Komatireddy Venkatreddy : అమిత్ షాను కలిసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - పార్టీ మారితే అందరికీ చెప్పే వెళ్తానని ప్రకటన !
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హోంమంత్రి అమిత్ షాను కలిశారు. పార్టీ మార్పు ఊహాగానాల కారణంగా ఈ భేటీ చర్చనీయాంశమయింది.
Komatireddy Venkatreddy : కోమటిరెడ్డి సోదరులు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వేర్వేరుగా కలిశారు. ముందుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలవగా.. తర్వాత రాజగోపాల్ రెడ్డి కలిశారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమైంది కనుక ఆయన భేటీలో విశేషం లేదు. కానీ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెబుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమిత్ షాతో భేటీ కావడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. తాను రాజకీయాలపై మాట్లాడటానికి కలవలేదని.. తెలంగాణకు వరద సాయం చేయాలని కోరేందుకు అమిత్ షాను కలిసినట్లుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు.
తెలంగాణకు వరద సాయం కోసం అమిత్ షాను కలిశానన్న వెంకటరెడ్డి
తెలంగాణకు జరిగిన వరద నష్టంపై అమిత్ షాతో చర్చించానని .. ప్రజాసమస్యల పరిష్కారం కోసమే భేటీ అయ్యానన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశానని గుర్తు చేశారు. పదవులు తనకు ముఖ్యం కాదన్నారు. అమిత్ షాతో భేటీ అయినంత మాత్రాన పార్టీ మారేది లేదన్నారు. ఒక వేళ వెళ్లానుకుంటే బరాబర్ చెప్పే వెళ్తానన్నారు. ఎవరికీ భయపడేది లేదన్నారు. తనను కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లగొట్టే కుట్ర జరుగుతోందని.. తన నియోజకవర్గ పరిధిలో తనను అడగకుడా సభను ఏర్పాటు చేయడమేమిటని కోమటిరెడ్డి ప్రశ్నించారు. తనను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్‌ను పార్టీలో చేర్చుకున్నారని మండిపడ్డారు.
పార్టీ మార్పు ఊహాగానాలతో భేటీకి ప్రాధాన్యం
పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలపై సోనియా, రాహుల్ వద్దనే తేల్చుకుంటానని వెంకటరెడ్డి ప్రకటించారు. చెరుకు సుధాకర్‌ను పార్టీలో చేర్చుకున్న అంశంపై వ్యతిరేకత వ్యక్తం చేసిన ఆయన రేవంత్ రెడ్డి ముఖం చూడనని ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి సోదరుల వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. రాజగోపాల్ రెడ్డితకో పాటు ఆయన సోదరుడు కూడా పార్టీ మారుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో అమిత్ షాతో భేటీ అయితే ఊహాగానాలకు మరింత ఊపు వస్తుందని తెలిసినా ఆయన అమిత్ షాతో భేటీ అయ్యారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేయలేమని బీజేపీ వైపు చూస్తున్నారా ?
రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేయలేనని సోదరుడి మాదిరిగానే నేరుగా చెబుతున్నారు. రేవంత్ మొహం చూడనని.. చెబుతున్నారు. పార్టీలో చేరికల్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డికే హైకమాండ్ ప్రాధాన్యం ఇస్తోందన్న కారణం చూపి ఆయన కూడా బీజేపీలో చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఒకటి, రెండు వారాల్లో దీనికి సంబంధించి కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటున్నారు.