Ponnam On TollyWood : టాలీవుడ్‌కు హెచ్చరిక పంపిన కాంగ్రెస్ - పొన్నం ప్రభాకర్ ఇచ్చిన సంకేతం అదేనా ?
Telangana : టాలీవుడ్‌కు కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికలు పంపారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై వివాదం ముగిసిందని ఇక చర్చ వద్దని గట్టిగానే స్పందించారు.
Congress Minister Ponnam Prabhakar sent warnings to Tollywood : భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా కార్యకర్తలు తనపై అసభ్యంగా పెట్టిన పోస్టుల విషయంలో కేటీఆర్‌ను టార్గెట్ చేసిన కొండ సురేఖ ఆ విషయంలో నాగార్జున కుటుంబాన్ని ప్రస్తావించారు. ఈ విషయంపై దుమారం రేగడంతో ఆమె తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఆయన కొండా సురేఖను వదిలేది లేదని నాగార్జున ఆయన కుటుంబం ప్రకటించారు. మరికొంత మంది సినీ నటులు కూడా అవసరం లేకపోయినా స్పందిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు అసంతృప్తికి గురయ్యారు. కొండా సురే్ఖ తన మాటల్ని వెనక్కి తీసుకున్న తర్వాత కూడా కొంత మంది స్పందించడం .. కొండా సురేఖను నిందించడం తేలికగా తీసుకోవడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ సంకేతాలు పంపారు.
కొండా సురేఖకు వ్యతిరేకంగా కొనసాగుతున్న టాలీవుడ్ ప్రకటనలు
తెలంగాణ మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించారు . అయితే ఆమె క్షమాపణ చెప్పలేదని నాగార్జున జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూల్లో చెప్పారు. వంద కోట్ల పరువు నష్టం వేస్తానని ప్రకటించారు. అలాగే మరికొంత మంది కూడా స్పందించారు. నిజానికి వివాదాస్పద ప్రకటనలు చేసిన తర్వాత రోజే కొండా సురేఖ తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇక వివాదం ముగించాలని స్వయంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ టాలీవుడ్ పెద్దల్ని కోరారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. దాంతో కాంగ్రెస్ పాలకులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
కొండా సురేఖకు పదవీ గండం - రాజీనామా చేయాలని హైకమాండ్ ఒత్తిడి !
పొన్నం ప్రభాకర్ వి సూచనల్లాంటి హెచ్చరికలే ?
బలహీనవర్గాలకు చెందిన కొండాసురేఖ ఒంటరి కాదని ఆమె వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న తర్వాత టాలీవుడ్ ప్రముఖులు ఇంకా ఇష్యూను కొనసాగించాలనుకోవడం మంచిది కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఆయన మాటలు టాలీవుడ్ ఇక ఆ అంశాన్ని మార్చిపోవాలని సూటిగా ఇచ్చిన సందేశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పాలక పార్టీ. ప్రతిపక్ష పార్టీ అయితే పట్టించకోవాల్సిన అవసరం ఉండదు. కానీ టాలీవుడ్.. ప్రభుత్వానికి ఎదురెళ్లేంత సాహసం చేయదు. బీఆర్ెస్ హయాంలో ఏం జరిగినా సైలెంట్ గా ఉండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో అతిగా స్పందిస్తున్నారన్న అభిప్రాయం కాంగ్రెస్ పాలకుల్లో ఉంది. తల్చుకుంటే.. తాము కూడా బీఆర్ఎస్ హయాంలో వారు ఏం చేయగలరో అంతకు మించి చేసి చూపిస్తామని పొన్నం మాటల్లో హెచ్చరికలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికీ టాలీవుడ్ బీఆర్ఎస్ పెద్దల గుప్పిట్లో ఉందని కాంగ్రెస్ భావన
కొండా సురేఖ అంశంపై కాంగ్రెస్ వ్యతిరేకత వ్యక్తం చేసే వారి విషయంలో కటువుగా లేకపోవడంతో చివరికి పోసాని కూడా తెరపైకి వచ్చి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఓ అభిప్రాయం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి కల్పించకూడదని.. ఇంతటితో ఆపకపోతే తదుపరి పరిణామాలు ఎదుర్కోవాల్సిందేనని సంకేతాన్ని పంపారు. టాలీవుడ్‌కు చెందిన వారు ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలకే సన్నిహితంగా ఉంటున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి వారిని ఉపయోగించుకుంటున్నారన్న అనుమానాలను కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే నేరుగా పొన్నం ప్రభాకర్ రంగలోకి వచ్చారంటున్నారు. మరి పొన్నం హెచ్చరికల తర్వాత టాలీవుడ్ సౌండ్ చేస్తుందా ?