మహిళా రిజర్వేషన్‌పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరేం మాట్లాడారంటే..
మహిళా హక్కులపై గళం విప్పిన వివిధ పార్టీల నేతలు, మహిళా సంఘాలు
మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహిళానేతలు, వివిధ పార్టీల నేతలు గళం విప్పారు. 13 రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా, మహిళా సంఘాల నేతలు హాజరయి మద్దతు పలికారు. చర్చా వేదికలో ఎంపీలు, నేతలు మాట్లాడారు.
ఎవరేం మాట్లాడారంటే:
శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది:
ఓటు వేయడంలో రాజ్యాంగ నిర్మాతలు మహిళలకు సమాన హక్కు కల్పించినప్పుడు, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచడానికి అధికారంలో ఉన్న ప్రభుత్వం మహిళలకు ఎందుకు రిజర్వేషన్ కల్పించదు? ఈ అంశంపై చట్టసభల్లో ఉన్న మహిళలు ప్రభుత్వాలను మరింతగా డిమాండ్ చేయాలి!
ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా
రిజర్వేషన్ బిల్లుకు తాము మద్దతిస్తున్నాం. రిజర్వేషన్ కోటా ఉండాలి. ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతంగా నిర్మించాల్సిన అవసరం ఉంది.
సీపీఐ ఎంపీ బినాయ్ బిశ్వం
మహిళా రిజర్వేషన్ బిల్లుకు పితృస్వామ్య వ్యవస్థలు అడ్డొచ్చాయి. 21వ దశాబ్దంలో కూడా మహిళా హక్కులకు భంగం కలిగించడం సరికాదు. కల్వకుంట్ల కవిత ప్రారంభించిన ఈ ఉద్యమంలో మేం భాగస్వాములు అవుతాం
ఆర్ఎల్డీ పార్టీ మహిళా విభాగం
రిజర్వేషన్లపై మహిళల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బిల్లుపై జరుగుతున్న చర్చల గురించి గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు అవగాహన లేదు. వారిలో చైతన్యం తేనంత కాలం ఈ ఉద్యమాలు ఇలాగే కొనసాగుతుంటాయి.
జేఎంఎం ఎంపీ మౌహ మాఝి
ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న ఈ తరుణంలో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువ ఉండడం హర్షనీయం కాదు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం కోసం రిజర్వేషన్ బిల్లు రావాల్సిందే! కవిత చేస్తున్న పోరాటానికి అండగా ఉంటాం
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా
మహిళా రిజర్వేషన్ల కోసం యావత్ మహిళా లోకం చేస్తున్నడిమాండ్‌కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం! కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది. ఆ మెజారిటీని సంస్కరణల కోసం, ప్రజలకు మంచి చేసే బిల్లులను తీసుకురావడం కోసం ఉపయోగించాలి.
సమాజ వాది పార్టీ ఎంపీ ఎస్టీ హాసన్
మహిళలకు తగిన వాట కల్పించకుండా, గౌరవం ఇవ్వకుండా ఏ దేశం కూడా సూపర్ పవర్ కాబోదు. దేశం అభివృద్ధి కావాలంటే చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలి.
వీసీకే ఎంపీ తిరుమావలవన్
మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణ అవసరం. ఆలస్యం చేస్తే దేశానికి , ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.
డీఏంకే ఎంపీ తమిళి సై తంగపంద్యాన్
వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల భాగస్వామ్యం అవసరం మహిళా రిజర్వేషన్ బిల్లు కార్యరూపం దాల్చడానికి కవిత చేసే పోరాటంలో తాము కలిసి నడుస్తాం.
కవిత, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్
మహిళగా మహిళ రిజర్వేషన్ల కోసం పోరాటాన్ని నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. ధరణిలో సగం... ఆకాశంలో సగం అవకాశంలో సగం అనే స్పూర్తితో ముందుకు సాగుతాం. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడే మా లక్ష్యం. రెండుసార్లు బిజెపి మాట తప్పింది. మహిళ రిజర్వేషన్ బిల్లు సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న అంశం.