Visakha local bodies MLC Election : బీఆర్ఎస్ చేసిన మ్యాజిక్ చేయాలని వైసీపీ పట్టుదల - విశాఖ ఎమ్మెల్సీ సీటును జగన్ గెలవగలరా ?
YSRCP : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటును గెలవాలని జగన్ పట్టుదలగా ఉన్నారు. రెండు రోజుల పాటు ఓటర్లను తన ఇంటికే పిలిపించి మాట్లాడబోతున్నారు. కానీ సాధ్యమేనా ?
Can Jagan win the MLC seat of Visakha local bodies : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత రెండు నెలల్లోనే ఎమ్మెల్సీ ఉపఎన్నిక వచ్చింది. ఈ ఉపఎన్నికలను వైసీపీ అధినేత జగన్ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన సూపర్ సీనియర్ అయిన బొత్స సత్యనారాయణను విశాఖ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు. తానే స్వయంగా ఓటర్లతో రెండు రోజుల పాటు మాట్లాడి భరోసా ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు బుధ, గురువారాల్లో తాడేపల్లిలోని ఇంట్లో స్థానిక సంస్థల ఓటర్లతో భేటీ అవుతారు. జగన్‌కు ఈ ఎన్నిక విషయంలో కాన్ఫిడెన్స్ ఇచ్చింది మాత్రం బీఆర్ఎస్ పార్టీ అనుకోవచ్చు. ఆ పార్టీ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించింది.
పాలమూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం
బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉపఎన్నిక వచ్చింది. ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో ఆయన రాజీనామా చేశారు. ఆ స్థానంలో ఉపఎన్నిక వచ్చింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని మెజార్టీ ఉంది. మొత్తం 1400కిపైగా ఉన్న ఓటర్లలో వెయ్యికిపైగా బీఆర్ఎస్‌కు చెందిన వారే. తన సొంత జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికను సీఎం రేవంత్ సీరియస్ గా తీసుకుంటారని తెలిసినా బీఆర్ఎస్ రంగంలోకి దిగింది. ఓటర్లను క్యాంపులకు తరలించి నేరుగా ఓటింగ్ కు తీసుకు వచ్చింది. చివరికి బీఆర్ఎస్ అనుకున్న్ ఫలితాన్ని సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై 111 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఫలితంతో అధికారంలో ఉన్న పార్టీ పవర్ చూపించినా గెలవడం కష్టమనే అంచనాకు వచ్చారు.
ప్రతిపక్ష హోదా , సీఎం స్థాయి సెక్యూరిటీ కోసం పిటిషన్లు - జగన్ ప్లాన్ ఎవరూ ఊహించలేరా ?
అచ్చం పాలమూరు లాగానే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక
ఇప్పుడు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ లోనూ పాలమూరు ఎన్నిక నాటి పరిస్థితి ఉంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో టీడీపీ ఎన్నికలను బహిష్కరించింది. ఈ కారమంగా అక్కడ మొత్తం ఓటర్లలో 80 శాతం వైసీపీకి చెందినవారే. స్థానిక ఎన్నికలు పార్టీ పరంగా జరగవు కాబట్టి.. టీడీపీ సానుభూతిపరులు పోటీ చేసిన చోట్ల గెలిచారు. ఇరవై శాతం టీడీపీ ఓటర్లు ఉంటారు. ఎంత మందిని అధికార బలంతో ఆకర్షించినా.. ఓడిపోయేంత సీన్ ఉందని.. కొన్ని ఓట్లు తగ్గినా ఎమ్మెల్సీ సీటు తమ ఖాతాలో పడటం ఖాయమని వైసీపీ అధినేత అంచనాకు వచ్చారు. అయితే తేలికగా తీసుకోకుండా ఉండటం కోసం నేరుగా బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ఖరారు చేశారు.
క్యాంపు రాజకీయాలు షూరూ
విశాఖ స్థానిక సంస్థల ఓటర్లతో స్వయంగా జగన్ చర్చలు జరపబోతున్నారు. ఇందు కోసం రెండు రోజుల పాటు సమయం కేటాయించారు. బుధ, గురువారాల్లో విశాఖ జిల్లా స్థానిక సంస్థలకు చెందిన ప్రజా ప్రతినిధులు అందర్నీ క్యాంప్ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ జగన్ తో సమావేశం తర్వాత వారిని క్యాంపులకు తరలించే అవకాశం ఉంది. అయితే ఎంత మంది జగన్ క్యాంప్ ఆఫీసుకు వస్తారన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత చాలా మంది టీడీపీ, జనసేనల్లో చేరారు. విశాఖ కార్పొరేటర్లు చాలా మంది పార్టీ మారిపోతున్నారు. టీడీపీ కూడా పార్టీలో చేరిన వారితో క్యాంపు ఏర్పాటు చేస్తోంది.
జగన్‌పై అసంతృప్తి - ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి దారెటు ?
ఓడితే చంద్రబాబు కొనుగోలు చేశారని ఆరోపణలు చేయవచ్చనే వ్యూహం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఒత్తిళ్లను .. ఆ పార్టీ నేతల మాటల్ని కాదని.. ప్రతిపక్ష పార్టీకి ఓటు వేయడం అంత సులువు కాదు. ఎన్నో రాజకీయాలు ఉంటాయి. ఏపీలో అయితే చెప్పాల్సిన పని లేదు. రిస్క్ తీసుకోకుండా.. సైలెంట్ గా అధికార పార్టీకి ఓటు వేయాలనుకునేవారు ఎక్కువగానే ఉంటారు. ఈ రిస్క్ ను జగన్, వైసీపీ గుర్తించిందని.. ఒక వేల ఓడిపోతే .. చంద్రబాబు తమ ఓటర్లను కొనుగోలు చేశారని ఆరోపణలు చేయవచ్చని వ్యూహం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎదైనా గెలిస్తే విజయం.. లేకపోతే.. అనైతికమన్న వాదనకు వైసీపీ రెడీ అయిందన అనుకోవచ్చు.