(Source: ECI/ABP News/ABP Majha)
ఆయన రమ్మంటే నేను వెళ్లనంటానా? పార్టీ మార్పుపై మేకతోటి సుచరిత ఆసక్తికర కామెంట్స్
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమానులో నిర్వహించిన వైసీపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ హోం మంత్రి, స్దానిక ఎమ్మెల్యే మేకతోటి సుచరిత చేసిన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న నేతలంగా స్వరాలను సవరించుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా సీఎం జగన్ సమీక్షలు చేస్తూ... అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. అందుకే తమకే అవకాశం ఇవ్వాలన్న సిగ్నల్స్ ఇచ్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. అయితే అధిష్ఠానం మాత్రం... అలాంటి వారికి చెక్ పెట్టే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, వసంతకృష్ణప్రసాద్, ఇప్పుడు మేకతోటి సుచరిత. ఒక్కొక్కరుగా అధినాయకత్వానికి మనసులో మాటలు చెబుతున్నారు. కొందరు ఘాటుగా మరికొందరు సుతిమెత్తగా... ఇంకొందరు ఇన్‌డైరెక్ట్‌గా సమాచారాన్ని చేర వేస్తున్నారు.
ఇప్పటికే వివిధ సమస్యల పరిష్కారంలో తలమునకలై ఉన్న వైసీపీ అధిష్ఠానానికి మరో పని పెట్టేలా చేశారు మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత. తన నియోజకవర్గం పరిధిలో జరిగిన కార్యక్రంలో పాల్గొన్న సుచరిత... కీలక కామెంట్స్ చేశారు. తాను వైసీపీ ఫ్యామిలీ అంటూనే భర్త ఎటు ఉంటే అటు ఉంటానంటూ అందర్నీ డైలమాలో పడేశారు.
రాజకీయంగా తమ మనుగడు వైసీపీతోనే అన్నారు మేకతోటి సుచరిత... దీనికి తన భర్త దయాసాగర్ కూడా కట్టుబడి ఉంటారని అభిప్రాయపడ్డారు. అలా కాకుండా భర్త పార్టీ మారితే మాత్రం తాను ఆలోచించాల్సి ఉంటుందన్నట్టు కామెంట్స్ చేశారు. పార్టీ మారతాను నువ్వు నాతో రా అని భర్త దయాసాగర్ పిలిస్తే మాత్రం తాను వెళ్లక తప్పదన్నారు. ఎంత రాజకీయా నాయకురాలినే అయినా భర్తతోపాటు వెళ్లాలి కదా అన్నారు. భర్త ఒక పార్టీలో తాను మరొక పార్టీలో పిల్లలు ఇంకో పార్టీలో ఉండబోమన్నారు. రాజకీయాల్లో మనగలిగినన్నాళ్ళు జగన్ తో ఉండాలనుకున్నామని ఫైనల్ రిమార్క్స్ చేశారు.
పార్టీలో చర్చకు దారి తీసిన వైనం
గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమానులో నిర్వహించిన వైసీపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ హోం మంత్రి, స్దానిక ఎమ్మెల్యే మేకతోటి సుచరిత చేసిన వ‌్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీశాయి. ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి శాసన సభ్యురాలుగా పని చేస్తున్నారామె. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో హోం మంత్రి బాధ్యతల నుంచి ఆమెను తప్పించి నియోజకవర్గ పార్టీ బాధ్యతలను అప్పగించారు. అప్పుడే ఆమె అలగడం... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు ప్రచారం జరిగింది.
ఇప్పుడు సుచరిత చేసిన కామెంట్స్ పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి. భర్త దయాసాగర్ కూడా పక్కన ఉండగానే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన కూడా సుచరిత కామెంట్స్ చేస్తున్నప్పుడు నవ్వుతూనే ఉన్నారు. ఆమె మాట్లాడుతుండగానే, దీనికో క్లారిటీ ఇవ్వు అని భర్త దయా సాగర్ వ్యాఖ్యానించారు. దీంతో ఆమెతో పాటుగా, అక్కడ ఉన్న వారంతా నవ్వుకున్నారు. పార్టీ మార్పు వ్యవహారాలపై నేతల ముందే ఇలాంటి కామెంట్స్ చేయటంపై రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. సుచరిత కుటుంబం మొదటి నుంచి వైఎస్ఆర్ ఫ్యామిలికి దగ్గరగా ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా చేసిన వ్యాఖ్యల్లో కూడా ఆమె అదే విషయాన్ని చెప్పినప్పటికి భర్త దయా సాగర్ పార్టీ మారాలంటే,తాను కూడా పార్టీ మారాల్సిందే కదా అని చేసి కామెంట్స్ పైనే అందరిలో చర్చ జరుగుతుంది.
ఈసారి బరిలోకి దిగుతారా...
సుచరిత వ్యాఖ్యలు వెనుక పెద్దగా మాట్లాడుకోవాల్సిందేమి లేదని పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటి వరకు సుచరిత వరుసగా పోటీ చేస్తూ వచ్చారు. ఆమెకు కొంత అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. వాటిని పరిగణంలోకి తీసుకొని ఐఆర్ఎస్ అధికారిగా రిటైర్ అయిన భర్తకు ఈసారి సీటు ఇవ్వాలని కోరుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే సుచరిత ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఎమ్మెల్యేగా, మాజీ హోం మంత్రిగా పని చేసిన ఆమె ఇప్పుడు భర్తకు ఆ బాధ్యతలను అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. పదవిలో ఉన్నా, పార్టీ పనుల్లో ఉన్నా సుచరిత కీలకమైన విషయాలను భర్తతోనే చర్చించే వారని చెబుతున్నారు. సో అదే కోణంలో వచ్చే ఎన్నికల్లో భర్త దయాసాగర్ ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీకి టిక్కెట్ ఇస్తే వైసీపీలో లేదంటే టిక్కెట్ ఇచ్చే పార్టీలోకి వెళతామనే సంకేతాన్ని పంపేందుకు ఇలా మాట్లాడారని కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.