(Source: ECI/ABP News/ABP Majha)
Controversial Madhav : ఖాకీ యూనిఫాంలోనే కాదు ఖద్దరు డ్రెస్‌లోనూ వివాదమే ఇంటి పేరు ! గోరంట్ల ట్రాక్ రికార్డ్ ఇదిగో
పోలీసు ఉద్యోగం చేసిన, ఎంపీగా ఎన్నికైన వివాదాలు లేకుండా గోరంట్ల మాధవ్ ఎప్పుడూ లేరు. వివాదాస్పద వ్యవహారాలతో పబ్లిసిటీ తెచ్చుకునేందుకు ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు.
Controversial Madhav : హిందూపురం వైఎస్ఆర్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఆయనదిగా చెబుతున్న న్యూడ్ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఆయన అది తనదికాదని మార్ఫింగ్ అని చెబుతున్నారు. కానీ ఎవరూ నమ్మడం లేదు. చివరికి ఆయన సొంత పార్టీ కూడా నమ్మడం లేదని.. అది నిజమేనని నమ్ముతోందని అందుకే ఏ క్షణమైనా ఆయనపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇలాంటి వివాదాలు ఆయనకు కొత్త కాదు. పోలీసు ఉద్యోగంలో ఉన్నప్పటి నుంచి ఆయన చుట్టూ వివాదాలే.
జేసీ బ్రదర్స్‌పై మీసం తిప్పి జగన్ కంట్లో పడిన గోరంట్ల మాధవ్
గోరంట్ల మాధవ్ స్వతహాగా రాజకీయ నాయకుడు కాదు. తాడిపత్రిలో జరిగిన ఓ వివాదంలో పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి చేసిన విమర్శలకు కౌంటర్‌గా పోలీస్ డ్రెస్‌లోనే మీసం మెలెసి ఆయన చేసిన చాలెంజ్‌లు వైరల్ అయ్యాయి. వెంటనే ఆయనకు వైఎస్ఆర్‌సీపీలో ప్రాధాన్యం లభించింది. సామాజికవర్గం కూడా కలసి రావడంతో ఆయనతో పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేయించి ఎంపీగా బరిలో నిలబెట్టారు సీఎం జగన్, జేసీ బ్రదర్స్‌కు వ్యతిరేకంగా నిలబడటం ద్వారా ఆయనకు ఇమేజ్ వచ్చింది. కానీ అది వివాదాస్పదమయింది.
పోలీసు అధికారిగా వివాదాస్పద ప్రవర్తన !
ఎస్సైగా కడప జిల్లాలో పోలీసుశాఖలో చేరిన ఆయన అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొన్నారు. సెటిల్మెంట్లకే ప్రాధాన్యం ఇస్తారని చెప్పుకునే వారు. ఫిర్యాదులు అధికంగా రావడంతో కడప నుంచి ఆయనను అనంతపురం జిల్లాకు బదిలీ చేశారు. అక్కడ ఆయన ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారన్న కేసు నమోదైంది. ఎన్నికల అఫిడవిట్‌లోనూ ఈ కేసు గురించి చెప్పడంతో దేశం మొత్తం చర్చనీయాశం అయింది. హత్య కేసు కూడా ఆయనపై ఉంది.
లాఠీ చేతిలో ఉంటే సామాన్యులకు చుక్కలే !
తాను పోలీసు అధికారిని కొడితే కొట్టించుకోవాలన్నట్లుగా ఆయన తీరు ఉండేది. నోట్ల రద్దు సమయంలో ఓ ఎటీఎం కేంద్రం వద్ద నగదు కోసం క్యూలైన్‌లో నుంచుని ఉన్న వారిపై ఆయన చేసిన దాడి దృశ్యాలు జాతీయ స్థాయిలో వైరల్ అయ్యాయి. ఆయన దెబ్బలకు ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి చావుబతుకుల్లో పడిపోయాయి. అతికష్టం మీద కోలుకున్నారు. ఈ ఘటనలో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. మళ్లీ పోస్టింగ్ తెచ్చుకుని... తన వివాదాస్పద ప్రవర్తననే రాజకీయ నిచ్చెనలుగా మార్చుకున్నారు.
ఎంపీ అయిన తర్వాత కూడా అదే ప్రవర్తన !
ఎంపీ అయిన తర్వాత కియా పరిశ్రమలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ కియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు పారిశ్రామిక వర్గాల్లో సైతం చర్చనీయాంశం అయింది. మరో దఫా పోలీస్ బూట్లను ముద్దాడి మీడియాలో ప్రముఖంగా నిలిచారు . దూకుడుగా వ్యవహరించడం , మీడియా దృష్టిని ఆకర్షించడం, తద్వారా అనుకున్న లక్ష్యాన్ని అందుకోవడం ఆయన స్ట్రాటజీగా ఉంది. ఇప్పుడు ఆయన రాజకీయ జీవితం.. అదే పబ్లిసిటీతో రిస్క్‌లో పడిపోయింది.