోసం దాదాపు 5.20 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఎన్నికల్లోపు అందిన వాళ్లు సరే.. అందాల్సిన వాళ్లు తప్పనిసరిగా సాయం కోసం.. బీఆర్ఎస్‌కు ఓటేయాల్సిందేననే భావన కల్పిస్తారు. కొంత మందికి ఇచ్చిన తర్వాత ఎన్నికలు వచ్చేశాయి..ఇది నిరంతర ప్రక్రియ.. మళ్లీ కేసీఆర్‌కే ఓటేయాల్సిన అనివార్యతను కల్పించాలని వ్యూహం అమలవుతోందని అనుకోవచ్చు.
గ్రేటర్ ఎన్నికలు, హుజూరాబాద్‌లో ఫెయిలయిన స్ట్రాటజీ
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు వరదలు ముంచెత్తాయి. ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అందుకే వారికి సాయం చేయడానికి ఇంటికి పదివేల చొప్పున పంపిణీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. దరఖాస్తులు తీసుకున్నారు. కానీ గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించారు. బీజేపీ వల్లే ఇవ్వలేకపోతున్నామని.. ఎన్నికలు అయిపోగానే ఇస్తామని చెప్పారు. కానీ ఆ ప్లాన్ వర్కవుట్ కాలేదు. వరదలు వచ్చిన చోట బీార్ఎస్ అభ్యర్థులు విజయం సాధించలేదు. ఆ తర్వాత హుజూరాబాద్ ఉపఎన్నికల్లోనూ అదే పరిస్థితి. కేసీఆర్ ఆ ఎన్నికల్లో ఈటలను ఓడించడానికి ..ఏకంగా దళితులకు ఇంటికి పదిలక్షల చొప్పున ఇస్తామన్న పథకాన్ని ప్రవేశ పెట్టారు. పదిహేడు వేల కుటుంబాలకు ఇచ్చారు కూడా. కానీ అక్కడా పరాజయమే ఎదురయింది.
కేసీఆర్ ప్లాన్‌కు ప్లస్ మైనస్ కూడా !
ఆర్థిక సమస్యలు కావొచ్చు..కేసీఆర్ రాజకీయ వ్యూహం కావొచ్చు... ప్రకటిస్తున్న పథకాలు అన్నీ అందరికీ చేరవు. కానీ దరఖాస్తులు మాత్రం అందరూ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రభుత్వం దగ్గర మీ దరఖాస్తు ఉంది .. మళ్లీ ఈ ప్రభుత్వం వస్తేనే మీకు నిధులు వస్తాయి అన్న ఓ అభిప్రాయాన్ని పెంచడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. మొదట్లో సక్సెస్ అయిన ఈ స్ట్రాటజీ ఇప్పుడు ఫెయిలవుతోంది. అయినా వచ్చే ఎన్నికల్లోనూ దీన్నే నమ్ముకోవాలని కేసీఆర్ డిసైడయ్యారని ఆయన నిర్ణయాలను బట్టి అర్థం చేసుకోవచ్చంటున్నారు.