కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- ఈ నెలలోనే జాయినింగ్స్!
తమతోపాటు తమ అనుచరలకు టికెట్లు కేటాయిస్తే చేరేందుకు సిద్ధమని కాంగ్రెస్ అధిష్ఠానంతో చాలా రోజులుగా ఈ ఇద్దరి నేతలు చర్చలు జరుపుతున్నారు.
ఇన్నాళ్లూ కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. వివిధ వర్గాలు, స్నేహితులు, అభిమానులతో చర్చల అనంతరం ఈ ఇద్దరి నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
కర్ణాటక ఎన్నికలతో మారిన సీన్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఆ పార్టీపై పాజిటివ్ ధోరణితో నేతలు ఉన్నట్టు అర్థమవుతోంది. తమతోపాటు తమ అనుచరలకు టికెట్లు కేటాయిస్తే చేరేందుకు సిద్ధమని కాంగ్రెస్ అధిష్ఠానంతో చాలా రోజులుగా ఈ ఇద్దరి నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ విషయంపై సుదీర్ఘ మంతనాలు జరిపిన కాంగ్రెస్ అధినాయకత్వం ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
ఈ నెలలోనే చేరికలు
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ మూడో వారంలో కానీ నెలాఖరుకు కానీ జూపల్లి, పొంగులేటి చేరికలు ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అమెరికా టూర్‌లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఓ డేట్ ఫిక్స్ చేసుకుంటారు. ఆ తర్వాత ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి .. ఎవరు పార్టీలోకి వస్తామన్నా తీసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఆయన ప్రెస్ మీట్లలో నేరుగా పేర్లు పెట్టి మరీ పిలుస్తున్నారు. అయితే పార్టీలో చేర్చుకోవడం వరకూ ఓకే కానీ వారికి టిక్కెట్లు కేటాయించే అంశంలో రేవంత్ రెడ్డి హామీ ఇవ్వలేకపోతున్నారు. టిక్కెట్ల కేటాయింపు ఆయన చేతుల్లో ఉండదు. అందుకే ఆయన పిలుపులకు స్పందించేవారు.. తెర వెనుక చర్చలు జరుపుతున్నారు. టిక్కెట్ల కేటాయింపు విషయంలో హామీ ఇస్తే.. పార్టీ కండువా కప్పుకుంటామని మంతనాలు జరుపుతున్నారు. దీనిపై హామీ దొరికిన వెంటనే పార్టీలో చేరేందుకు ఓకే చెబుతున్నారు. ఇప్పుడు పొంగులేటి, జూపల్లి విషయంలో అదే జరిగిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
బలమైన నేతలకు హామీ ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ
కచ్చితంగా అభ్యర్థిత్వం ఇవ్వాల్సిందే అనుకున్న నేతలు వస్తామంటే కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దగా ఆలోచించదని ఈ ఎపిసోడ్‌తో అర్థమైంది. ఎంపీ టిక్కెట్ మీద పోటీ చేయాలంటే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉండాలని షరతు పెడుతున్నారు. అలాంటి నేతలకుట టిక్కెట్లు ఇచ్చేందుకు రెడీగానే ఉన్నామంటూ హామీ ఇస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇటీవల నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. చాలా మందితో చర్చలు జరుపుతున్నారు.
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత పార్టీ ఆలోచన చేశారు. ఎన్నికలకు సమయం దగ్గర పడినందున అలాంటి ప్రయత్నం చేస్తే ఇబ్బందలు ఎదురవుతాయన్న అంచనాలతో ప్లాన్ మార్చారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపారు.
ఒప్పించలేకపోయిన బీజేపీ
అటు బీజేపీ కూడా వీళ్లిద్దర్నీ చేర్చుకునేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఆపార్టీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ రంగంలోకి వీళ్లతో మంతనాలు జరిపారు. బీఆర్‌ఎస్‌తో లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయని... అనుకున్నంత బలంగా బీజేపీ లేదన్న కారణాలతో వాళ్లు ఈటల ఆఫర్‌ను తిరస్కరించారు. ఈ సందర్భంగా ఈటల చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. లీడర్లు పార్టీలోకి రావాలని తాను ఆహ్వానిస్తుంటే... వాళ్లే తనకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారని చెప్పడం సంచలనంగా మారింది.