(Source: ECI/ABP News/ABP Majha)
Pegasus House Committee : గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగింది - నివేదికను అసెంబ్లీకిస్తామన్న భూమన !
గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగిందని హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. నివేదికను అసెంబ్లీకి సమర్పిస్తామన్నారు.
Pegasus House Committee :2016-2019 మధ్య అప్పటి ప్రభుత్వం వ్యక్తుల సమాచారం సేకరించి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిందని..గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగిందంటూ పెగాసస్‌పై ఏపీ అసెంబ్లీ స్పీకర్ నియమించిన హౌస్ కమిటీ నిర్ధారణకు వచ్చింది. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెగాసస్ కొన్నారని ప్రకటించారు. ఆ ప్రకటన ఆధారంగా విచారమ చేయాలని అసెంబ్లీ హౌస్ కమిటీని నియమించారు. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఈ కమిటీకి చైర్మన్‌గా ఉన్నారు. ఈ కమిటీ మంగళవారం సమావేశం అయింది. డేటా చోరీ జరిగిందని.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తుది నివేదికను సమర్పిస్తామని కమిటీ చైర్మన్ తెలిపారు. బుధవారం కూడా మరోసారి సమావేశం అవుతామని చెప్పారు.
వ్యక్తుల సమాచారం సేకరించి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిందని.. ఆ సమాచారంతో తమకు అనుకూలంగా ఉన్నవారి ఓట్లు ఉంచి...ఇతరుల ఓట్లు తొలగించిందనే ఆరోపణలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం దుర్మార్గపు చర్యలు చేపట్టిందని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వ్యక్తుల ప్రైవేట్ భద్రతకు ముప్పు వాటిల్లేలా చేసింది. కావాలనే డేటా దొంగిలించి రాజకీయ లబ్ది పొందినట్లు దాదాపు స్పష్టత వచ్చిందన్నారు. ఏపీ,తెలంగాణ రెండు రాష్ట్రాల్లో డేటా చౌర్యం ఉందని తెలంగాణ ప్రభుత్వం కూడా దర్యాప్తు జరిపిందన్నారు. అవసరం అయితే కొంతమంది ని హౌస్ కమిటీ ముందుకు పిలుస్తామని తెలిపారు.
పెగసస్‌పై దేశ వ్యాప్తంగా కూడా తీవ్ర దుమారం చెలరేగింది. దేశ స్దాయిలో లింకులు ఏపీలో కూడా ఉన్నాయని అందులో చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న అధికారుల పాత్ర ఉందనే ఆరోపణలు వైఎస్ఆర్‌సీపీ నేతలు చేసారు. స్పీకర్ నియమించిన కమిటీ జూన్‌లో తొలి సమావేశం నిర్వహించింది. హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి కాగా సభ్యులు కరణం ధర్మశ్రీ, భాగ్యలక్ష్మి, మొండితోక జగన్మోహన్‌రావు, మద్దాళి గిరిధర్ ఉన్నారు. వీరందరూ సమావేశాలకు హాజరయ్యారు. పెగాసస్ సాఫ్ట్‌వేర్ వినియోగంతో పాటు ఫోన్ ట్యాపింగ్, నిబంధనలకు విరుద్ధంగా రహస్య పరికరాల కొనుగోలుకు సంబంధించి కూడా విచారించాలని గతంలోనే నిర్ణయించారు.
పెగాసస్ వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో అప్పటి ఏపీ రభుత్వం పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందని చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. బెంగాల్‌కు వెళ్లి అసెంబ్లీ రికార్డులను పరిశీలించాలన్న అభిప్రాయానికి కమిటీ వచ్చినట్లుగా చెబుతున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ప్రకటనను సమగ్రంగా తెలుసుకునేందుకు బెంగాల్ వెళ్లి అక్కడి అసెంబ్లీ రికార్డుల్ని కూడా పరిశీలించాలని అసెంబ్లీ కమిటీ భావిస్తోంది. అయితే వెళ్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.