Ranjith Reddy: బీఆర్ఎస్ కు మరో షాక్ - పార్టీకి ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా
Telangana Politics: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.
Chevella Mp Ranjith Reddy Resigned to Brs: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. తాజాాగా, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి (MP Ranjith Reddy) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (Kcr)కు పంపించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు ఆయన చెప్పారు. 'చేవెళ్ల ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్ కు ధన్యవాదాలు. నా రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తున్నా. బీఆర్ఎస్ లో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.' అని ఆయన తెలిపారు. కాగా, త్వరలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది.
I’m writing to inform all my supporters and people that I have submitted the formal letter of resignation to @BRSparty
— Dr Ranjith Reddy - BRS (@DrRanjithReddy) March 17, 2024
I would like to convey my gratitude to the BRS party for the meaningful opportunity provided & the cooperation extended in my service to the people of… pic.twitter.com/tCZ4N9Kbo8
వరుస ఎదురుదెబ్బలు
అయితే, లోక్ సభ ఎన్నికల ముందు గులాబీ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ముఖ్య నేతలు ఆ పార్టీని వీడుతుండడంతో బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవలే జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ శనివారం బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. అనంతరం ఆదివారం ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కొందరు నేతలు బీజేపీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వాస్తవానికి, 3 రోజుల క్రితమే ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు యత్నించగా.. బీఆర్ఎస్ నాయకులు ఆయన్ను అడ్డుకున్నారు. అనంతరం కేసీఆర్ తో సమావేశమైన ఆయన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని చెప్పారు. తర్వాత, నేడు బీజేపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనకు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి హామీ వచ్చినట్లు తెలుస్తోంది.
అటు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల్లోని ముగ్గురు జడ్పీ ఛైర్మన్లు హస్తం గూటికి చేరగా.. తాజాగా, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నుంచి ఆయన్ను బరిలో దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం.