TS Power : బీజేపీకి "కరెంట్" షాకిచ్చే వ్యూహం - విద్యుత్ చట్టమే కేసీఆర్ అస్త్రం !
విద్యుత్ చట్టంపై కేసీఆర్ .. బీజేపీని అవకాశం దొరకిన చోటల్లా నిలదీస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టడానికి ఇదొక్కటి చాలని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారు.
TS Power : కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ సంస్కరణలు, కొత్త చట్టంపై కేసీఆర్ చాలా రోజులుగా విరుచుకుపడుతున్నారు. అసెంబ్లీలోనూ అదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కేసీఆర్ ఇలా విద్యుత్ చట్టాన్ని హైలెట్ చేయడం వెనుక .. గెలుపోటముల్ని నిర్దేశించే రైతుల్ని ప్రభావితం చేయడం.. వారు బీజేపీ వైపు వెళ్లకుండా ఆపడమే కాదు.. తమ పార్టీకి మరోసారి మద్దతుగా నిలిచేలా చేసుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. కేసీఆర్ వ్యూహం అంచనా వేసిన బీజేపీ నేతలు తిప్పి కొట్టడానికి తంటాలు పడుతున్నారు. కేసీఆర్ చెబుతున్నవేవీ విద్యుత్ చట్టంలో లేవని అంటున్నారు. కానీ బీజేపీ నేతల వాయిస్ .. కేసీఆర్ ప్రకటనలంత వేగంగా ప్రజల్లోకి వెళ్లడం లేదు.
వ్యవసాయబోర్లపైనే ఎక్కువగా ఆధారపడిన తెలంగాణ రైతాంగం !
తెలంగాణ భౌగోళిక పరిస్థితుల కారణంగా.. వ్యవసాయానికి నీటిని అందించాలంటే.. బోర్లు, బావులకు మోటర్లు తప్పనిసరి. పాతిక లక్షలకుపైగా వ్యవసాయ మోటార్లు ఉన్నాయి. ప్రతిరోజూ విద్యుత్తు వినియోగంలో సుమారు 35% పైగా వ్యవసాయరంగానిదే ఉంటుంది. సగటున ఒక్కో మోటర్ కింద 4 ఎకరాలు సాగవుతూంటాయి. అంటే తెలంగాణలో వ్యవసాయానికి నీరిచ్చే అతి పెద్ద సాగునీటి ప్రాజెక్టు.. ‘కరెంట్’ అని చెప్పక తప్పదు. 2018 జనవరి 1 నుంచి 24 గంటల ఉచిత విద్యుత్తును అందిస్తున్నారు. వ్యవసాయానికి పూర్తిగా ఉచితంగా విద్యుత్తును అందించడం రైతుల్లో తెలంగాణ ప్రభుత్వానికి సానుకూలత రావడానికి కారణం. రైతులు కూడా ఈ ఉచిత విద్యుత్ వల్ల ఎంతో లబ్ది పొందుతున్నారు.
బీజేపీ వస్తే ఉచిత విద్యుత్ ఉండదని చెబుతున్న కేసీఆర్ !
కేంద్రం కొత్త విద్యుత్ చట్టాలను తీసుకొస్తోంది. క్రాస్ సబ్సిడీలు ఉండకూడదంటున్నది. సంస్కరణలు అమలు చేయాలంటోంది. పొరుగున ఉన్న ఏపీ సంస్కరణలు అమలు చేస్తోంది. ఉచిత విద్యుత్ ఎత్తివేసి.. ఆ మేరకు అకౌంట్లలో వేస్తామని చెబుతోంది. అయితే తెలంగాణ ఇంకా సంస్కరణలకు అంగీకరించలేదు. క్రాస్ సబ్సిడీ లేకుండా రైతులకు ఉచితంగా ఇచ్చే అవకాశం లేదు. పోనీ కేంద్రం చెప్పినట్టుగా.. ప్రతి మోటర్‌కు విద్యుత్తు మీటర్‌ను బిగించి.. ఆ బిల్లును నెలనెలా రైతుల నుంచి వసూలుచేసి.. ఆ పైనే సబ్సిడీ రూపంలో వారి ఖాతాల్లో డబ్బులు వేయడమనేది పెను భారమవుతుందని భావిస్తోంది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళితే.. క్రాస్ సబ్సిడీ లేకుండాచేస్తే.. ప్రతి రైతు నెలకు వేలల్లో విద్యుత్తు బిల్లు కట్టాల్సి ఉంటుంది. అది తెలంగాణ రైతాంగానికి తీవ్ర శరాఘాతం అవుతుంది. ఇదే విషయాన్ని కేసీఆర్ బహిరంగసభల్లో అసెంబ్లీల్లో చెబుతున్నారు. బాయి దగ్గర మీటర్ రావొద్దంటే .. బీజేపీకి ఓటు వేయవద్దని ఆయన పిలుపునిస్తున్నారు. మునుగోడు సభలో కేసీఆర్ ... తను చెప్పిన విద్యుత్ అంశాలపై ప్రతీ ఇంట్లో చర్చ జరగాలన్నారు.
విద్యుత్ చట్టంపై తెలంగాణ రైతుల్లో చర్చ జరిగితే బీజేపీకి ఇబ్బందే !
తెలంగాణలో 25 లక్షలకు పైగా బోరుబావులు.. కాళేశ్వరం సహా అనేక ఎత్తిపోతల పథకాలకు విద్యుత్తే ప్రధాన వనరు. తెలంగాణ ప్రభుత్వం రావడంతోనే అత్యంత ప్రాధాన్య అంశంగా కరెంట్‌ను చేపట్టింది. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ దక్కను పీఠభూమి. ఇక్కడ పల్లంలోకి కాల్వల ద్వారా సహజంగా నీటిని పారించి అందించడం సాధ్యమయ్యే పనికాదు. ఇక్కడి భౌగోళిక పరిస్థితుల కారణంగా ఎత్తిపోయడం ఒక్కటే సాగునీటికి పరిష్కారం. ఇప్పుడు కరెంట్ విషయంలో కేంద్రం ఇబ్బంది పెడుతుందని భావిస్తే.. తెలంగాణ రైతులు బీజేపీకి మద్దతిచ్చే చాన్సే ఉండదు. అందుకే బీజేపీ నేతలు. .. కేసీఆర్ చెబుతున్నట్లుగా విద్యుత్ చట్టంలో అవేమీ లేవని ఉన్నట్లుగా నిరూపిస్తే రాజీనామాలు చేస్తామని సవాళ్లు చేస్తున్నారు.
కేసీఆర్ రాజకీయాలు అనూహ్యం. ఆయన సామాన్యుల్లో ఉన్న ఆందోళలను ఇట్టే పసి గడతారు. వారి ఆందోళలను దూరం చేయడం ద్వారా అభిమానం దక్కించుకుంటారు. కరెంట్ విషయంలో తెలంగాణ ప్రజల్లో కేసీఆర్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ క్రమంలో బీజేపీ తేవాలనుకుంటున్న విద్యుత్ చట్టం ద్వారా తెలంగాణలో ఆ పార్టీకి షాకివ్వాలని కేసీఆర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.