KTR: 'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
Telangana News: ఆటంబాంబులు పేలతాయంటూ మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. హామీలే బాంబులవుతాయంటూ ఎద్దేవా చేశారు.
KTR Satairical Comments On Minister Ponguleti Srinivas Reddy: త్వరలోనే ఆటంబాంబు పేలబోతోందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మండిపడ్డారు. పొంగులేటి పేల్చే బాంబులకు ఏ కాంగ్రెస్ నాయకుడు ఎగిరిపోతాడో తెలియదు కానీ, శ్రీనివాస్ రెడ్డికి బాంబుల శాఖ మంత్రిగా పేరు పెట్టాలని సెటైర్లు వేశారు. ఆదివారం హన్మకొండ పర్యటనలో భాగంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బీసీల ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన పేరుతో కొత్త జపం ఎత్తుకుందని ఆరోపించారు. కులగణనలో ప్రభుత్వం అడుగుతున్న 75 ప్రశ్నలకు విసుగెత్తి, దీనిపై అనుమానం ఉందని.. కులగణన కోసం వెళ్లిన ప్రభుత్వాధికారులు, ఉద్యోగులను ప్రజలు నిలదీస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్తుందని, ఎన్నికల సందర్భంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
'వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు'
బీసీ డిక్లరేషన్ పేరుతో బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచి.. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుతో దళితులకు దగా చేసింది కాంగ్రెస్ పార్టీ.
— BRS Party (@BRSparty) November 10, 2024
దళిత బంధు రెండో విడత నిధులు అడిగితే మా ఎమ్మెల్యేలపై దాడులు చేసుడు కాదు.. దమ్ముంటే నువ్వు మొగోనివైతే మీరు హామీ ఇచ్చిన అంబేద్కర్ అభయ హస్తం కింద… pic.twitter.com/QncRjkJK4Z
ఎన్నికల సందర్భంగా బీసీ డిక్లరేషన్ చేసి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుందని ఇప్పటివరకు బీసీ డిక్లరేషన్, బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీసీ కులగణన పేరుతో ప్రభుత్వం కొత్త నాటకం ఆడుతుందని కేటీఆర్ మండిపడ్డారు. వెనుకబడిన వర్గాలను వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వచ్చాక బీసీ డిక్లరేషన్ దేవుడెరుగు కానీ, గత ప్రభుత్వంలో బీసీలు లబ్ధి పొందే పథకాలను అమలు చేయకుండా నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు అధికారంలో ఉండి ఓబీసీ మంత్రిని నియమించలేదు, కానీ ఇప్పుడు బీసీలపై ప్రేమ పుట్టుకొస్తుందని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో వారం రోజుల్లో కేబినెట్ కొలువుదీరింది కానీ, తెలంగాణలో 18 మంది మంత్రులను నింపలేకపోతున్నారని మండిపడ్డారు.
'హామీలు బాంబులవుతాయి'
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన డిక్లరేషన్లు, హామీలు, 6 గ్యారంటీలను అమలు చేయకపోతే.. త్వరలో హామీలన్నీ బాంబులై మెడకు చుట్టుకుంటాయని కేటీఆర్ హెచ్చరించారు. గ్రామాల్లో సర్పంచులు పల్లె ప్రగతిలో భాగంగా చిన్న చిన్న పనులు చేశారని, వారు చేసిన పనులకు బిల్లులు అడిగితే కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని అన్నారు. వెంటనే సర్పంచులు బిల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రెండో విడత దళిత బంధు అమలు చేయాలని అడిగినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలపై ప్రభుత్వం దాడులు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకూ తమ పోరాటం ఆగదని.. సర్కారును ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు. దళిత బంధు స్థానంలో అంబేద్కర్ అభయహస్తం పేరుతో రూ.12 లక్షలు ఇస్తామని చెప్పారని.. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాల విజయోత్సవాలు, వారోత్సవాలు చేసి ప్రభుత్వాన్ని ఎండగడతామని అన్నారు.
Also Read: Revanth Reddy: ఆరు దశాబ్దాల తరువాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడు - కురుమూర్తి సభలో రేవంత్ రెడ్డి