Chiranjeevi BJP: చిరంజీవిని వదిలేయని బీజేపీ - ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువచ్చేస్తారా ?
Chiru: చిరంజీవికి బీజేపీ ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఆయనను రాష్ట్రపతికోటాలోరాజ్యసభకు పంపుతారా లేకపోతే మరోసారి ప్రత్యక్షరాజకీయాల్లోకి తెస్తారా అన్న చర్చ జరుగుతోంది.
BJP gave special priority to Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యంపార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఆ పార్టీ నాయకుడిగా మారారు. కానీ చివరికి రాజకీయాలపై అసంతృప్తితో వైదొలిగారు . తన రాజ్యసభ సభ్యత్వం ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ ఆయన సభాసమావేశాలకు కూడా హాజరు కాలేదు. తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరమని ప్రకటించారు. సోదరుడు పవన్ కల్యాణ్‌కు మద్దతు పలికారు.
అయితే చిరంజీవిపై బీజేపీ ప్రత్యేకమైన ఆసక్తిని చూపిస్తోంది. ప్రత్యేక ప్రాధాన్యత ను ఇచ్చి ఆయనను రాజకీయాల్లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది.గతంలో పలు మార్లు ప్రధాని మోదీ పాల్గొనే పర్యటనల్లో ఆయనకు అవకాశం కల్పించారు. అదే సమయంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ .. చిరంజీవితో ప్రత్యేక అనుబంధం కొనసాగిస్తున్నారు. గోవాలో ఓ సారి అవార్డు ప్రకటన సందర్భంగా.. మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా అని అనురాగ్ ఠాకూర్ అడిగారు కూడా . అయితే చిరంజీవి మాత్రం నిర్మోహమాటంగా...తాను మళ్లీ ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చేది లేదని స్పష్టం చేశారు.
మధ్యలో వైసీపీ కూడా కూడా ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసిందని ప్రచారం జరిగింది.దాన్ని చిరంజీవి కూడా ఖండించారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని చెప్పారు. అయినా బీజేపీ మాత్రం ఆయనను ఆకర్షించడానికి అదే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ నివాసంలో జరిగిన సంక్రాంతి సంబరాలకు.. చిరంజీవిని అతిథిగా ఆహ్వానించారు. ప్రత్యేకంగా ఆయననే ఆహ్వానించడం వెనుక ప్రత్యేకమైన సమీకరణాలు లేవని అనుకోలేమని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే బీజేపీ ఎం చేసినా పూర్తి స్థాయిలో రాజకీయ కోణంలోనే చేస్తుంది.
ఇటీవల చిరంజీవికి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సీటు వస్తుందన్న ప్రచారం జరిగింది. రాష్ట్రపతి కోటాలో ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వడానికి.. రాజకీయ పార్టీల్లో చేరాల్సిన అవసరం లేదు. బీజేపీలో చేరాల్సిన అవసరం లేదు. రాష్ట్రపతి వివిధ రంగాల్లోని నిపుణులను రాజ్యసభకు నామినేట్ చేసే కోటా అది. అయితే కేంద్రం సిఫారసు మేరకే నామినేట్ చేస్తారు. గతంలో కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎన్నికైనప్పటికీ చిరంజీవిపై బీజేపీ ప్రత్యేక అభిమానం చూపిస్తున్నందున కళాకారుని కోటాలో ఆయనకు చాన్స్ ఇవ్వొచ్చని చెబుతున్నారు.
అయితే దీనికి చిరంజీవి అంగీకరిస్తారా లేదా అన్నది కూడా కీలకమే. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ తీసుకుంటే.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నట్లుగా కాదు. బీజేపీకి అనుకూలంగా మాట్లాడాల్సిన పని లేదు.కానీ.. బీజేపీ సానుభూతిపరుడిగానే అందరూ చూస్తారు. పవన్ కల్యాణ్ ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నందున అలా చూడటం పెద్ద విషయం కాదు. ఇప్పటికే ఆయనను బీజేపీకి దగ్గరగానే చాలా మంది భావిస్తున్నారు. అందుకే రాష్ట్రపతి కోటాలో బీజేపీ పదవి ఇస్తే తీసుకోవడంలో తప్పు లేదని ఎక్కువ మంది భావిస్తున్నారు.