Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్
అలంపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత, సీనియర్ రాజకీయవేత్త చల్లా వెంకట్రామిరెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నేతృత్వంలో శుక్రవారం నాడు టీఆర్ఎస్ పార్టీ భారత్ రాష్ట్ర సమితి (BRS)గా ఆవిర్భవించింది. ఈ బిఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో సంచలనంగా మారనుంది. జాతీయ రాజకీయాల్లో చర్చకు దారితీసిన బిఆర్ఎస్ పార్టీ గుణాత్మక జాతీయ విధానాలు, ఇప్పటికే పలువురు రాజకీయ వేత్తలను, మేథావులను ఆకర్షిస్తున్నవి. ఈ క్రమంలో బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు పలువురు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇందులో పలువురు సీనియర్ రాజకీయ నేతలు మేథావులు ప్రజాక్షేత్రంలో పనిచేసే పలువురు ప్రముఖులున్నారు. శుక్రవారం నాడు బిఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఆవిర్భవించిన కొన్ని గంటల్లోనే పార్టీలో చేరికలు ప్రారంభమయ్యాయి.
బీఆర్ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే..
అలంపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత, సీనియర్ రాజకీయవేత్త చల్లా వెంకట్రామిరెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్, గులాబీ కండువా కప్పి, చల్లా’ ను బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు, తదితర బీఆర్ఎస్ నేతలున్నారు.
చురుకైన రాజకీయ నాయకుడు చల్లా వెంకట్రామిరెడ్డికి పార్టీలో తగు స్థానం కల్పించి, ఆయన సేవలను బిఆర్ఎస్ పార్టీ కోసం జాతీయ స్థాయిలో వినియోగించుకుంటామని సిఎం కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, పార్టీ అధినేత సిఎం కేసీఆర్ జాతీయ విధానాలు నచ్చి తాను బిఆర్ఎస్ పార్టీలో చేరానని, పార్టీ ప్రకటన తర్వాత మొట్టమొదటి చేరిక తనదే కావడం తనకు సంతోషంగా వుందని చల్లా’ తెలిపారు. కేసీఆర్ ఆదేశాలను అనుసరిస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చల్లా వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు.
మాజీ ఉపరాష్ట్రపతి మనవడు చల్లా వెంకట్రామిరెడ్డి :
అలంపూర్ నియోజకవర్గానికి చెందిన చల్లా వెంకట్రామిరెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా ప్రాంతంలో రాజకీయంగా పట్టు ఉన్న మంచి పేరున్న సీనియర్ రాజకీయ కుటుంబానికి చెందిన నేత. ఈయన, భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి స్వయానా మనవడు (కూతురి కుమారుడు). ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన సీనియర్ రాజకీయ నాయకుడు స్వర్గీయ చల్లా రాంభూపాల్ రెడ్డి కుమారుడు చల్లా వెంకట్రామిరెడ్డి.
నూతన జాతీయ విధానాల అవసరం
ఇన్నాళ్ళు పాలించిన కేంద్ర పాలకుల వైఫల్యాలను సరిదిద్దుతూ, ఈ దేశ సమగ్రాభివృద్ధికి, అనేక రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించడం కోసం జాతీయ విధానాలు రూపొందించాల్సిన అవసరముందని సీఎం కేసీఆర్ అన్నారు. వ్యవసాయాధారిత భారతదేశంలో వ్యవసాయరంగం రోజురోజుకీ నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ దేశానికి నూతన వ్యవసాయ విధానం అవసరముందన్నారు. అదనపు నీటి వనరులున్నా నీటి కోసం యుద్ధాలు జరగడం శోచనీయమన్నారు. చెన్నై లాంటి మహానగరానికి బకెట్ నీళ్ళు దొరకని దుస్థితి ఏమిటి? ఇదే సమస్య పై బాలచందర్ లాంటి దర్శకుడు తన్నీర్ తన్నీర్ అనే సినిమా తీస్తే ఆ నీటి బాధకు ప్రజలు దాన్ని సూపర్ హిట్ చేశారన్నారు. ఇటువంటి అసంబద్ధ విధానాలను సరిచేయాల్సి ఉన్నది. కావేరీ నదీ జలాల కోసం తమిళనాడు, కర్నాటక వంటి సహచర రాష్ట్రాలు చేస్తున్న యుద్ధాలను చక్కదిద్దాల్సి ఉన్నదని కేసీఆర్ ప్రకటించారు. దిక్కుమాలిన ట్రిబ్యునల్స్ పేరుతో నీటి యుద్ధాలను కొనసాగిస్తున్నారని.. వీటిని సరి చేయడానికి ఈ దేశానికి నూతన జలవనరుల పాలసీ కావాలని కేసీఆర్ స్పష్టం చేశారు.