Jagan Delhi: అరెస్టులపై ఢిల్లీకి వెళ్లే యోచనలో జగన్ - సపోర్టు చేసే పార్టీలతో సంప్రదింపులు- స్పందనలేదా?
YSRCP: వైసీపీ నేతల అరెస్టులపై ఢిల్లీకి వెళ్లాలని జగన్ భావిస్తున్నారు. తనకు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్న జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

Jagan plans to go to Delhi over arrests of YSRCP leaders: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం ఇప్పుడు కేసుల చుట్టూ తిరుగుతున్నాయి. లిక్కర్ స్కాం అతి పెద్ద ఇష్యూగా ఉంది. ఇందులో ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్టు అయ్యారు. క్వార్ట్జ్ గనుల అక్రమ తవ్వకాల కేసులో మాజీ మంత్రి జైలులో ఉన్నారు. మరో మాజీ మంత్రి పేరు వినిపిస్తోంది. ఇంకా చాలా మంది ముందస్తు బెయిల్స్ కోసం ప్రయత్నిస్తూ ఆజ్ఞాతంలో ఉన్నారు. చివరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్టు అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో ఈ కేసుల అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అందరికీ చెప్పాలని జగన్ అనుకుంటున్నారు. త్వరలో ఢిల్లీ వెళ్లాలనుకుంటున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
తమకు మద్దతుగా మాట్లాడే రాజకీయ పార్టీల కోసం సంప్రదింపులు
జగన్ ఢిల్లీకి వెళ్లి ఓ ధర్నా చేయడం లేదా.. వివిధ పార్టీల నేతలను కలిసి లిక్కర్ స్కామ్ అరెస్టులు, ఇతర కేసుల గురించి వివరించి తమను టార్గెట్ చేస్తున్నారని .. ఏపీలో రాజ్యాంగ విరుద్ధమైన పాలన సాగుతోందని చెప్పాలని అనుకుంటున్నారు. ఏపీలో పరిణామాల్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని అనుకుంటున్నారు. అందుకే బెంగళూరు నుంచే గతంలో తమకు మద్దతు పలికిన విపక్ష పార్టీలను ఆయన సంప్రదింస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రతి వారం బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చే వైసీపీ అధ్యక్షుడు ఈ వారం రాలేదు. ఢిల్లీ పర్యటన సన్నాహాల్లో ఉన్నారని అందుకే రావడం లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో మద్దతుగా నిలిచిన ఇండీ కూటమి పార్టీలు
వైఎస్ఆర్‌సీపీ నేతలను హత్యలు చేస్తున్నారని జగన్ కొన్నాళ్ల కిందట ఢిల్లీలో ధర్నా చేశారు. పక్కా ప్రణాళికతో.. ఇండీ కూటమిలోని పార్టీలననీ వచ్చి జగన్ కు మద్దతు పలికి ఎన్డీఏలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించేలా నేతల్ని ఆహ్వానించారు. శివసేన సహా అన్ని పార్టీల ప్రతినిధులు వచ్చి జగన్ కు మద్దతు పలికారు. అదే విధంగా ఈ సారి కూడా అందర్నీ కలవడం లేదా వారే వచ్చి మద్దతు ప్రకటించేలా చేసుకోవాలనుకుంటున్నారు. దీని వల్ల జాతీయ స్థాయిలో ఏపీ పరిణామాలపై చర్చ జరుగుతుందని అనుకుంటున్నారు.
ఆ పార్టీలు ఈ సారి మద్దతుగా వస్తాయా ?
అయితే జగన్మోహన్ రెడ్డికి ఈ సారి ఢిల్లీలో కొన్ని పార్టీల మద్దతు లభించడం కూడా కష్టంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇండీ కూటమి పార్టీలు.. జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు మద్దతు పలికినా తర్వాత జగన్ వివిధ సందర్భాల్లో ఎన్డీఏకే మద్దతు పలికారు. ఇండీ కూటమికి సపోర్టు చేయలేదు. చివరికి ఇండీ కూటమిలోని పార్టీలకు సమస్యలు వచ్చినప్పుడు కూడా స్పందించలేదు. ఈ కారణంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు ఇతర పార్టీలు ముందుకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదని ్ంటున్నారు ఎన్డీఏలోని పార్టీలు అసలు రావు. ఇండీ కూటమిలోని పార్టీలు కూడా వచ్చే అవకాశాలు లేవని భావిస్తున్నారు.
భారీ స్కాం జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీకి కూడా జగన్ పై సాఫ్ట్ కార్నర్ లేదు. ఆయన భారీ స్కామ్ చేశారని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ నేరుగానే ప్రకటించారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూడా అదే అంటున్నారు . అందు వల్ల జగన్ ప్రధాన ప్రతిపక్షం నుంచి కూడా మద్దతు లభించదు. ఎలా చూసినా జగన్ గోడమీద పిల్లి తరహా రాజకీయాల వల్లజాతీయ స్థాయిలోనూ ఆయనకు మద్దతు కొరవడే అవకాశాలు కనిపిస్తున్నాయి.





















