YSRCP Welfare Survey : సంక్షేమాన్ని మించి అసంతృప్తి - చల్లార్చచేందుకు వైఎస్ఆర్‌సీపీ ప్రయత్నాలు ! ఇక నేరుగా రంగంలోకి సీఎం జగన్
ఏపీ ప్రజల్లో అసంతృప్తిని తగ్గించడానికి సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగనున్నారు. బీసీ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించే సభలకు ఆయన స్వయంగా హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.
YSRCP Welfare Survey : సంక్షేమ పథకాలపై వైఎస్ఆర్‌సీపీ ఎంతో నమ్మకం పెట్టుకుంది. ప్రతి ఇంటికి మేలు చేస్తున్నామని.. మేలు జరిగితేనే ఓట్లు వేయండని సీఎం జగన్ ఈ మధ్య బహిరంగసభల్లో కోరుతున్నారు. సంక్షేమంపై జగన్ అంత నమ్మకం పెట్టుకున్నారు. మరి క్షేత్ర స్థాయిలో అలా ఉందా ?. సంక్షేమ పథకాలపై రకరకాల ప్రచారాలు బయట జరుగుతున్నాయి. దీంతో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అంతర్గత సర్వే నిర్వహించాలని నిర్ణయించుకుంది. అసలు సంక్షేమంలో అసంతృప్తి ఎక్కడ వస్తోంది ? వారిని ఎలా సంతృప్తి స్థాయికి తీసుకెళ్లాలి ? వంటి అంశాలపై సర్కార్ అంతర్గత సర్వే నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ప్రత్యేక వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలపై సర్వే !
సంక్షేమ పథకాల అమల్లో లోపాలు ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంతర్గత సర్వేలు నిర్వహిస్తూ వస్తోంది. వాలంటీర్ల నుండి వస్తున్న సమాచారంతో పాటు సొంత వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు ప్రత్యేక నివేదికలు తెప్పించుకుంటోంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలు అందుతున్న ప్రజల్లో సంతృప్తి ఎలా ఉందనే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలిసింది. శాచురేషన్ అనేది సీఎం నోటి వెంట పదే పదే వస్తుంది. అంటే సంతృప్త స్థాయిలో పథకాలు ఇవ్వాలనేది ఆయన లక్ష్యం. ఇప్పుడు ఎన్నికలకు వెళ్లబోతున్న సమయంలో ఈ శాచురేషన్ స్థాయికి వెళ్లామా లేదా అన్నదానిపై ప్రత్యేక పరిశీలన జరుపుతున్నారు.
గడప గడపకూ కార్యక్రమంలో నిలదీతలపై పరిశీలన !
గడప గడపకూ మన ప్రభుత్వం వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలను పలుచోట్ల ప్రజలు నిలదీశారు. దీంతో ప్రజా ప్రతినిధులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా ఎందుకు జరిగిందనే కోణంలోనూ ప్రభుత్వం, వైసిపి నాయకులు అంతర్గత సర్వే నిర్వహిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు తీరుపై అంతర్గతంగా సమాచారం సేకరించారు. ఎక్కువచోట్ల నుండి కొంత అనుకూలత ఉన్నప్పటికీ పెరిగిన భారాల వల్ల ప్రజల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతు న్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సంక్షేమ కార్యక్రమాల అమల్లో భాగంగా ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమచేయడంతో స్థానిక ప్రజాప్రతినిధులతో ప్రత్యక్ష సంబంధాలు తగ్గాయి. ముఖ్యమంత్రే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేయడం వల్ల ఎమ్మెల్యేలతో పెద్దగా అవసరం లేకుండా పోయిందనే అభిప్రాయం ప్రజల్లో వెల్లడయింది.దీని వల్ల పార్టీకే నష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అన్ని వర్గా ప్రజలను కలిసేలా కొత్త కార్యక్రమాలు !
గడప గడపకూ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలనూ కలుసుకునే విధంగా ప్రభుత్వం కొత్త కార్యక్రమాలను ఖరారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బీసీ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. దీనికోసం ప్రభుత్వం వైపు నుండి కులాల వారీగా బుక్‌లెట్లు ప్రచురిస్తున్నారు. కార్పొరేషన్ల వారీగా సమాచారం తీసుకుని, వాటిని ఆయా కులాల సభల్లో పంచనున్నారు. ఈ సభలకు ముఖ్యమంత్రి స్థాయిలో ఆయా వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడం, అదే వేదికపై ఎమ్మెల్యేలు, ఎంపిలకు ప్రాధాన్యత కల్పించడం ద్వారా ప్రజల్లో అక్కడక్కడా ఉన్న అసంతృప్తిని కూడా తగ్గించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందుకే జయహో బీసీ సభకు జగన్ స్వయంగా హాజరుతున్నారు.
మరోసారి పార్టీ నేతలందరూ ఇంటింటికి వెళ్లే ప్రోగ్రాం
మరో విడత ప్రజా ప్రతినిధులందరూ ఇంటింటికీ వెళ్లే కార్యక్రమానికి వైఎస్ఆర్‌సీపీ వ్యూహకర్తలు రెడీ చేస్తున్నారు. గడప గడపకూ ప్రోగాం.. జనవరితో పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మరో విడత జనంలోకి పార్టీ నేతలను పంపనున్నారు. ఎన్నికయ్యే వరకూ ప్రజల్లోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు.