Chandrababu : చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో రహస్య సమావేశాలు - ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు రానున్నాయా ?
చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నారా? దేశ నిర్మాణంలో భాగం కావడం ఏంటే ఏమిటి ?
Chandrababu : దేశ నిర్మాణంలో భాగం కావాలనుకుంటున్నానని అది ఏ రూపంలో అన్నది కాలమే నిర్ణయిస్తుందని ఢిల్లీలో మీడియాతో నిర్వహించి చిచ్ చాట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేరుగా ఆయన ప్రకన చేయలేదు కానీ.. దేశ నిర్మాణం గురించి మాట్లాడారంటే..అది జాతీయ రాజకీయాలే కావొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడు ఇప్పటి వరకూ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు కానీ నేరుగా ఎప్పుడూ ఢిల్లీ స్థాయిలో పదవులు చేపట్టలేదు. ఏపీ వరకే ఆయన రాజకీయ పదవులు ఉండేవి.కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారా అన్నట్లుగా ఆయన మాటలు ఉంటున్నాయి.
బీజేపీతో చర్చిస్తున్న అంశాలేమిటి ?
ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణతో పాటు దొంగ ఓట్లపై ఈసీతో చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. కానీ అంతర్గతంగా బీజేపీ నేతలతో చర్చలు జరిపారన్న విషయం మాత్రం స్పష్టమయింది. తాను బీజేపీతో అంతర్గతంగా ఏం చర్చిస్తున్నానో ఎవరికీ తెలియదని అన్నారు. సాధారణంగా చర్చలు జరిగితే రెండు పార్టీల మధ్య పొత్తు అనుకుంటారు. కానీ చంద్రబాబునాయుడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఇష్టాగోష్టిలో మాత్రం... అంతకు మించిన విషయాలు ఉండటమే కాదు..జాతీయ రాజకీయాలపై తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పారు. మోదీని సమర్థించారు. ఇండియా కూటమికి నాయకుడు లేరన్నారు.
ఇండియా కూటమి వైపు వెళ్లడం లేదని స్పష్టత
ఇండియా కూటమికి నాయకుడు లేరని.. దక్షిణాదిలోనూ కాంగ్రెస్ లేదని తెలంగాణ, కర్ణాటకలో మాత్రమే కాంగ్రెస్ ఉందన్నారు చంద్రబాబు. అదే సమయంలో బీజేపీ పరిపాలనా సామర్థ్యాన్ని పొగిడారు. ప్రపంచంలో దేశానికి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చారన్నారు. అంటే.. చంద్రబాబు ప్రతిపక్ష కూటమికి దూరంగా ఉంటామని సంకేతాలిచ్చారు. అదే సమయంలో బీజేపీకి దగ్గరే కానీ.. కూటమిలో చేరుతామని మాత్రం చెప్పడం లేదు. ఇక్కడ చంద్రబాబు ఇండియా కూటమి వైపు వెళ్లడం లేదన్న సంకేతాలను మాత్రం బీజేపీ హైకమాండ్ పంపారని అర్థమవుతుంది. అదే సమయంలో దేశంలో జరగాల్సిన మర్పుల గురించి కూడా మాట్లాడారు. ఇదే ఢిల్లీ రాజకీయవర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. చంద్రబాబు జాతీయ రాజకీయాలకు వస్తారా అన్న సందేహాలు ఈ కారణంగానే వస్తున్నాయి.
రాష్ట్రాన్ని పునర్ నిర్మించాల్సి ఉందన్న చంద్రబాబు
అదే సమయంలో ఏపీ గురించి చంద్రబాబు చాలా మథనపడుతున్నారు. రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయిపోయిందని పునర్ నిర్మించాల్సి ఉందని అంటున్నారు. అదే అనుకుంటే... టీడీపీ గెలిచినా ఆయన సీఎంగానే ఉంటారు కానీ.. జాతీయ రాజకీాయల్లోకి వెళ్లలేరు. ఒక వేళ లోకేష్ సమర్థత నిరూపించుకున్నారు కాబట్టి ఆయనకు బ్యాటన్ అప్పగించేసి.. తాను ఢిల్లీ వెళతారా అన్నదానిపై స్పష్టత ఇప్పటికే రాకపోవచ్చు. నారా లోకేష్ మంత్రిగా మంచి పనితీరు కనబర్చారు. పరిశ్రమల్ని ఆకర్షించడంతో పాటు పంచాయతీ రాజ్ శాఖకు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున అవార్డులు వచ్చేలా పని చేశారు. ఇప్పుడు పాదయాత్ర ద్వారా పార్టీ నేతలు ఊహించనంతగా మాస్ లీడర్ గా ఇమేజ్ తెచ్చుకుంటున్నారు. టీడీపీ విజయం సాధిస్తే.. ఆ గెలుపులో లోకేష్ పాదయాత్రకు మెజార్టీ వాటా ఉంటుందని చెప్పాల్సిన పని లేదు.
చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచన ఇప్పటి వరకూ చేయలేదు. సంకీర్ణ యుగాల శకంలో.. ఓ సారి చంద్రబాబుకే ప్రధానమంత్రి పదవి తీసుకోమని కూటమి నేతలు ఆఫర్ ఇచ్చినా తిరస్కరించారు. టీడీపీ తరపున రాష్ట్రం కోసం జాతీయ రాజకీాయలు చేశారు కానీ.. జాతీయ రాజకీయాల్లో పదవులు పొందాలని అనుకోలేదు. మరి వచ్చే ఎన్నికల తర్వాత ఏమైనా ఆలోచిస్తున్నారేమో తెలియదు కానీ.. ఆయన మాటలు మాత్రం హాట్ టాపిక్ అవుతున్నాయి.