Telangana Local Body Elections 2025: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి: కాంగ్రెస్ బీసీ అస్త్రం, బీజేపీ కౌంటర్ అటాక్.. బీఆర్ఎస్ వ్యూహం ఏమిటి?
Telangana Local Body Elections 2025: తెలంగాణ స్థానికల ఎన్నికల వేళ బీసీ ఛాంపియన్స్‌గా కాంగ్రెస్ ప్రచారం చేస్తుంటే బనకచర్ల సెంటిమెంట్ అస్త్రాన్ని బీఆర్‌ఎస్ బయటకు తీస్కోంది.

Telangana Local Body Elections 2025: తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. హైకోర్టు ఆదేశాలతో కచ్చితంగా ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే అస్త్రశస్త్రాలతో పార్టీలు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. పార్టీలకు ఆయువుపట్టుగా భావించే ఈ ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీలు రెండు అజెండాలతో ముందుకు వెళ్తున్నాయి.
కాంగ్రెస్ చేతిలో రెండు అస్త్రాలు
అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ అజెండా ఎత్తుకొని తెలంగాణంలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ భిన్నమైన వ్యూహాలతో వెళ్తోంది. ఇప్పటి వరకు ప్రజలకు అందించిన సంక్షేమ పాలన ఒక అజెండా అయితే మరొక కీలకమైన అజెండా బీసీ రిజర్వేషన్లు. కులగణన చేపట్టి బీసీలకు న్యాయపరంగా రావాల్సిన రిజర్వేషన్లు కల్పించడంలో ఛాంపియన్లుగా వచ్చామని ప్రజల ముందుకెళ్లి ఓట్లు అడగబోతోంది. స్థానిక అభ్యర్థులకు ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు.
కాంగ్రెస్‌కు ప్రధాన అస్త్రం బీసీ రిజర్వేషన్లు
ఉచిత బస్, ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే సాధ్యమైందని ప్రజలను మెప్పించబోతోంది. ఇది ప్రజలకు చెబుతూనే బీసీ రిజర్వేషన్ అంశాన్ని ప్రజల ముందు చర్చకు పెడుతోంది. అందుకే ఆర్డినెన్స్ తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజ్వరేషన్లు అమలుకు సిద్ధమైంది. ప్రస్తుతానికి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లును ఒత్తిడి తీసుకొచ్చి ఆమోదింపజేస్తామని ప్రచారం చేయనుంది. వచ్చే ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో బీసీ రిజర్వేషన్లు తీసుకొస్తామని గట్టిగా చెబుతోంది. బీసీ వర్గం ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది.
కేంద్రాన్ని దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నం
బీసీ రిజర్వేషన్ కల్పించడంలో దేశానికి ఆదర్శంగా మారామంటూ కాంగ్రెస్‌లోని ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరీతో చెప్పిస్తోంది. ప్రస్తుతం రిజర్వేషన్ల బంతి కేంద్రం కోర్టులోనే ఉందని ప్రజలకు వివరిస్తోంది. చిత్తశుద్ధితో రూపొందించిన బిల్లును ఆమోదింపజేసేందుకు స్థానికి బీజేపీ నేతలు కలిసి రావాలని కూడా పిలుపునిస్తున్నారు. కేంద్ర పెద్దలను ఒప్పించి బీసీ బిల్లును ఆమోదించేలా చూడాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు.
