సోషల్ మీడియా పోస్టుతో ఇచ్చాపురం వైసీపీలో కలకలం- టికెట్ ప్రయత్నాలు ముమ్మరం చేసిన నేతలు
వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారు అయిపోయిందని ఓ పోస్టు వైసీపీ సర్కిల్‌లోనే చక్కర్లు కొట్టింది. ఇదే పోస్టు సిక్కోలు రాజకీయాల్లో సంచలనంగా మారింది.
సోషల్ మీడియాలో ముఖ్యంగా వైసీపీ గ్రూప్‌ల్లో చక్కర్లుకొట్టిన ఓ న్యూస్ ఇప్పుడు సిక్కోలు రాజకీయాలను షేక్ చేసింది. ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గం వైసీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది.
వైసీపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేయాలో అనేది దాదాపు ఖరారు అయిపోయిందని ఓ పోస్టు వైసీపీ సర్కిల్‌లోనే చక్కర్లు కొట్టింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన నియోజకవర్గాల్లో దాదాపు అన్ని స్థానాల్లో అభ్యర్థులు ఫైనల్ అయిపోయిందని అందులో చెప్పుకొచ్చారు. పేర్లు కూడా చెప్పేశారు. ఇదేం అఫీషియల్ కాకపోయినా శ్రీకాకుళంలో మాత్రం హట్ టాపిక్‌గా మారిందీ పోస్టు. ఇది వేరే పార్టీ గ్రూపుల్లోనో ఇతర వేదికలపై షేర్ అయ్యి ఉంటే వారంతా సీరియస్‌గా తీసుకునే వాళ్లు కాదేమో. కానీ వైసీపీలో కీలకమైన నేతలు ఉన్న గ్రూపుల్లోనే షేర్ కావడంతో పెద్ద దుమారం రేపింది.
శ్రీకాకుళం జిల్లాలో కచ్చితంగా గెలుచుకోవాలని చూస్తున్న నియోజకవర్గాల్లో ఇచ్చాపురం ఒకటి. ఈ నియోజకవర్గంలో ఒకటి రెండుసార్లు మినహా ఎప్పుడూ టీడీపీనే పై చేయి సాధిస్తోంది. ఈసారి ఎలాగైనా ఆ స్థానాన్ని కొట్టాలని వైసీపీ పట్టుదలతో ఉంది. సామాజిక సమీకరణాలను, ఇతర బలాబలాలను బేరీజు వేసుకొని సైలెంట్‌గా పని చేస్తోంది వైసీపీ.
అందుకే నియోజకవర్గంలో ప్రభావం చూపే యాదవ సామాజిక వర్గంలో పట్టు తప్పిపోకుండా నర్తు రామారావుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతల్లో ఆయన కూడా ఉన్నారు. ముందుగానే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి పోటీ నుంచి తప్పించింది అధినాయకత్వం. ఇప్పుడు మిగిలిన రెండు సామాజిక వర్గాలు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందులో ఒకటి కాళింగ రెండో రెడ్డిక సామాజిక వర్గం.
శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ బీసీలతో అధిపత్యం.జనాభాలో అత్యధికంగా ఉన్న తూర్పుకాపు, పోలినాటి వెలమ, కాళింగ సామాజిక నేతలే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. ఇచ్చాపురంలో అయితే కాళింగులతోపాటు రెడ్డిక, యాదవ సామాజిక వర్గాలు పోటీ పడుతుంటారు. ఇన్ని రోజులు వేరే సామాజిక వర్గాలకు ఛాన్స్ ఇచ్చారని ఈసారి తమకు అవకాశం కల్పించాలని రెడ్డిక సామాజిక వర్గం ఎప్పటి నుంచో విన్నపాలు చేస్తోంది. అధినాయకత్వం దృష్టిలో పడేందుకు చాలా ప్రయత్నాలు చేశారు ఈ సామాజిక వర్గానికి చెందిన నేతలు.
మూడు రోజుల నుంచి వైసీపీ నడిపిస్తున్న సోషల్ మీడియాలోనే తిరుగుతున్న అభ్యర్థుల లిస్ట్ రెడ్డిక సామాజిక వర్గ నేతలను ఇలికిపడేలా చేసింది. ఇచ్చాపురం నియోజకవర్గానికి పిరియా సాయిరాజ్ లేదా ఆయన భార్య ప్రస్తుతం జెడ్పీ ఛైర్పర్సన్ విజయకు టికెట్ ఇస్తారని అందులో ఉంది. వారిద్దరిలో ఒకరికి బి.ఫారం ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిర్ణయించందని కూడా ప్రచారం నడుస్తోంది. దీంతో రెడ్డిక సామాజికవర్గం నేతలు ఒత్తిడి ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఇలాంటి ఆలోచన అధినాయకత్వం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా వెనుకాడబోమంటున్నారు.
టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 7 సార్లు టీడీపీ విజయం సాధించింది. 2004లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడ టీడీపీకి కంచుకోటగా ఉన్న కాళింగ ఓటు బ్యాంకును చీల్చేందుకు వైసీపీ పిరియా సాయిరాజ్ భార్య పిరియా విజయకి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు అప్పగించారు. అయినా మార్పు రాలేదంటున్నారు రెడ్డిక సామాజిక వర్గ నేతలు. అలాంటప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు టికెట్ ఇచ్చే సాహసం చేయదని అంటున్నారు.
అత్యధిక సంఖ్యాబలం కలిగిన రెడ్డిక సామాజిక వర్గానికి ఈసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. లేకుంటే తమదారి తాము చూసుకుంటామని హెచ్చిరిస్తున్నారు. స్వతంత్రంగా పోటీ చేస్తామంటు సంకేతాలు పంపుతున్నారు. ఏపీ సీడ్ ఛైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి, నర్తు నరేంద్ర యాదవ్, మారిటైం బోర్డు ఛైర్మన్ కాయల వెంకటరెడ్డి బి.ఫారం కావాలని కోరుకునే జాబితాలో ఉన్నారు.