T Congress BC Plan : బీసీలకు అత్యధిక సీట్లు - తెలంగాణ కాంగ్రెస్ కొత్త ప్లాన్ ?
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు స్థానాలు బీసీలకు ఇవ్వాలనుకుంటోంది కాంగ్రెస్. బీసీ వర్గాలను ఆకట్టుకుని గెలుపు మార్గాల్ని పెంచుకోవాలనుకుంటోంది.
T Congress BC Plan : తెలంగాణలో సానుకూల వాతావరణం ఉందనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. ముఖ్యంగా సామాజికవర్గ సమీకరణాలను పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది. బీసీ ఓట్ బ్యాంక్‌పై కాంగ్రెస్ గురి పెట్టింది. ఇందుకోసం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ నెల 30న పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఆమెతో బీసీ డిక్లరేషన్ ప్రియాంక ప్రకటింపచేయాలని నిర్ణయించుకున్నారు.
కొత్త వ్యూహాలతో రంగంలోకి కాంగ్రెస్
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి వ్యూహాలు అందించిన సునీల్ కనుగోలు..తెలంగాణ కాంగ్రెస్ కూ కొత్త ఆలోచనలు అందిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో బలాలు..బలహీనతలపైన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీకి నివేదిక అందించారు. రానున్న వంద రోజులు ప్రచార కార్యక్రమాలను ఉధృతం చేయాలని, పార్టీ అధికారంలోకి వస్తే వివిధ వర్గాలకు ఏం చేయనున్నామనే విషయాన్ని ఆ కార్యక్రమాల్లో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళల సంక్షేమం, అభివృద్ధికి కూడా ఏం చేయాలన్నదానిపైనా డిక్లరేషన్లు పూర్తి చేసి.. ప్రచార కార్యాచరణలో దిగాలని నిర్ణయించుకున్నారు.
బడుగు వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం
అన్ని వర్గాలకూ డిక్లరేషన్లు ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ డిక్లరేషన్ల రూపకల్పనకుగాను నిపుణులతో సబ్ కమిటీ వేస్తున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీసీలకు టికెట్లు ఇవ్వాలని ఆ పార్టీ యోచిస్తోంది. మొత్తంగా రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల పరిధిలో 34 మంది బీసీ అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తోంది. ఆగస్టు 15న కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గర్జన సభ నిర్వహించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన జరగనున్న సభలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు కాంగ్రెస్ ఏం చేయనున్నది వివరిస్తూ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. ఈ నెల 30న కొల్లాపూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ హాజరు కానున్నారు.
బీసీ గర్జనకు రాహుల్ ను ఆహ్వానించాలని నిర్ణయం !
ప్రియాంక సభలోనే మహిళా డిక్లరేషన్‌ను ప్రకటించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. బీసీ గర్జన సభను ఏర్పాటు చేసి, దానికి రాహుల్‌తోపాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కూడా ఆహ్వానించాలని బావిస్తున్నారు. పార్టీ వ్యుహకర్త సునీల్ కనుగోలు రాష్ట్రంలో ఎంపీ స్థానాల వారీగా పార్టీ బలాబలాలు.. వెనుకబడి ఉన్న చోట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించినట్లుగా తెలుస్తోంది. నేతల మధ్య అంతరాలున్నాయని, సంప్రదింపుల ద్వారా వాటిని తొలగించుకోవాలని లేకపోతే ఇబ్బందికరమని కనుగోలు సూచిస్తున్నట్లుగా చెబుతున్నారు.