Vizag Jagan : రాజధానిగా చెప్పుకోలేని రాజధానిగా విశాఖ - సీఎం జగన్ తొందరపడుతున్నారా ?
సీఎం జగన్ క్యాంప్ ఆఫీసును విశాఖకు మారుస్తున్నారు. కానీ రాజధానిగా మాత్రం ప్రకటించలేరు. న్యాయవివాదాలు పరిష్కారమయ్యే వరకూ ఎందుకు ఆగలేకపోతున్నారు ?
Vizag Jagan : విశాఖను రాజదానిగా చేయాలని నాలుగేళ్లుగా సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. విశాఖను రాజధానిగా ప్రమోట్ చేస్తున్నారు. ఆ రాజధాని అనే పదం చుట్టూ అనే వివాదాలున్నా వెనక్కి తగ్గడం లేదు. ఎన్నికలు సమీపిస్తూండటంతో విశాఖ రాజధానిని చేయాలనుకుంటున్నారు. అందుకే దసరా నుంచి విశాఖకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దసరాకు ఫిష్ట్ అవుతారని ఇప్పటికే మంత్రులు తెలిపారు. అటు రిషికొండ వద్ద ఏపీ సీఎంవో.. సీఎం నివాస భవనాల సముదాన్ని వేగంగా నిర్మిస్తున్నారు. ఈ మేరకు విశాఖ నుంచి పాలన సాగించేందుకు సీఎం జగన్ కసరత్తు పెంచారు. గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి ఏపీ సీఎంవోను విశాఖకు మార్చేందుకు అడుగులు వేస్తున్నారు. సీఎంవో షిఫ్టింగ్‌తో పాటు మౌలిక వసతుల కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పట్ణాభివృద్ధి, సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ కార్యదర్శులు ఉండనున్నారు. కమిటీ ఏర్పాటుకు సంబంధించి జీవో 2015ను సీఎస్ జారీ చేశారు.
అధికారికంగా రాజధాని ప్రకటించడం సాధ్యం కాదు !
అమరావతి రాజధాని కోసం రైతుల వద్ద తీసుకున్న భూములు, వారితో చేసుకున్న చట్టబద్దమైన ఒప్పందాలను ఉల్లంఘించి రాజధానిని తరలించడం సాధ్యం కాదని హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. దీనిపై చట్టాలు కూడా చేసే అధికారం లేదని రిట్ ఆఫ్ మాండమస్ విధించింది. ఈ అంశంలో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. సీఆర్డీఏ చట్టం ప్రకారం నిర్మాణాలు పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాత్రమే స్టే ఇచ్చారు. కానీ రిట్ ఆఫ్ మాండమస్ పై మాత్రం ఎలాంటి స్టే ఇవ్వలేదు. ఇప్పుడు ప్రతివాదంలదరికీ నోటీసులు జారీ చేశారు. 261 మంది ప్రతివాదులు అఫిడవిట్లు దాఖలు చేస్తారు. వారి వాదనలు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. 31వ తేదీన విచారణ జరగనుంది. ఆ రోజున సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఒప్పించి... రాజధాని తరలింపు వద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశంపైనా అంశంపైనా స్టే తెచ్చుకుని.. తరలింపు కోసం సుప్రీంకోర్టు అనుమతి తీసుకుంటే ఏ సమస్యా లేకుండా తరలించుకోవచ్చు. లేకపోతే సాధ్యం కాదు.
29వేల మంది రైతులకు న్యాయంతో ముడిపడి ఉన్న అంశం !
రాజధాని అనే విషయంలో రైతులు స్టేక్ హోల్డర్లు కాకపోతే అసలు వివాదం అయ్యేది కాదు. రాజధాని కోసం వారు భూముల్ని ఇచ్చారు. భూముల్ని ఇచ్చినందుకు వారికి కల్పిస్తామన్న ప్రయోజనాలు .. ఇస్తామన్న ప్లాట్లు.. భవిష్యత్‌పై నమ్మకం కల్పించాల్సి ఉంది. అలా కల్పించకపోతే చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. ఈ రైతుల దగ్గర గతంలో ప్రభుత్వం భూసేకరణ చేసి ఉన్నాసమస్య ఉండేది కాదు. రైతులందరికీ నష్టపరిహారం చెల్లించేసి.. రాజధానిని తరలించేవారు. కానీ భూసమీకరణ చేశారు. అంటే రైతులకు రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. అభివృద్ధి ఫలాల్ని అందిస్తామన్నారు. ఇప్పుడు రాజధాని తరలిస్తే రైతులు అన్యాయమైపోతారు. ఇలా తమను సుప్రీంకోర్టు అన్యాయం చేస్తుందని రైతులు కూడా అనుకోవడం లేదు. అందుకే రాజధాని తరలించాలంటే ముందుగా రైతులకు న్యాయం చేయాల్సి ఉంటుంది. కానీ ఇది కూడా అంత తేలికగా జరగే విషయం కాదనేది నిపుణుల మాట.
రుషికొండ కట్టడం అక్రమమని విమర్శలు - అక్కడే సీఎంవో పెడతారా?
రాజధాని పేరు లేకుండా విశాఖ నుంచి పాలన చేసేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. అందు కోసం రుషికొండపై వివాదాస్పద నిర్మాణాలనూ పూర్తి చేశారు. అయితే ఆ కట్టడం నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించారని సాక్షాత్తూ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కమిటీనే స్పష్టం చేసింది. రుషికొండ కోస్తా నియంత్రణ మండలి (సీఆర్‌జెడ్) పరిధిలో ఉంది. అటువంటి ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి కోసం, పర్యాటకులకు ఉపయోగపడే గదులు, రిసార్టులు మాత్రమే నిర్మించాలి. ఇది సీఆర్‌జెడ్ నిబంధన. కానీ ఇక్కడ పర్యాటకుల కోసమని చెప్పి సీఎం కార్యాలయం కోసం భవనాలు నిర్మించారన్న ఆరోపణలు ఉన్నాయి. సీఆర్‌జెడ్‌లో పరిపాలనా కార్యాలయాలు నిర్మించరాదు. జీవీఎంసీకి సమర్పించిన ప్లాన్‌లో కూడా పర్యాటక భవనాలంటూ బ్లాక్‌లకు కళింగ, చోళ వంటి పేర్లు పెట్టారు. కానీ హోటల్ రూముల్లా కాకుండా ఆఫీసుల డిజైన్ తోనే నిర్మించారు. దీనిపై ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవాల్సి రావొచ్చు.