Harish Rao: 'కాంగ్రెస్ కు ఓటేస్తే హామీలు అమలు చేయకున్నా ఒప్పుకొన్నట్లే' - కవిత అరెస్ట్ పై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
Telangana News: బీజేపీ, కాంగ్రెస్ రెండూ తెలంగాణను మోసం చేశాయని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి.. తెలంగాణ నిలవాలనే నినాదంతో ప్రజల్లోకి వెళ్దామని శ్రేణులకు సూచించారు.
Harish Rao Comments In Sangareddy Parliametary Meeting: కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకున్నా.. ఆ పార్టీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) ప్రశ్నించారు. సంగారెడ్డిలో మంగళవారం నిర్వహించిన మెదక్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో (Medak Parliamentary Meeting) ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు బీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇతర నాయకులు హాజరయ్యారు. మెదక్ లో గులాబీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థి రఘునందన్ పనిమంతుడు అయితే దుబ్బాకలో గెలిచేవారని.. ఆయన పని తీరు బాగోలేదనే 54 వేల ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని గెలిపించారని అన్నారు. వెంకట్రామిరెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆయన, పేద పిల్లల కోసం రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ప్రశంసించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు చేస్తామన్న హస్తం పార్టీ మాట తప్పిందని మండిపడ్డారు. 'డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటివరకూ చేయలేదు. మాట తప్పడం ఆ పార్టీకి అలవాటే.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది. రైతుబంధు అని.. బోనస్ అని మాట తప్పింది. పింఛన్లు ఇవ్వలేదు. 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే హామీలు అమలు చేయకున్నా ఒప్పుకున్నట్టు అవుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలి. చోటే భాయ్ బడే భాయ్ అంటూ రేవంత్ రెడ్డి మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు. ముస్లింలను క్యాబినెట్ మంత్రిగా కాంగ్రెస్ ఏనాడూ తీసుకోలేదు. సర్కారు రంజాన్ తోఫా కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 38 మంది ఆటో కార్మికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. బీజేపీ 157 మెడికల్ కాలేజీలు పెడితే తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్, బీజేపీ రెండూ తెలంగాణకు అన్యాయం చేశాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి.. తెలంగాణ నిలవాలి అనేదే నినాదం కావాలి.' అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు.
కవిత అరెస్టుపై
బీజేపీపై బీఆర్ఎస్ పోరాటం చేస్తోందని.. వాళ్లతో ఒప్పందం పెట్టుకోలేదనే కవితను జైలుకు పంపారని ఆరోపించారు. 'ఒప్పందం పెట్టుకుంటే కవిత అరెస్ట్ అయ్యేవారా.?' అని ప్రశ్నించారు. నచ్చినోళ్లు జేబులో, నచ్చనోళ్లు జైల్లో ఉండాలి అన్నట్టుగా బీజేపీ వైఖరి ఉందని మండిపడ్డారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీలపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అని.. కేసీఆర్ ఎప్పుడూ బీజేపీతో కలిసేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి హామీల అమలుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
Also Read: KTR : లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ - కేటీఆర్ జోస్యం