Vijayawada Blade Batch: బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం, బస్టాండ్‌లో ఆర్టీసీ సిబ్బందిపై దాడి - పోలీసులు సైతం పరుగో పరుగు!
Vijayawada బ్లేడ్ బ్యాచ్ వీరంగానికి పోలీసులు కూడా పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. విజయవాడ నడిబొడ్డున పండిట్ నెహ్రూ బస్టేషన్ లో జరిగిందీ వ్యవహారం.
Vijayawada Blade Batch News: విజయవాడలో శాంతి భద్రతల వ్యవహారం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది ఓ పెద్ద ఉదాహరణ. అదేమీ మారుమూల ప్రాంతం కాదు, నగరానికి కిలోమీటర్ల దూరంలో ఏమీ లేదు, పోనీ జనసంచారం లేని ప్రాంతమా అంటే అదీ కాదు. అన్నీ ఉన్నాయి, నిఘా కెమెరాల పర్యవేక్షణ కూడా ఉంది. కానీ అక్కడ బ్లేడ్ బ్యాచ్ వీరంగానికి పోలీసులు కూడా పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. విజయవాడ నడిబొడ్డున పండిట్ నెహ్రూ బస్టేషన్ లో జరిగిందీ వ్యవహారం.
ఏయ్ బిడ్డా.. ఇది మా అడ్డా..
బెజవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ఏపీలోనే అత్యంత రద్దీగా కనిపించే ప్రాంగణం. ఇలాంటి ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ, శాంతిభద్రతల నిర్వహణ ఎంతో పగడ్బందీగా ఉంటుంది. ఉంటుందని అనుకుంటాం కానీ, అలా లేదని ఈరోజు తెల్లవారు ఝామున జరిగిన సంఘటన రుజువు చేసింది. బెజవాడ బస్టాండ్ లో నిత్యం బ్లేడ్ బ్యాచ్ లు, యాచకులు మకాం వేసి ఉంటారు. యాచకులు డబ్బులివ్వనిదే ప్రయాణికులను వదిలిపెట్టరు. ఇక బ్లేడ్ బ్యాచ్ చిన్నా చితకా దొంగతనాలు చేసుకుంటూ, రాత్రిళ్లు ఒంటరిగా కనపడిన వారిని దోచుకుంటూ ఉంటుంది. వీరందరి కేరాఫ్ అడ్రస్ బెజవాడ బస్టాండ్. అయితే అనుకోకుండా ఆర్టీసీ సిబ్బంది, పోలీసులు తనిఖీలు చేపట్టడంతో వారిపైనే తిరగబడ్డారు. బ్లేడ్ లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆర్టీసీ సిబ్బందికి గాయాలయ్యాయి, బ్లేడ్ లతో మీదకు రావడంతో పోలీసులు కూడా పారిపోయారు.
ఈరోజు తెల్లవారు ఝామున 4 గంటల ప్రాంతంలో బెజవాడ ఆర్టీసీ బస్టాండ్ లో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించిన కొందరు బస్టాండ్ లోని బెంచీలు ఆక్రమించుకుని పడుకుంటున్నారన్న ఫిర్యాదుతో వారు తనిఖీకి వచ్చారు. ప్రయాణికుల ఫిర్యాదుతో బస్టాండ్ లోని అన్ని ప్రాంతాలను వారు పరిశీలించారు. అనుమానాస్పదంగా ఉన్న వారిని నిద్రలేపి అక్కడినుంచి వెళ్లిపోవాలని చెప్పారు. అయితే అక్కడ నిద్రపోతున్న వారిలో కొంతమంది బ్లేడ్ బ్యాచ్ కి చెందిన యువకులు ఉన్నారు. యాచకులు కూడా అక్కడినుంచి వెళ్లడానికి ఇష్టపడలేదు. వారంతా ఆర్టీసీ సిబ్బందిపై ఎదురు తిరిగారు. బ్లేడ్ బ్యాచ్ యువకులు.. తమ చేతుల్లోని బ్లేడ్ లతో సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. ఒకరిద్దరు కాదు.. దాదాపు 100 మంది యాచకులు, బ్లేడ్ బ్యాచ్ యువకులు మీదపడటంతో పోలీసులు కూడా పరుగు అందుకున్నారు. ఆర్టీసీ సిబ్బంది భయంతో వణికిపోయారు.
ఈ దాడిలో సాంబయ్య అనే ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి గాయాలయ్యాయి. బస్టాండ్ లోని ఆర్టీసీ విచారణ కార్యాలయం సిబ్బంది పై కూడా వారు దాడికి ప్రయత్నించారు. దాదాపు గంటసేపు అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. ప్రయాణికులు కూడా ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదనపు బలగాలతో అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి బ్లేడ్ బ్యాచ్ యువకులు పరుగులు తీశారు. అయితే పోలీసులు వారిలో కొందరిని పట్టుకున్నారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
ఇటీవల కాలంలో బస్టాండ్ లలో రాత్రి వేళల్లో పెద్ద ఎత్తున దొంగతనాలు జరుగుతున్నాయని, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినపడుతున్నాయి. ప్రయాణికుల ఫిర్యాదుతో ఈరోజు ఈ వ్యవహారం బయటపడింది. ఇకపై ఆర్టీసీ బస్టాండ్ లో పటిష్ట నిఘా పెడతామంటున్నారు పోలీసులు. ఆర్టీసీ సిబ్బంది కూడా అదనపు భద్రత కల్పిస్తామని చెబుతున్నారు. రైల్వేస్టేషన్ లలోకి యాచకులను రానివ్వకపోవడంతో వారంతా బస్టాండ్ కు వస్తున్నట్టు తెలుస్తోంది.