Jayaprada BJP : ఏపీ బీజేపీలో జయప్రద - ఇక రాజమండ్రి నుంచే రాజకీయం !
బీజేపీ తరపున రాజమండ్రి నుంచి పోటీకి జయప్రద సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. రాజమండ్రి సభలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
Jayaprada BJP : ఒకప్పటి హీరోయిన్... యూపీ నుంచి రాజకీయాల్లో కొంత కాలం చక్రం తిప్పిన జయప్రద ఇక నుంచి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం చేయాలనుకుంటున్నారు. బీజేపీలో చేరినా అంత క్రియాశీలకంగా లేని జయప్రద రాజమండ్రిలో జేపీ నడ్డా సభకు హాజరయ్యారు. ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తన జన్మభూమి రాజమండ్రి అని..కర్మ భూమి ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) అని.. అవి తనకు రెండు కళ్ళలాంటివని జయప్రద (Jayaprada) ప్రకటించారు. రాజమండ్రి సభలో ఆమె మాట్లాడుతూ అప్పులప్రదేశ్ను స్వర్ణాంధ్రగా మార్చటానికి జేపీ నడ్డా వచ్చారన్నారు.
ఏపీ బీజేపీలోనే ఇక జయప్రద
రెండు రాష్ట్రాల్లో అన్నదాత సుఖంగా ఉన్నారా.. అన్నం లేకుండా ఉన్నారా అని జయప్రద ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేయకుండా ఏపీ (Ap)లో ఏడు లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. ఆడపిల్ల బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే వరకు తల్లి గడప దగ్గర ఎదురు చూస్తుంటుందని జయప్రద వ్యాఖ్యానించారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న జయప్రద.. మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం చేయాలని ఉందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె ఏపీ బీజేపీలో కీలకపాత్ర నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
కొంత కాలంగా యూపీ రాజకీయాలకు దూరం
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన జయప్రద తన రాజకీయ జీవితం 1994లో ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టిఆర్ ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ లో చేరడం ద్వారా ఆమె తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ నుండి పార్టీ పగ్గాలను చంద్రబాబు చేతిలోకి తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు 1996లో జయప్రదను రాజ్యసభ సభ్యురాలిగా, పార్టీ మహిళా విభాగం నాయకురాలిగా చేశారు. చంద్రబాబు నాయుడు మరో నటి రోజాను మహిళా విభాగం చీఫ్‌గా చేయడంతో వారి మధ్య విభేదాలు వచ్చాయి.
వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి నుంచే పోటీ ?
ఆ తర్వాత అమర్ సింగ్, ములాయం సింగ్ ఆహ్వానం మేరకు ఆమె సమాజ్ వాదీ పార్టీ లో చేరారు. ఆమె 2004లో రాంపూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మళ్ళీ 2009లో తిరిగి ఎన్నికయ్యారు. ములాయం సింగ్‌పై తిరుగుబాటు చేసిన తర్వాత జయప్రద అమర్ సింగ్ పక్షాన నిలిచారు. 2010లో ఎస్పీ నుంచి బహిష్కరించబడిన ఆమె అమర్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మంచ్‌లో చేరారు. అయితే, ఉత్తరప్రదేశ్‌లో పార్టీ ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. 2019లో బీజేపీలో చేరిన జయప్రద యూపీలో ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లోనూ పాల్గొనడం లేదు. రాజమండ్రి నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.