(Source: ECI/ABP News/ABP Majha)
Chegondi Surya Prakash: పదేళ్లయినా పార్టీ కేడర్ తయారు చేసుకోలేదు, పవన్‌కు ఆ సత్తా లేదు: చేగొండి
Chegondi Comments On Pavan: కాపునేత చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ జనసేన వీడి వైసీపీలో చేరారు. తన తండ్రిపై పవన్ చేసిన వ్యాఖ్యలను నొచ్చుకున్న ఆయన సీఎం సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు
YCP NEWS: జనసేన పార్టీని నడిపే సత్తా పవన్ కల్యాణ్ కు లేదని కాపునేత చేగొండి హరిరామజోగయ్య(Harirama Jogaiah) కుమారుడు సూర్యప్రకాశ్(Surya Prakash) విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్ ను సీఎం చేయడానికే పవన్ పనిచేస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ పెట్టి పదేళ్లవుతున్నా ఇంకా క్యాడర్ ను సిద్ధం చేసుకోలేకపోయాడని మండిపడ్డారు. జనసేన(Janasena)కు రాజీనామా చేసిన ఆయన సీఎం జగన్ (Jagan)సమక్షంలో వైసీపీలో చేరారు.
చేగొండి కామెంట్స్
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పార్టీలు మారడాలు, చేరికలు వేగంగా జరుగుతున్నాయి. ప్రముఖ కాపునేత చేగొండి హరిరామజోగయ్య(Chegondi Harirama Jogaiah) కుమారుడు, ఆచంట జనసేన పార్టీ ఇన్ఛార్జి చేగొండి సూర్యప్రకాశ్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ(YCP) తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిగూడెంలో తన తండ్రిపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నొచ్చుకున్న ఆయన జనసేనను వీడారు. పవన్(Pavan Kalyan) సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరానని... ఆరేళ్లు పార్టీ కోసం పనిచేశానని సూర్యప్రకాశ్ తెలిపారు. పవన్ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తారనుకుంటే... ఆయన చంద్రబాబు(Chandra Babu), లోకేశ్(Lokesh) ను సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. పవన్ పైకి చెప్పేది వేరు లోపల మాట వేరని సూర్యప్రకాశ్ మండిపడ్డారు. పార్టీని నడిపే సత్తా పవన్ కల్యాణ్ కు లేదన్నారు. జనసేన ఎన్నికల్లో పోటీ చేయడానికి క్షేత్రస్థాయిలో కేడర్ లేదని బహిరంగ సభలోనే పవన్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పదేళ్లవుతున్నా ఇంకా బూత్ స్థాయిలో పార్టీకి కేడర్ లేదంటే ఆ తప్పు ఎవరిదని ప్రశ్నించారు. పదేళ్లలో పార్టీ క్యాడర్ ను సిద్ధం చేసుకోలేకపోయారని మండిపడ్డారు.
పవన్ నేతలను కలవనే కలవడు
పార్టీ నేతలతో మాట్లాడే సమయం కూడా పవన్ కల్యాణ్ కు లేదని... ఈ ఆరేళ్లలో కనీసం ఆయనతో 30 నిమిషాలు కూడా తాను మాట్లడలేదని చేగొండి సూర్యప్రకాశ్ వాపోయాడు. పార్టీ నేతలను ఆఫీసు బయట నిలబెట్టి అవమానిస్తారని ఆయన తెలిపారు. పార్టీ మొత్తం పవన్ చేతిలో నుంచి నాదెండ్ల మనోహర్ చేతిలోకి వెళ్లిపోయిందన్నారు. జనసేన నేతలకు పార్టీలో విలువే లేదన్నారు. బహిరంగ సభల్లో కూడా నాగబాబు, మనోహర్ తప్ప మరో నాయకుడిని పక్కన కోర్చోబెట్టుకోరని విమర్శించారు. పార్టీ బాగు కోసం సలహాలు ఇచ్చేవారిని పవన్ కోవర్టులుగా చూడటం బాదేసిందన్నారు. జనసేన స్థాపించి పదేళ్లవుతున్నా ఇప్పటి వరకు ఏం సాధించరంటే చెప్పుకోవడానికి పవన్ కల్యాణ్ వద్ద ఏం లేదన్నారు.
జగన్ ఒక్కమగాడు
రాష్ట్రంలో అందరూ ఒక్కటైనా... సింహం సింగిల్ గా వస్తుందంటూ నిలిచిన ఒకే ఒక్క మగాడు జగన్ అని.. ఆయన పాలనలో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని నమ్మి వైసీపీలో చేరినట్లు సూర్యప్రకాశ్ తెలిపారు. వైసీపీలో తనకు ఏ పదవులు వద్దని...స్థానిక నేతలతో కలిసి పనిచేస్తానని తెలిపారు.తన తండ్రి హరిరామజోగయ్య ప్రజారాజ్యం పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని....ఆయన వయసు దృష్ట్యా ఒక విశ్లేషణ నేతగా సలహాలు, సూచనలు ఇస్తున్నారన్నారు. పార్టీ పెట్టినప్పుడు ప్రజలు ప్రశ్నిస్తూనే ఉంటారని..వాళ్లకు సమాధానం చెప్పడం చేతగాకపోతే పార్టీ మూసివేసి ఇంట్లో కూర్చోవాలి తప్ప..ప్రశ్నించిన వారందిరిపైనా విరుచుకుపడకూడదన్నారు. పవన్ కల్యాణ్ కి అవసరం అయితేనే మానాన్న గుర్తుకు వస్తారని మండిపడ్డారు. టీడీపీతో పొత్తు తర్వాత ఆయనకు మా అవసరం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.