![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Warangal Politics: బాబాయ్ వర్సెస్ అబ్బాయి - దాస్యం ఫ్యామిలీలో రాజకీయ అలజడి మొదలైందా?
Abhinav Bhaskar vs Dasyam Vinay Bhasker: తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు మాజీ మంత్రి తనయుడు, బీఆర్ఎస్ కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ పార్టీ వీడనున్నారు.
![Warangal Politics: బాబాయ్ వర్సెస్ అబ్బాయి - దాస్యం ఫ్యామిలీలో రాజకీయ అలజడి మొదలైందా? Dasyam Abhinav Bhaskar sensational comments against Dasyam Vinay Bhasker DNN Warangal Politics: బాబాయ్ వర్సెస్ అబ్బాయి - దాస్యం ఫ్యామిలీలో రాజకీయ అలజడి మొదలైందా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/05/045d9293dde4212ee261e8bda16ab6641707142602420233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Dasyam Abhinav Bhaskar to quit BRS Party: వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న దాస్యం ఫ్యామిలీలో రాజకీయ అలజడి మొదలైనట్లు కనిపిస్తోంది. మాజీ మంత్రి, దివంగత ప్రణయ భాస్కర్ తనయుడు అభినవ్ భాస్కర్ మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhasker) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబాయ్ వినయ్ భాస్కర్ పై అబ్బాయి అభినవ్ కామెంట్స్ చేయడంతో రాజకీయంగా చర్చ మొదలైంది. గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్ గా కొనసాగుతున్న అభినవ్ భాస్కర్ (Dasyam Abhinav Bhaskar) త్వరలోనే పార్టీ వీడనున్నారు.
రాజయ్యతో పాటు పార్టీ వీడనున్న అభినవ్ భాస్కర్
మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు మాజీ మంత్రి తనయుడు, బీఆర్ఎస్ కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ పార్టీ వీడనున్నారు. మాజీ మంత్రి ప్రణయ్ భాస్కర్ తనయుడు అభినవ్ భాస్కర్ తండ్రి ఆత్మీయ సమావేశంలో వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే, బాబాయి వినయ్ భాస్కర్ పై కామెంట్స్ చేశారు. హన్మకొండ రెడ్డి కాలనీలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసి ప్రణయ్ అన్న ఆత్మీయల సమావేశంలో అభినవ్ భాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కోసం మా కుటుంబం చాలా త్యాగాలు చేసిందని, బాబాయ్ దగ్గర తమకు సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
1996 లో తండ్రి ప్రణయ్ భాస్కర్ మరణానంతరం తర్వాత తల్లికి బదులు బాబాయికి అవకాశం ఇచ్చామని అభినవ్ భాస్కర్ తెలిపారు. 2023 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తనకు పరకాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పిస్తానని ఆ పార్టీ పెద్దలు చెప్పినా వినలేదని, తమ కుటుంబంలో కలహాలు వస్తాయని మా బాబాయ్ కోసం పూర్తిస్థాయిలో పని చేశానని అభినవ్ భాస్కర్ చెప్పారు. తన చుట్టూ ఉండే నలుగురైదుగురు మాటలు నమ్మిన బాబాయి... తన ఓటమికి అభినవ్ భాస్కర్ కూడా కారణమని చెప్పడం తనను కలచివేసిందన్నారు. ఆత్మగౌరవం లేని చోట నేను ఉండలేనని, త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ స్పష్టం చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో దాస్యం కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతుంది. మాజీ మంత్రి ప్రణయ భాస్కర్ ఆ కుటుంబం నుండి రాజకీయ అరంగేట్రం చేశారు. 30 సంవత్సరాల కిందట రాజకీయాల్లోకి వచ్చిన ప్రణయ్ భాస్కర్ 1996లో హనుమకొండ ఎమ్మెల్యేగా విజయం సాధించి ఎన్టీ రామారావు ప్రభుత్వంలో రాష్ట్ర క్రీడల, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా సేవలు అందించారు. మంత్రిగా కొనసాగుతున్న సమయంలో అనారోగ్య కారణాలతో ప్రణయ భాస్కర్ మృతి చెందారు. ఆయన మరణం తర్వాత వచ్చిన ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరుపున ఆయన భార్య సబితా భాస్కర్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో వినయ్ భాస్కర్ వదిన సబితా భాస్కర్ కు సపోర్ట్ చేయలేదనే చర్చ జరిగింది. అనంతరం ఆమె పూర్తిగా రాజకీయాలకు దూరం.. కావడం కుటుంబ రాజకీయ వారసత్వం, ప్రణయ భాస్కర్ రాజకీయ వారసుడిగా వినయ్ భాస్కర్ రాజకీయాల్లోకి వచ్చారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా గత ఎన్నికల వరకు సేవలందించారు. అయితే ప్రణయ్ భాస్కర్ మరణం సమయంలో ఆయన కూతురు, కుమారుడు చిన్నపిల్లలు కావడంతో వారు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కుమారుడు అభినవ్ భాస్కర్ విదేశాల్లో చదువుకొని తిరిగి వచ్చిన తర్వాత రాజకీయ అరంగేట్రం చేసి.. బాబాయ్ వినయ్ భాస్కర్ తో తన రాజకీయ భవిష్యత్తును ప్రారంభించారు. 2021లో జరిగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా విజయం సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాస్ లీడర్ గా పేరున్న ప్రణయ భాస్కర్ తనయుడిగా అభినవ్ భాస్కర్ మంచి ఫాలోయింగ్ మొదలైంది. అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అభినవ్ భాస్కర్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నారు. కానీ బాబాయ్ మాట మీద నిలబడడంతోపాటు దాస్యం కుటుంబంలో వర్గ విభేదాలు ఎందుకని బాబాయి వెంట నడిచారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వినయ్ భాస్కర్ విజయానికి అభినవ్ భాస్కర్ సహకరించలేని వారి కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. బాబాయ్ ఇతర నాయకుల వద్ద ఈ విషయం ప్రస్తావించడంతో.. అప్పటినుంచి బాబాయి, అబ్బాయి మద్యం మనస్పర్ధలు మొదలయ్యాయి. అది జీర్ణించుకోలేని అభినవ్ భాస్కర్ తండ్రి ప్రణయ్ భాస్కర్ ఆత్మీయ సమావేశంలో తన ఆవేదనను వెళ్లగక్కారు. ఈ సమావేశానికి తండ్రితో పని చేసిన ద్వితీయ శ్రేణి నాయకులతోపాటు ప్రణయ భాస్కర్ అభిమానులకు ఈ సమావేశానికి ఆహ్వానం అందింది. తండ్రి అభిమానులు ఎదుట త్వరలో పార్టీ మారుతానని చెప్పారు. అయితే ఏ పార్టీలో చేరుతారనే విషయం మాత్రం ఆయన చెప్పలేదు. అభినవ్ భాస్కర్ బిజెపిలో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అభినవ్ భాస్కర్ విదేశాల్లో చదువుకున్నప్పుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తనయుడు కూడా మంచి మిత్రులని ఆయన అనుచరులు, సన్నిహిత వర్గాల సమాచారం. ఏదేమైనా గత రెండు దశాబ్దాలకు పైగా పైగా తన రాజకీయాన్ని కొనసాగిస్తూ వచ్చిన వినయ్ భాస్కర్ కు అబ్బాయి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ అవుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)