(Source: ECI/ABP News/ABP Majha)
Attack On Jagan Case : జగన్‌పై కోడి కత్తి దాడికి నాలుగేళ్లు - విచారణ ఎక్కడి వరకు వచ్చింది ? నిందితుడికి బెయిల్ ఎందుకు రాలేదు ?
కోడికత్తి దాడి కేసుకు నాలుగేళ్లు పూర్తయ్యాయి. కానీ విచారణ ముందుకు సాగడం లేదు. నిందితుడు శీను జైల్లోనే మగ్గిపోతున్నాడు.
Attack On Jagan Case : 2019 ఎన్నికలకు ముందు సంచలనం సృష్టించిన ఘటనల్లో అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌పై కోడి కత్తితో దాడి కేసు ఒకటి. సరిగ్గా నాలుగేళ్ల కిందట 2018లో సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి వైఎస్ జగన్‌పై శీను అనే ఎయిర్ పోర్ట్ క్యాంటీన్‌లో పని చేసే యువకుడు కోడి పందెలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. దీంతో వైఎస్ జగన్ భుజానికి గాయమైంది. దాడి జరిగిన వెంటనే శీనును సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
ఆ రోజు ఏం జరిగిందంటే ?
అప్పట్లో జగన్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నారు. ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుంది. అందుకే ప్రతి గురువారం మధ్యాహ్నం కల్లా ఆయన పాదాయత్ర నిలిపివేసి.. వెంటనే విశాఖ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ బయలుదేరేవారు. అలాగే 2018 అక్టోబర్ 25న 294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్ జగన్ హైదరాబాద్ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వీఐపీ లాంజ్‌లో ఉండగా.. వెయిటర్..సెల్ఫీ తీసుకుంటానంటూ వైఎస్ జగన్ వద్దకు వచ్చారు. అతను వస్తూనే.. వైఎస్ జగన్‌పై కోళ్ల పందెలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉన్న వైఎస్ జగన్ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ భుజానికి కత్తి తగలడంతో గాయమైంది. చిన్న గాయం కావడంతో వెంటనే జగన్ విమానం ఎక్కి వెళ్లిపోయారు. కానీ హైదరాబాద్ చేరుకున్న తరవాత సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు. ఆ ఆస్పత్రి వైద్యులు తొమ్మిది కుట్లేసినట్లుగా ప్రకటించారు. మూడు వారాల వరకూ రెస్ట్ తీసుకున్నారు. ఇది పెద్ద సంచలనం అయింది.
ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న వైఎస్ఆర్సీపీ !
శీను జగన్ అభిమాని అని.. జగన్ పై సానుభూతి రావడం కోసం చేశారని పోలీసులు తేల్చారు. అయితే వైసీపీ నేతలు దీన్ని ఖండించారు. కేసును నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. సీబీఐకి అప్పగించాలం’టూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది వైసీపీ. ఈ కేసుపై దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) ఏర్పాటు చేసింది. అయితే ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న దర్యాప్తు మీద తమకు అనుమానాలు ఉన్నాయంటూ జగన్, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, గుంటూరుకు చెందిన అనిల్ కుమార్‌లు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. మూడు రకాలుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో కేంద్ర హోం శాఖ కూడా ప్రతివాదిగా ఉంది. ఆ సందర్భంగా హోం శాఖ తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ లక్ష్మణ్ ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించినట్లు నిర్ణయాన్ని ధర్మాసనానికి తెలిపారు. అలా కేసు ఎన్ఐఏ చేతికి వెళ్లింది.
చార్జిషీటు దాఖలు చేసిన ఎన్‌ఐఏ
వేగంగా విచారణ జరిగిన ఎన్‌ఐఏ 2019లోనే చార్జిషీటు దాఖలుచేసింది. ఈ దాడి కేసులో మొదటి ముద్దాయిగా జనిపల్లి శ్రీనివాసరావును పేర్కొన్నారు. చార్జిషీటుతో పాటు నిందితుడు శ్రీనివాసరావు విశాఖ జైల్‌లో రాసుకున్న 22పేజీల లేఖను కూడా కోర్టుకు అందజేశారు. తుది చార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ విచారణ కొనసాగుతుందని ఎన్ఐఎ అధికారులు పేర్కొన్నారు. జగన్‌పై దాడి చేసే ముందు రోజు ఎయిర్‌పోర్టు ఫుడ్ కోర్టులో తోటి ఉద్యోగులతో జగన్ గురించి శ్రీనివాసరావు చర్చించినట్లు పేర్కొంది.ఈ సందర్భంగా జగన్‌తో సెల్ఫీ తీసుకునే అవకాశం ఇవ్వాలని వారిని కోరినట్లుగా చెప్పింది.ఇందుకోసం వైసీపీలో ఎవరితోనైనా మాట్లాడాలని సహా ఉద్యోగి హేమలతను శ్రీనివాసరావు కోరాడని స్పష్టంచేసింది.సెల్ఫీ తీసుకునే అవకాశం ఉంటుందని, అందుకోసం తాను మాట్లాడతానని హేమలత భరోసా ఇచ్చినట్లుగా వివరించింది. పార్టీ నేతలతో కలిసి జగన్ వీఐపీ లాంజ్‌లో ప్రవేశించాక.వారికి అల్పాహారం అందించేందుకు శ్రీనివాసరావు ఫుడ్ కోర్టు సిబ్బందితో కలిసి లోనికి వెళ్లినట్లుగా చార్జిషీట్ లో స్పష్టం చేసింది.
జైల్లోనే కోడికత్తి శీను.. తల్లిదండ్రుల ఆవేదన !
ఎన్‌ఐఏ చార్జిషీటు దాఖలుచేసింది. కానీ కోర్టులో విచారణకు మాత్రం రావడం లేదు. మరో వైపు ఓ సారి కోర్టులో శ్రీనివాస్‌కు బెయిల్ వచ్చింది. కానీ ఎన్‌ఐఏ కోర్టుకు వెళ్లి కొట్టి వేయించింది. దీంతో అప్పటి నుండి శ్రీనివాస్ జైల్లోనే ఉన్నాడు. తమ కుమారుడ్ని విడిపించాలని వారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు కూడా లేఖ రాశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. నాలుగేళ్లయిన సందర్భంగా జైల్లో తల్లిదండ్రులు శ్రీనివాస్‌ను కలిశారు. తమ కుమారుడు బయటకు వచ్చేలా సాయం చేయమని.. జగన్‌ను కలుస్తామని వారంటున్నారు. లేకపోతే ధర్నాకూ సిద్ధమంటున్నారు. ఈ కేసు ఎప్పటికి తేలుతుందో కానీ.. మిస్టరీ మాత్రం అలాగే ఉండిపోయింది.