Revanth Reddy : రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే పీసీసీ - కాంగ్రెస్ సీనియర్లకు కాలం కలసి రాలేదా ?
Telangana Congress : రేవంత్ రెడ్డి కోరుకున్న వ్యక్తినే పీసీసీ అధ్యక్షుడిగా హైకమాండ్ నియమించింది. పార్టీపై పట్టు సాధించేలా ఉండే నాయకులు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది.
Congress High Command appointed the person Revanth Reddy wanted as the President of PCC : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ప్రకటన జారీ చేసింది. గత వారమే ఆయన పేరు ఖరారయిందని అధికారిక ప్రకటనే మిగిలి ఉందని చెప్పుకున్నారు. అయితే చివరి క్షణం వరకూ ఆ పదవి కోసం ప్రయత్నించిన వారు ఉన్నారు. కానీ మహేష్ కుమార్ గౌడ్.. రేవంత్ రెడ్డి చాయిస్. అందుకే రేవంత్ పట్టుబట్టి ఆయన పేరును ఖరారు చేసుకున్నారు. ఇప్పటికే రేవంత్ కు అలవిమాలిన స్వేచ్చ ఇచ్చారని పీసీసీచీఫ్ ను కూడా ఆయన మనిషినే పెడితే పార్టీకి ఇబ్బంది అని చాలా మంది వాదించినా హైకమాండ్ తగ్గలేదు. రేవంత్ మాటకే విలువ ఇచ్చింది.
బలమైన వాయిస్ వినిపించే నేతకివ్వాలని సీనియర్ల లాబీయింగ్
ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా వైదొలగాలనుకున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల బాధ్యత కూడా హైకమాండ్ ఆయన పై పెట్టింది. పెద్దగా కాకపోయినా పరువు పోకుండా ఫలితాలను సాధించడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత తన పదవి కాలం ముగిసినందున కొత్త పీసీసీ చీఫ్ ను నియమించాలని హైకమాండ్ ను కోరారు. ఎవర్ని నియమించాలో కూడా సిఫారసు చేశారు. బీసీ వర్గానికి ఇవ్వాలని ఆయన చెప్పారు. దానికి తగ్గట్లుగానే .. బీసీల్లో బలమైన నాయకుడిగా ఉన్న మధుయాష్కీకి ఇవ్వాలని కొంత మంది లాబీయింగ్ చేశారు. రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేరున్న మధుయాష్కీ కూడా.. పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకుని భువనగిరి లోక్‌సభ సీటు నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపలేదు.
ఏపీలో వరదలపై ఒక్క రూపాయీ ఇవ్వలేదు - కేంద్రం సాయంపై చంద్రబాబు స్పష్టత
మధుయాష్కీతో సమస్యలు వస్తాయనుకున్న రేవంత్
మధుయాష్కీ కి.. రేవంత్ రెడ్డితో అంత గొప్ప ర్యాపో లేదు. గతంలో రేవంత్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయన పీసీసీ చీఫ్ అయితే పార్టీ విషయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తారు. అప్పుడు పార్టీకి, ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతుంది. అంతిమంగా అది.. పార్టీకి నష్టం చేస్తుంది. అదే మహేష్ కుమార్ గౌడ్ అయితే రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా వింటారు. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు డీఎస్, కె.కేశవరావులు పీసీసీ చీఫ్‌లుగా ఉండేవారు. వారు వైఎస్ ఎంత చెబితే అంత అన్నట్లుగా ఉండేవారు. కాబట్టి స్మూత్ గా నడిచిపోయింది. ఇప్పుడు కూడా అలాగే నడిచిపోవాలని రేవంత్ కోరుకుకున్నారు. ఆయన కోరికను హైకమాండ్ మన్నించింది. మహేష్ కుమార్ పీసీసీగా ఉన్నా..రేవంత్ కనుసన్నల్లోనే నడుస్తోంది.
రేవంత్ ప్రాధాన్యత తగ్గించాలని చేసిన ప్రయత్నాలు ఫెయిల్
రేవంత్ ప్రాధాన్యతను తగ్గించాలని హైకమాండ్ కు చాలా మంది సీనియర్ నేతలు పదే పదే ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి బీజేపీతో సన్నిహితం అవుతున్నారని కూడా చెప్పారు. వివిధ అంశాల్లో రేవంత్ తీరును సందేహిస్తూ నివేదికలు పంపారు. చివరికి అది ఎలాంటి స్థాయికి వచ్చిందంటే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారు.. సీఎం మార్పు ఉంటుందన్నట్లుగా ప్రకటనలు చేస్తూవస్తున్నారు.
అయితే హైకమాండ్ మాత్రం.. రేవంత్ రెడ్డిపై పూర్తి స్థాయిలో నమ్మకాన్ని ఉంచిందని తాజా నియామకంతో తేలిపోయింది. సీనియర్లు అంతా ఇక సైలెంట్ గా.. రేవంత్ కనుసన్నల్లోనే తమ రాజకీయ పయనం సాగించాల్సి ఉంటుంది కానీ ఆయనపై రాజకీయం చేయాలంటే.. ఆలోచించాల్సి ఉంటుంది. ప్రభుత్వంపై పూర్తి స్థాయి పట్టు సాధించే ప్రయత్నంలో ముందడుగు వేస్తున్న రేవంత్.. పార్టీ పైనా అదే స్థాయిలో పట్టు సాధిస్తున్నారని అనుకోవచ్చు.