దత్తత్రేయ పేరు తేవడంతో అలర్ట్ అయిన బీజేపీ
అంతే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో కీలకమైన డిమాండ్ ఒకటిచేశారు. బీసీ నేత అయిన బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయాలని కొత్త వాదన తీసుకొచ్చారు. "ఉపరాష్ట్రపతి పదవిని ఈదఫా తెలంగాణకు ఇవ్వాలి. ఉపరాష్ట్రపతిగా ఉన్న తెలుగు వ్యక్తి వెంకయ్య నాయుడును రాష్ట్రపతి కాకుండా ఇంటికి పంపించారు. సికింద్రాబాద్ నుంచి గెలిచి కేంద్రమంత్రిగా ఉన్న బీసీ నేత దత్తాత్రేయను గవర్నర్‌గా పంపి ఆ పదవిని కిషన్ రెడ్డికి ఇచ్చారు. బీసీ నేతగా ఉన్న సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి కిషన్ రెడ్డికి, ఆయన తర్వాత రాంచందర్‌రావుకు ఇచ్చారు. బీజేపీ బీసీలకు అన్యాయం చేసింది. బీసీలకు చేసిన ఈ అన్యాయాన్ని సరిచేసుకునేందుకు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తే బాగుంటుంది. మద్దతు ఇచ్చే విషయంలో ప్రయత్నం చేస్తాను"
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల విషయంలో తమను ఇరికించేందుకు కాంగ్రెస్ వేస్తోన్న ఎత్తుగడని పసిగట్టింది బీజేపీ. అందుకే విరుగుడుగా ముస్లింలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఏంటని నిలదీస్తోంది. ఇలా చేయడం వల్ల రెండు శాతం రిజర్వేషన్లు నిజమైన బీసీలు కోల్పోతున్నారని బీజేపీ ప్రచారం మొదలు పెట్టింది. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి తీసుకొచ్చింది. "సీఎం రేవంత్ రెడ్డి బండారు దత్తాత్రేయను వైస్ ప్రెసిడెంట్ చేయాలంటున్నారు కదా, మేము అడుగుతున్నాము పొన్నం ప్రభాకర్‌ను లేదా నా ఫ్రెండ్ మహేష్ కుమార్ గౌడ్ ని ముఖ్యమంత్రిగా చేయండి" అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు డిమాండ్ చేశారు. స్వయంగా తాను బీసీనని చెప్పుకున్నారు రామచందర్‌రావు. బిసిలకి తమ మొదటి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిసిలకి ఎక్కువ సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
హిందూ- ముస్లిం సెంటిమెంట్‌తో బీజేపీ
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఇదే లైన్‌లో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ను బీసీల ఛాంపియన్ కాదని చీటింగ్ చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు 42 శాతం రిజర్వేషన్లు అంటూ ఊదరగొడుతున్న రేవంత్ రెడ్డి వాస్తవంగా వాళ్లకు ఇచ్చేది 32 రెండు శాతమేనని అన్నారు. ఇందులో పది శాతం అసదుద్దీన్, అక్బరుద్దీన్, అజహర్, షబ్బీర్ అలీ లాంటి వాళ్లకు వెళ్తాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ తీసుకొచ్చిన రిజర్వేషన్‌లతో ఎన్నికలకు వెళ్తే ఎక్కువ చోట్ల ముస్లింలకు పోటీ చేసే అవకాశం లభిస్తుందని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు, బనకచర్లతోనే బీఆర్‌ఎస్ రాజకీయం
కాంగ్రెస్ బీజేపీ మధ్య రాజకీయం ఇలా ఉంటే బీఆర్‌ఎస్ మాత్రం తన పాత సెంటిమెంట్ అస్త్రాన్ని మరోసారి తీస్తోంది. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నాడని ప్రచారం చేస్తోంది. ఆయన్ని కట్టడి చేసేందుకు ముందస్తుగానే బనచకర్ల వివాదాన్ని తెరపైకి తీసుకొస్తోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడుతున్న చంద్రబాబు చెప్పినట్టు బీజేపీ లీడర్లు నడుచుకుంటున్నారని, తన గురువుకు నీళ్లు దారాదత్తం చేస్తున్నారని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తోంది. చంద్రబాబు పేరుతో రేవంత్, బీజేపీని కొట్టొచ్చని భావిస్తోంది. బీసీ వర్గీకరణ జోలికి వెళ్లకుండా కేవలం బనకచర్ల, చంద్రబాబు టార్గెట్‌గానే పని చేస్తోంది బీఆర్‌ఎస్. మీటింగ్ ఎలాంటిదైనా, పాల్గొన్నది ఏ లీడర్ అయినా సరే కృష్ణాగోదావరి నీళ్లు, బనకచర్ల, చంద్రబాబు ప్రస్తావన లేకుండా వారి ప్రసంగాలు సాగడం లేదు.
అందుకే బీఆర్‌ఎస్ ప్రచారానికి విరుగుడుగా బహిరంగ సభల్లో నీళ్ల విషయంలో రాజీ పడబోమని కాంగ్రెస్ నేతలు పదే పదే చెబుతున్నారు. ఈ మధ్య కేంద్ర మంత్రి నిర్వహించిన మీటింగ్‌కు వెళ్లి ఇదే విషయాన్ని చెప్పామంటున్నారు. ప్రస్తుతానికి దీనిపై ఎక్కువ ఫోకస్ చేయడం కంటే బీసీ రిజర్వేషన్లు, సంక్షేమాన్ని ఎక్కువ ప్రచారం చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. బీఆర్‌ఎస్ మాత్రం బీసీ రిజర్వేషన్ అంశాన్ని పట్టించుకోకుండా కేవలం నీళ్లపైనే సెంటిమెంట్ నిప్పులు రాజేసే ప్రయత్న చేస్తోంది. అప్పుడప్పుడూ ఒకరిద్దరు మాట్లాడుతున్నా పెద్దగా ప్రజల్లోకి వెళ్లడం లేదు.





















