Mla Eliza: వైసీపీకి మరో షాక్ - షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన చింతలపూడి ఎమ్మెల్యే
AP Politics: వైసీపీకి మరో షాక్ తగిలింది. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ఆ పార్టీని వీడి ఆదివారం షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Ysrcp Mla Joined in Congress Party: ఎన్నికల వేళ వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఏలూరు (Eluru) జిల్లా చింతలపూడి (Chintalapudi) ఎమ్మెల్యే ఎలిజా ఆదివారం వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ (Hyderabad)లోని లోటస్ పాండ్ లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ కండువా కప్పి షర్మిల కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా, చింతలపూడిలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ను కాదని.. కంభం విజయరాజుకు వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన హస్తం గూటికి చేరినట్లు తెలుస్తోంది.
ఎలిజా ఏమన్నారంటే.?
వైసీపీలో అవమానాలు ఎదుర్కొన్నానని ఎమ్మెల్యే ఎలిజా తెలిపారు. 'చింతలపూడి నియోజకవర్గంలో స్థానిక రాజకీయాలు తట్టుకోలేకపోయా. సిట్టింగ్ ఎమ్మెల్యేగా నాకు తెలియకుండా కార్యక్రమాలు చేశారు. శిలా ఫలకాల మీద నా పేర్లు కూడా తీసేశారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేదు. నా పార్టీ అనుకొని పని చేస్తే మోసం చేశారు. ఈ దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ చాలా అవసరం. కాంగ్రెస్ నిజమైన సెక్యులర్ పార్టీ. కాంగ్రెస్ ఒక్కటే ఏ మతానికి, కులానికి బేస్ కాదు. పార్టీలో కష్టపడి పని చేస్తా. కచ్చితంగా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది. వైసీపీలో ఉన్న అసమ్మతి నేతలు చాలా మంది కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉండొచ్చు. నన్ను బయటకు పంపిన వైసీపీ నేతలు ఎవరో అందరికీ తెలుసు.' అని పేర్కొన్నారు.
బీజేపీలోకి వైసీపీ ఎమ్మెల్యే
మరోవైపు, ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ సైతం ఆదివారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చాలా రోజులుగా ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్నారు. తాజా ఎన్నికల్లోనూ వరప్రసాద్ కి టికెట్ నిరాకరించడంతో ఆయన బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ తరఫున ఎంపీగా గెలిచారు వరప్రసాద్. 2019లో గూడూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వరుసగా రెండుసార్లు ఆయనకు అవకాశం ఇచ్చిన జగన్, మూడోసారి మాత్రం టికెట్ ఇవ్వలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన వరప్రసాద్.. పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. నేరుగా ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరారు.
Former Indian Air Force chief Air Chief Marshal RKS Bhadauria (Retd) and Former MP from Tirupati, Shri Varaprasad Rao #JoinBJP at party headquarters in New Delhi. https://t.co/FJOT81Y8SH
— BJP (@BJP4India) March 24, 2024
'అక్కడి నుంచే పోటీ'
బీజేపీ తరఫున తిరుపతి లోక్ సభకు వరప్రసాద్ పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీకి వదిలేసే ఆలోచనలో ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇటీవల ప్రకటించిన జాబితాలో కూడా తిరుపతిని పక్కనపెట్టారు. దీంతో ఆ నియోజకవర్గంలో బీజేపీ తరఫున వరప్రసాద్ పోటీ చేస్తారనే వాదన బలపడుతోంది. తిరుపతి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం 2019 ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున పనబాక లక్ష్మి పోటీ చేసి ఓడిపోయారు. ఉప ఎన్నికల్లో గెలిచిన డాక్టర్ గురుమూర్తి 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా వరప్రసాద్ బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశాలున్నాయి.