పవన్ కల్యాణ్ స్ట్రాటజీ మార్చేశారా ? బీజేపీని సైడ్ చేసేసినట్లేనా ?
చంద్రబాబును జైలులో కలిసి వచ్చిన తర్వాత జనసేనాని రూటు మార్చేశారు. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ అక్రమాలు, అవినీతిపై వరుసగా ట్వీట్లు, విమర్శలు చేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయ్యాక ఖండించిన జనసేనాని, ఆ తర్వాత నేరుగా రాజమండ్రి జైలుకు వెళ్లి పరామర్శించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పని చేస్తాయని స్పష్టం చేశారు. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని భావిస్తున్నామంటూ...బంతిని కమలం కోర్టులోనే వేసేశారు. దీంతో అప్పటి వరకు జనాలకు ఉన్న అనుమానాలు పటా పంచలయ్యాయి. పవన్ కల్యాణ్ కామెంట్స్ తో ఏపీ రాజకీయాలు మొత్తం మారిపోయాయి. ఎప్పటిలాగే వైసీపీ తన పాత పల్లవి అందుకుంది. చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటూ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసింది.
బీజేపీ ఊసెత్తడం లేదు
చంద్రబాబును జైలులో కలిసి వచ్చిన తర్వాత జనసేనాని రూటు మార్చేశారు. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ అక్రమాలు, అవినీతిపై వరుసగా ట్వీట్లు, విమర్శలు చేస్తున్నారు. బీజేపీతో, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పలుమార్లు చెప్పారు. జగన్ అవినీతి మొత్తం ప్రధాని మోడీకి తెలుసని అన్నారు. కొంతకాలంగా బీజేపీ పార్టీ గురించి మాట్లాడటం పూర్తిగా తగ్గించేశారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని జనసేన, టీడీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తే ముస్లింలు, క్రిస్టియన్లు ఓటర్లు దూరమయ్యే ఛాన్స్ ఉంది. ముస్లింలు, క్రిస్టియన్లు గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వడంతో, ఆ పార్టీ 151 సీట్లలో గెలుపొందింది. ఈసారి అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలంటే బీజేపీకి దూరంగా ఉండమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
అవనిగడ్డలో వారాహి యాత్ర నిర్వహించిన పవన్ కల్యాణ్, జగన్ పాలనపై ధ్వజమెత్తారు. ఎక్కడా బీజేపీ పార్టీ గురించి మాట్లాడలేదు. జగన్ అవినీతి మొత్తం మోడీకి తెలుసు అంటూనే ఆగిపోయారు. బీజేపీ పేరు ఎంత తక్కువగా ప్రస్తావిస్తే, అంత మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళితే మళ్లీ జగన్ కే అది లాభిస్తుందనే అంచనా వచ్చినట్లు సమాచారం. అందుకే బీజేపీ దూరంగా ఉంటూనే ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం.
ఈ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం
వైసీపీ ప్రభుత్వాన్ని కిందకు దించటమే జనసేన లక్ష్యమని... ఎన్నికల తర్వాత టీడీపీ-జనసేన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారని.. కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులం.. జగన్ సేన కౌరవులని పవన్ కల్యాణ్ విమర్శించారు. జగన్ ఓటమి ఖాయం, మేం అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. డబ్బుకు అమ్ముడుపోయానని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని, తనకు డబ్బుమీద, నేలమీద ఎప్పుడూ కోరిక లేదని స్పష్టం చేశారు.
ఎన్నో అటుపోట్లు ఎదుర్కొన్నాం
ఈ పదేళ్లలో జనసేన పార్టీ అనేక దెబ్బలు తిందన్న పవన్ కల్యాణ్, కేవలం ఆశయాలు, విలువల కోసం మేం పార్టీ నడుపుతున్నట్లు వెల్లడించారు. తాను యువత భవిష్యత్తు బాగుండాలని ఎప్పుడూ అనుకుంటానని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్‌సీ కోసం కృషి చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఓటు చీలకూడదని పొత్తు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తనకు తన పార్టీ కంటే ఈ రాష్ట్రం ముఖ్యమని పవన్ వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి కోసం తాను వెంపర్లాడనని పవన్ వెల్లడించారు.