Two States Sentiment Politics: ఉభయతారక సమైక్యవాదం - టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ పక్కా ప్లానింగ్‌తోనే అంటించేశాయా ?
అసందర్భ సమైక్యవాదం ఇప్పుడు తెలుగురాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. రెండు అధికార పార్టీలు వ్యూహాత్మకంగానే తెరపైకి తెచ్చాయా ?
Two States Sentiment Politics: " ఏ మాత్రం చాన్స్ ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాలను కలపడానికి తాము ఓటు వేస్తామని" ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడటం లేదని చేసిన విమర్శలకు కౌంటర్‌గా ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఉండవల్లి అరుణ్ కుమారే.. రాష్ట్రాలను కలపాలని తాను కోరడం లేదని చెప్పారు. కానీ సజ్జల మాత్రం ఉండవల్లి రాష్ట్ర విభజన తప్పు అని పిటిషన్ వేశారని.. తప్పు అని సుప్రీం చెబితే తాము స్వాగతిస్తామన్నారు. అంటే.. వ్యూహాత్మకంగానే సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారు. సహజంగానే ఈ మాటలపై తెలంగాణ నుంచి ఎక్కువ రియాక్షన్ వచ్చింది. ఏపీలో మాత్రం వైఎస్ఆర్‌సీపీ మరో డ్రామాకు తెర లేపిందని ఇతర పార్టీలు విమర్శిస్తున్నాయి.
అసందర్భ సమైక్యవాదంతో సజ్జల ఏం చెప్పాలనుకున్నారు ?
రాష్ట్ర విభజన అనేది సున్నితమైన అంశం. రెండు రాష్ట్రాలు విడిపోయాయి. దాదాపుగా ఎనిమిదేళ్లు అవుతోంది. ఒకప్పుడు కలిసి ఉండేవని మర్చిపోయేంతగా రెండు రాష్ట్రాల మధ్య మార్పులు వస్తున్నాయి. అయితే ప్రజల జీవనంలో మాత్రం పెద్దగా మార్పులు లేవు. హైదరాబాద్ ఆధారపడిన ఆంధ్రులకు ఎలాంటి సమస్య తలెత్తలేదు. ఉపాధి కోసం ఎప్పట్లాగే పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు వస్తున్నారు. వారికెవరూ ఆటంకాలు పెట్టడం లేదు. ఎవరి రాష్ట్రంలో వారు పాలన చేసుకుంటున్నారు. కానీ హఠాత్తుగా సజ్జల రామకృష్ణారెడ్డి సమైక్యవాదాన్ని తెరపైకి తెచ్చారు. తన వ్యాఖ్యలతో రాజకీయం చేయాలనుకున్నారా.. లేకపోతే ఇంకేదైనా ఆశించారా అన్నదానిపై స్పష్టత లేదు.
రెండు రాష్ట్రాలను కలిపేస్తారంటూ అప్పుడప్పుడూ టీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలు!
బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్ నేతలకు.. కవచకుండలం లాంటిది తెలంగాణ సెంటిమెంట్. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే తరచూ తమకు ప్రత్యర్థులుగా ఉన్న పార్టీల అంటే.. టీడీపీ లేదా బీజేపీ గెలిస్తే తెలంగాణ, ఏపీని మళ్లీ కలిపేస్తారంటూ ప్రకటనలు చేస్తూ ఉంటారు. విభజనపై మోదీ చేసిన వ్యాఖ్యలను పలుమార్లు ప్రస్తావించిన టీఆర్ఎస్ నేత హరీష్ రావు.. బీజేపీ గెలిస్తే మళ్లీ సమైక్య రాష్ట్రం వస్తుందని చాలా సార్లు హెచ్చరించారు. టీడీపీతో కలిసి కుట్ర చేస్తున్నారని కూడా అన్నారు. అయితే ఏపీ వైపు నుంచి ఎప్పుడూ మళ్లీ రెండు రాష్ట్రాలను కలపాలనే వాదన తీసుకు రాలేదు. ఇప్పుడు అధికార పార్టీకి చెందిన కీలక నేతనే సమైక్య రాష్ట్రం గురించి మాట్లాడారు. దీంతో బీఆర్ఎస్‌కు మరోసారి సెంటిమెంట్ రాజకీయాలు చేసుకునే అవకాశం .. ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్‌సీపీ కల్పించిందన్న అభిప్రాయం ఎక్కువ మందిలో కలుగుతోంది.
సజ్జలపై మండిపడిన తెలంగాణ పార్టీలు !
సజ్జల రామకృష్ణారెడ్డి.. మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాలను కలపడంపై ప్రకటన చేసిన కాసేపటికే తెలంగాణ నుంచి ఘాటైన రియాక్షన్ వచ్చింది. కాంగ్రెస్ నుంచి భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వీహెచ్ లాంటి వాళ్లు.. కుట్ర పూరితంగానే సెంటిమెంట్ రాజేసేందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ వ్యూహంలో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ప్రకటన చేశారని టీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. సమైక్య రాష్ట్ర కుట్రలను ఎదుర్కొంటామని ప్రకటించింది. ఇక జగన్ సోదరి షర్మిల కూడా.. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దని హెచ్చరించింది. తెలంగాణలోని అన్ని పార్టీలు సజ్జల ప్రకటనను ఖండించాయి.
వైఎస్ఆర్‌సీపీ మరో రాజకీయ ప్రయత్నమని ఏపీ పార్టీల అనుమానాలు !
వైఎస్ఆర్‌సీపీ ఇటీవలి కాలంలో భిన్నమైన రాజకీయ ఫార్ములాలను ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సమైక్య వాదాన్ని తెరపైకి తెచ్చిందని.. అటు టీఆర్ఎస్, ఇటు వైఎస్ఆర్‌సీపీలకు ఉపయోగపడేలా ప్రజల్లో సమైక్య భావోద్వేగాన్నిరెచ్చగొడితే ఎన్నికల్లో తిరుగుండదన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నాయని ఏపీ రాజకీయ పార్టీలు నమ్ముతున్నాయి. ఏపీ బీజేపీ ఇదే విషయాన్ని ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంత వరకూ సజ్జల ప్రకటనపై పెద్దగా స్పందించలేదు. సజ్జలపై ప్రభుత్వంలో సలహాదారు పదవి మాత్రమే ఉంది.. అందుకే ఆయన ప్రకటలకు ..టీడీపీ ఎప్పుడూ పెద్దగా స్పందించదు. కానీ అంతర్గత చర్చల్లో మాత్రం... ఏదీ వర్కవుట్ కాకపోతూండటంతో ఇప్పుడు సమైక్యవాదం ఎత్తుకున్నారని భావిస్తున్నారు.
మొత్తంగా వైఎస్ఆర్‌సీపీ వినిపిస్తున్న సమైక్య వాదం.. ఒక్క రోజుతో తేలిపోయేది కాదని.. రాజకీయంగా.. చర్చనీయాంశం చేసి.. ఎన్నికల అజెండాల్లో ఒకటిగా మార్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్న వాదన వినిపిస్తోంది. అయితే జరిగేది రాజకీయమే కానీ రెండు రాష్ట్రాలను కలపడం అన్నది కలలో కూడా జరగని నిపుణులు తేల్చి చెబుతున్నారు.