(Source: ECI/ABP News/ABP Majha)
CM Jagan Davos Tour Contro : దావోస్ కంటే ముందు జగన్ లండన్ వెళ్లారా? అసలు నిజం ఏమిటి ?
దావోస్ పర్యటనకు బయలుదేరిన సీఎం జగన్ నేరుగా లండన్‌లో ల్యాండ్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఆయన మరో దేశానికి వెళ్తారని కానీ.. ఇతర వివరాలను కానీ వెల్లడించలేదు. ప్రత్యేక విమానంలో ఆయన దావోస్ బయలుదేరినట్లుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే ఆయన దావోస్ వెళ్లలేదని నేరుగా లండన్ వెళ్లారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ కోర్టు అనుమతి తీసుకుంది ఏ దేశానికి వెళ్లడానికి అని టీడీపీ నేత యనమల ప్రశ్నించారు. ఏ దేశానికి అనుమతి తీసుకుని ఏ దేశానికి వెళ్లారని ఆయన ప్రశ్నించారు. అనధికారికంగా ఎందుకు వెళ్లారని అధికారికంగానే వెళ్లవచ్చు కదా అని ప్రశ్నించారు.
సీఎంతో పాటు ప్రత్యేక విమానంలో ముందుగాప్రకటించినట్లుగా అధికార బృందం కూడా వెళ్లలేదని చెబుతున్నారు. సీఎం తన సతీమణితో పాటు ఏవియేషన్ డైరక్టర్ భరత్ రెడ్డితో పాటు లండన్ వెళ్లారని ఇతరులు ఇతర విమానాల్లో దావోస్ చేరుకున్నారని చెబుతున్నారు. సీఎం జగన్ లండన్ పర్యటనకు వెళ్లారని వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు. సీఎం పర్యటనలో "డీవియేషన్లు" ఉన్నాయని ఇంకా చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక ట్విట్టర్ ఖాతాలో దావోస్‌కు బయలుదేరిన సీఎం అనే పోస్ట్ పెట్టారు కానీ.. ఆయన దావోస్ చేరుకున్నారన్న విషయం మాత్రం ఖరారు చేయలేదు. అయితే కొన్ని మీడియాలు మాత్రం ఆయన దావోస్ చేరుకున్నాయని ప్రకటించాయి.
దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం విజయవాడ నుంచి బయలుదేరిన సీఎం శ్రీ వైయస్.జగన్.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 20, 2022
మే 22 నుంచి మే 26 వరకు జరగనున్న డబ్ల్యూఇఎఫ్ సదస్సు. గన్నవరం విమానాశ్రయంలో వీడ్కోలు పలికిన సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు. pic.twitter.com/i90HGSo7uO
సీఎం జగన్ లండన్ వెళ్లడం తప్పేమీ కాదు. కానీ అధికారికంగా షెడ్యూల్‌లో లేకుండా ఎందుకు వెళ్లారన్న విమర్శలనే టీడీపీ నేతలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రజాధనంతో అత్యంత లగ్జరీ విమానాన్ని ప్రత్యేకంగా మాట్లాడుకుని వ్యక్తిగత పర్యటనలకు వెళ్తున్నారని కొంత మంది విమర్శిస్తున్నారు. పారిస్ బిజినెస్ స్కూల్‌లో జగన్ కుమార్తె చదువుకుంటున్నారు. అయితే లండన్‌లో జగన్‌కు వ్యక్తిగత, అధికారిక పర్యటన ఏమైనా ఉందో లేదో తేలాల్సి ఉంది.
జగన్ లండన్ వెళ్లారో లేదో ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తేనే తెలుస్తుంది. టీడీపీ నేతలు మాత్రం లండన్ వెళ్లారని చెబుతున్నారు. దానికి సాక్ష్యం అంటూ సోషల్ మీడియాలో ఫ్లైట్ ట్రాకింగ్ అంటూ కొన్ని వివరాలు పెడుతున్నారు. మామూలుగా సీఎం పర్యటన పారదర్శకంగా లేకపోతే తీవ్ర ఆరోపణలు వస్తాయి. ఇప్పుడు ఏపీలో అదే పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇస్తేనే దీనిపై చర్చలు ఆగే అవకాశం కనిపిస్తోంది.