CM Jagan letter: కృష్ణా జలాల అంశంపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. కృష్ణ ట్రైబ్యునల్(Krishna Tribunal) విషయంలో జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. కృష్ణ ట్రైబ్యునల్(Krishna Tribunal) విషయంలో జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తదుపరి చర్యలు తీసుకోకుండా నిలిపి వేయాలని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం కృష్ణా జలాల పై కోర్టులో కేసులు పెండింగ్ ఉండడంతో తదుపరి చర్యలు నిలిపి వేయాలని జగన్ కోరారు. ప్రధానికి ముఖ్యమంత్రి రాసిన లేఖలో కీలక అంశాలు వెల్లడించారు.
1956 నాటి అంతర్ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం (ISRWD)లోని సెక్షన్ 4 ప్రకారం... కృష్ణా జలవివాద ట్రైబ్యునల్ -1 (బచావత్, KWDT -1)ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. KWDT -I ఇచ్చిన తుది నివేదిక ఆధారంగా 1976, మే 31న దీన్ని గెజిట్ చేశారని చెప్పారు. కృష్ణానదిలో 2130 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని... KWDT -I ట్రైబ్యునల్ లెక్కకట్టిందని వెల్లడించారు. 75శాతం ప్రవాహాలు ఉంటాయన్న అంచనాతో ఈ లెక్క వేసిందని.... దీని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి KWDT-I 811 టీఎంసీల నీటిని కేటాయించింది చెప్పారు. 2130 టీఎంసీల కన్నా అధికంగా ఉన్న నీటిని, మిగులు ప్రవాహాలను ఉపయోగించుకునేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వేచ్చ ఇచ్చిందన్నారు. ISRWD చట్టం, 1956లోని సెక్షన్ 6(1) ప్రకారం, KWDT-I చేసిన అవార్డును సుప్రీం కోర్ట్ డిక్రీ ద్వారా అమల్లోకి వచ్చిందని వెల్లడించారు.
ISRWD చట్టం, 1956లోని సెక్షన్ 4 (1) ప్రకారం 2004 ఏప్రిల్ 2న KWDT-II (బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్)ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ట్రైబ్యునల్ 2010 డిసెంబర్ 30న తన ‘నివేదిక’ని సమర్పించింది. KWDT-II (బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్) 2013 నవంబర్ 29న సెక్షన్ 5(3) ప్రకారం KWDT-I ద్వారా ఇప్పటికే 75 శాతం డిపెండబిలిటీతో చేసిన 2,130 TMCల కేటాయింపులను నిర్ధారిస్తూ తన ‘తదుపరి నివేదిక’ను సమర్పించింది. దీంతోపాటు బేసిన్ రాష్ట్రాలకు సగటు ప్రవాహాలతో సహా 65 శాతం ఆధారపడదగిన అదనపు నీటిని కూడా కేటాయించింది, దీని కింద, పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 194 TMC కేటాయించబడింది. ఈ విధంగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చేసిన మొత్తం కేటాయింపు 1005 TMC (811 TMC +194 TMC) వరకు చేరుతుంది. దీంతోపాటు 2578 TMC కంటే ఎక్కువుగా ఉండే అదనపు ప్రవాహాలను ఉపయోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌కు స్వేచ్చ ఇచ్చిందని ప్రధాని మోడీ దృష్టికి సీఎం జగన్ తీసుకెళ్లారు.
KWDT-II నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో 5 SLPలను కృష్ణానదీజలాలపై ఆధారపడ్డ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో దాఖలు చేశాయి. సెక్షన్ 5(2) ప్రకారం KWDT-II నివేదికను పక్కన పెట్టాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. సుప్రీం కోర్ట్ తన ఉత్తర్వుల ద్వారా 2011 సెప్టెంబర్ 16న KWDT-IIపై స్టే ఇచ్చింది. అన్ని SLPలు సుప్రీంకోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని ప్రధాని వివరించారు.. దీనికి సంబంధించి, నేను ఈ సమస్యను కేంద్ర జలశక్తిశాఖ మంత్రి దృష్టికి 2021 వ సంవత్సరంలో తర్వాత 2022వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ట్రైబ్యునల్ ద్వారా జరిగిన కేటాయింపులకు ఎలాంటి భంగంరాకుండా చట్టపంగా న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు.
ISRWD చట్టం, 1956 సెక్షన్ 5(1) ప్రకారం KWDT-IIకి విధివిధానాలు (ToR) జారీకి.2023 వ సంవత్సరంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. 2014 వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థన, ఫిర్యాదు ప్రకారం.. ఈ విధివిధానాలు కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకే పరిమితం చేశారు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కృష్ణానది ప్రవాహాలపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది.
రెండు రాష్ట్రాలకు (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ) మాత్రమే వీటిని పరిమితం చేయడం, కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఇతర రెండు రాష్ట్రాలను (మహారాష్ట్ర కర్ణాటక) పూర్తిగా మినహాయించాలని ఏకపక్షంగా సూచించడం అశాస్త్రీయమని దృఢంగా విశ్వసిస్తున్నాను. ఇది జాతీయ ఆస్తి అయిన నీటి వనరులను న్యాయంగా వినియోగించుకోవడానికి వ్యతిరేకమైంది కూడా. పైన పేర్కొన్న వాస్తవాలను పరిగణలోకి తీసుకుని, ఇందులో ఉన్న న్యాయపరమైన చిక్కులను పరిశీలించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, తదుపరి చర్యలు తీసుకోకుండా సంబంధిత వ్యక్తులను ఆదేశించవలసిందిగా కోరుతున్నాను అంటూ ప్రధాని మోడీకి రాసిన లేఖలో సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
కేంద్ర ఆమోదం తర్వాత జగన్ లేఖ
తెలంగాణ కృష్ణా ట్రిబ్యునల్ అభ్యర్థనకు కేబినెట్ ఆమోదం తెలిపి రెండు రోజులు అవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (ఏపీ) రాష్ట్రాల మధ్య తీర్పు కోసం (ISRWD) చట్టంలోని సెక్షన్ 5(1) కింద ప్రస్తుత కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-2కు అదనపు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) జారీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956లోని సెక్షన్ (3) కింద తెలంగాణ ప్రభుత్వం (GOT) తమ ఫిర్యాదులో లేవనెత్తిన ఆందోళనలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకుంది. కృష్ణా నదీ జలాల వినియోగం, పంపిణీ, నియంత్రణపై రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడం వల్ల తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని కేంద్రం చెబుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తోంది.