Andhra 3 Capitals : మూడు రాజధానుల విషయంలో మరోసారి డైలమా - గవర్నర్ ప్రసంగంలో ఎందుకు పెట్టలేదు ? కొత్త బిల్లుపై ఎందుకు సైలెంట్ ?
గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానులు ఎందుకు లేవు ?మూడు రాజధానుల బిల్లుపై ఎందుకు సైలెంట్ ?విశాఖకు జగన్ వెళ్లడం ఎందుకు ఆలస్యం అవుతోంది?
Andhra 3 Capitals : ఆంధ్రప్రదేశ్‌లో రాజధానుల వ్యవహారం మరోసారి కీలక మలుపు తిరిగింది. సీఎం జగన్ జూలైలో విశాఖకు వెళదామని మంత్రివర్గ సహచరులకు చెప్పారు. అదే సమయంలో.. గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన లేదు. కనీసం వికేంద్రీకరణ ప్రస్తావన లేదు. దీంతో మూడు రాజధానులపై ప్రభుత్వం మళ్లీ పునరాలోచనలో పడిందన్న అభిప్రాయం వినిపించడం ప్రారంభమయింది. చట్ట పరంగా మూడురాజధానులు అనేది సాధ్యం కాదన్న వాదన చాలా కాలంగా ఉంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు వెనుకడుగు వేస్తూండటంతో ఇతరుల్లోనూ ఇది సాధ్యం కాని పనిగా అంచనాకు వస్తున్నారు.
గవర్నర్ ప్రసంగంలో లేని మూడు రాజధానులు
గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ వ ఏపీ అసెంబ్లీలో తొలి ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో మూడు రాజధానులు, వికేంద్రీకరణ అనే అంశాలు లేవు. ప్రభుత్వం ఆమోదించే ప్రసంగాన్ని గవర్నర్ చదువుతారు. అయినా ఇందులో మూడు రాజధానుల ప్రస్తావన ప్రభుత్వం తీసుకు రాలేదు. అలాగే ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా మూడు రాజదానుల బిల్లంటూ హడావుడి ఉంటుంది. ఈ సారి కేబినెట్ సమావేశం కూడా నిర్వహించారు. అయితే మూడురాజధానుల గురించి మాట్లాడలేదు. దీంతో ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఉగాది నుంచి పరిపాలన అనుకున్నప్పటికీ.. ఇప్పుడు సీఎం జగన్ ముహుర్తాన్ని జూలైకి వాయిదా వేశారు.
జూలై నుంచి విశాఖ నుంచి పరిపాలన ఉంటుందని మంత్రులకు చెప్పిన సీఎం జగన్!
మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించినప్పటి నుండి విశాఖకు అదిగో ఇదిగో అంటూనే ఉన్నారు మంత్రులు. నిన్నటిదాకా ఇక ఉగాది నుంచి సీఎం జగన్ .. విశాఖకు వెళ్తారని అక్కడి నుంచే పరిపాలన చేస్తారని కొంత కాలంగా వైఎస్ఆర్‌సీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్, మరో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా అదే చెబుతున్నారు. ఉగాది వేడుకల్ని కూడా విశాఖలోనే నిర్వహించాలనుకున్నారన్న ప్రచారం జరిగింది. విశాఖ నుంచి పల్లెనిద్రకు వెళ్తారని.. జీఏడీ కూడా విశాఖకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుందని చెప్పుకున్నారు. అయితే చివరికి మరోసారి జూలైకు వాయిదా పడింది. సీఎం జగన్ ఇచ్చిన క్లారిటీతో స్పష్టమయిందని మంత్రులు ఓ అభిప్రాయానికి వచ్చారు.
న్యాయపరంగా మూడు రాజధానులు సాధ్యం కాదనే అభిప్రాయం !
ప్రస్తుతం మూడు రాజధానుల అంశం సుప్రీంకోర్టులో ఉంది. అది తేలాల్సి ఉంది. అక్కడ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తే.. ఇక మూడు రాజధానులు చేయలేరు. మళ్లీ మూడు రాజధానుల బిల్లు పెట్టే అవకామే లేదు. రాజ్యాంగంలో రాజధానులు అనే ప్రస్తావన లేదు కాబట్టి తాను విశాఖ నుంచి పరిపాలన చేస్తానని సొంత నిర్ణయాలు తీసుకుంటే తీసుకోవచ్చేమో కానీ చట్ట ప్రకారం రాజధానిని మార్చలేరు. ఈ విషయం వైఎస్ఆర్‌సీపీ నేతలకూ కూడా అర్థమయింది. అందుకే సీఎం ఎక్కడ నుంచి పరిపాలన చేస్తే అదే రాజధాని అనే వాదన వినిపిస్తున్నారు. అయితే ఇలాంటివి రాజకీయపరంగా వినడానికి బాగుంటాయి కానీ.. పాలనా పరంగా చిక్కులు తలెత్తుతాయన్న వాదన ఉంది.
మొత్తానికి మూడు రాజధానులు, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు వెనుకడుగు వేస్తూనే ఉంది. జూలై అంటే.. ఆ తర్వాత ఆరేడు నెలల్లో ఎన్నికలువస్తాయి. అలాంటి సమయంలో రాజధాని మార్పు కరెక్టా కాదా అన్నది రాజకీయంగా ఆలోచించుకున్న తర్వాతనే ప్రభుత్వం ముందడుగు వేసే అవకాశం ఉంది.