Yarapatineni Srinivasa Rao: రాబోయే ఎన్నికల్లో రాముడు, రావణాసురుడికి మధ్య పోటీ, మాజీ మంత్రి యారపతినేని
వైసీపీ నేతలపై టీడీపీ నేత మాజీ మంత్రి యారపతినేని శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు
రాబోయే ఎన్నికల్లో రాముడి లాంటి చంద్రబాబుకు, రావణాసురుడు లాంటి జగన్ కు మధ్య పోటీ జరుగుతుందని టీడీపీ మాజీ మంత్రి యారపతినేని శ్రీనివాసరావు వెల్లడించారు. ఇందులో అంతిమ విజయం తెలుగుదేశం పార్టీదేనని వెల్లడించారు. గుంటూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో పరిణామాలు చూస్తుంటే రావణ కాష్ఠంలా, తాలిబన్ల పాలనను తలపిస్తున్నాయని ఆరోపించారు. జగన్ నేర స్వభావంతో అధికారులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఒక ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రి అయితే ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు.
ప్రశాంత్ కిషోర్ టీంకు 300 కోట్ల ప్రజాధనం దోచిపెట్టారని, సాక్షి దినపత్రికకు 300 కోట్లకు పైగా ప్రకటనలు ఇచ్చారని విమర్శించారు. జగన్ నేర స్వభావం వల్ల రాబోయే రోజుల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. వైసీపీ పెద్దలు చెప్పే అడ్డమైన పనులు చేసి పోలీసు అధికారులు ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని సూచించారు. మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని ఆరెస్ట్ చేశారని, మరి వైసీపీ నాయకుల భాష ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. అలాంటి రోజా ఎన్నోసార్లు టీడీపీ నేతలపై ఎన్నో రకాల అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. టీడీపీ నేతలపై వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు, వారు మాట్లాడిన మాటలు పోలీసులకు కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరుల అరాచకాలు చూస్తుంటే అక్కడి పోలీసులు భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గొట్టిపాల్లలో వైసీపీ నేతలు టీడీపీ వారిని కొట్టడం కాకుండా మా వారిపై హత్యాయత్నం కేసు పెట్టారని... ఆ సమయంలో తిరుపతిలో ఉన్న జూలకంటి బ్రహ్మారెడ్డి పేరును కేసులో చేర్చారని విమర్శించారు. మాచర్లలో పోలీసులు చేసే అరాచకాలు పల్నాడు ఎస్పీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. భవిష్యత్తులో వైసీపీ వాళ్లనైనా క్షమిస్తాం కానీ... తప్పుడు కేసులు పెట్టి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన పోలీసు అధికారులను వదిలేది లేదని హెచ్చరించారు.
రాష్ట్రంలో వేలకోట్ల సంపాదన తవ్వి విదేశాలకు తరలించారని, నౌకాశ్రయాలను నచ్చినవారికి కట్టబెట్టారని ఇసుక తవ్వకాలు గంపగుత్తగా వారి మనుషులకు ఇచ్చారని దుయ్యబట్టారు. మద్యం అమ్మకాల్లో ప్రతి ఏటా 12 వందల కోట్లు జగన్ కు వస్తున్నాయని ఆరోపణలు గుర్తించారు. స్కిన్ డెవలప్మెంట్ 300 కోట్లు ఖర్చు చేస్తే అవి వృధా అన్నవారు ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసి 3 వేల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారిని ఏం చేయాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చే అప్పులకు, కాంట్రాక్టర్లకు చెల్లించే డబ్బులకు లెక్క లేదని భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా సాప్ట్ వేర్ మార్చాలని ఆరోపించారు.
వైసీపీ నేతలకు టైం దగ్గర పడిందని, త్వరలోనే ప్రజలు వారికి గుణపాఠం చెబుతారని చెప్పారు. టీడీపీ నాయకుల పై ఎన్ని అక్రమ కేసులు పెట్టిన భయపడే ప్రసక్తి లేదని వెల్లడించారు. రాజకీయ కుట్రలు చేసినా గాని ప్రజల్లో టీడీపీ పై నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తప్పకుండ వైసీపీని ఒడిస్తారని తెలిపారు.