Hindupur BJP : హిందూపురం ఎంపీ సీటు బీజేపీకేనా ? - పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్న విష్ణువర్ధన్ రెడ్డి !
Hindupur BJP : హిందూపూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి కోరుతున్నారు. గత కొంత కాలంగా ఆయన నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు.
BJP Vishnuvardhan Reddy wants To Contest Hindupur BJP MP candidate : ఏపీ రాజకీయాల్లో పొత్తులు ఫైనల్‌కు వస్తున్నాయి. టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ కూడా చేరనుందని.. ఎక్కువగా ఎంపీ సీట్లలో పోటీ చేయనుందన్న ప్రచారం జరుగుతోంది. అంతర్గతంగా దీనికి సంబంధించిన ప్రణాళికలు కూడా రెడీ అయ్యాయని అంటున్నారు. హిందూపురం ఎంపీ సీటును బీజేపీకి కేటాయిస్తారని అంటున్నారు. అక్కడ పోటీ చేసేందుకు ఆ పార్టీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్థానికుడినైన తనకు హిందూపురం ఎంపీ టీక్కెట్ కేటాయించాలని హైకమాండ్ ను కోరుతున్నారు.
కొంత కాలంగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు
హిందూపురం నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతో విష్ణువర్ధన్ రెడ్డి గత కొంత కాలంగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. సొంత నియోజకవర్గం కదిరితో పాటు హిందూపురం పార్లమెంట్ పరిధిలో కరెంట్ చార్జీల పెంపు, అభివృద్ధి లేకపోవడం, నిరుద్యోగ సమస్యలపై విస్తృతంగా ధర్నాలు నిర్వహించారు. ఇటీవల అయోధ్య రాముని కళ్యాణాన్ని అత్యంత భారీగా ఏర్పాటు చేశారు. పొత్తు ఉన్నా లేకపోయినా ఆయన పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పొత్తు ఉంటే.. ఇంకా విజయం సునాయాసం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో పోటీకి అవకాశం ఇవ్వాలని ఆయన హైకమాండ్ కు విజ్ఞప్తి చేయడం ఆసక్తికరంగా మారింది.
పొత్తులో సీటు కేటాయించినా కేటాయించకపోయినా పోటీకి సన్నాహాలు
హిందూపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా బళ్లారి మాజీ ఎంపీ శాంతకు టిక్కెట్ కేటాయించారు. ఆమె విషయంలో నియోజకవర్గంలో సానుకూల వాతావరణం లేదని చెబుతున్నారు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్న క్రేజ్.. పొత్తులు కలిసి వస్తే.. హిందూపురం ఎంపీ సీటులో బీజేపీ జెండా ఎగురవేయవచ్చని భావిస్తున్నారు. ఆ సీటును బీజేపీకి కేటాయించే ఉద్దేశంతోనే ఇంత వరకూ ఏ టీడీపీ నేత పేరునూ పరిశీలించడం లేదు. పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధికి టిక్కెట్ నిరాకరించారు కానీ అనంతపురం ఎంపీ సీటుకు ప్రతిపాదిస్తున్నారు. హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు టిక్కెట్ లేదని చంద్రబాబు చెప్పేశారని అంటున్నారు.
సామాజిక సమీకరణాలు కూడా కలిసి వచ్చే అవకాశం
హిందూపురం పార్లమెంట్ నియోజవర్గంలో మొత్తం 14 లక్షల ఓట్లు ఉన్నాయి. అత్యధిక ఓట్లు ప్రధాన సామాజిక వర్గానివే. దాదాపుగా 3లక్షల 20 వేలు పైబడి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓట్లు ఉన్నాయి. అయితే అన్ని పార్టీలు బీసీ జపంతో వారికే సీట్లు కేటాయిస్తూండటంతో ఆ వర్గం నుంచి విష్ణవర్ధన్ రెడ్డి నిలడితే ఓట్లు పోలరైజ్ అవుతాయన్న అంచనాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో రెండో స్థానంలో దళితులు, మూడో స్థానంలో బోయలు ఉన్నారు. సామాజిక సమీకరణాలతో కూడా విష్ణు అభ్యర్థిత్వం ప్లస్ అవుతుందని అంచనాలు ఉన్నాయి.
స్థానికుడినైన తనకే అవకాశం కల్పిస్తుందని విష్ణు భావన
అందుకే ప్రత్యక్ష ఎన్నికల్లో తన సత్తా చాటాలని విష్ణువర్ధన్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గ్రౌండ్ వర్క్ చేసుకున్న ఆయన వైపు హైకమాండ్ మొగ్గినా.. చివరి క్షణంలో ఇతరులు రేసులోకి వస్తున్నారు. గతంలో తెలంగాణలో రాజకీయాలు చేస్తానని చెప్పిన పరిపూర్ణానంద హఠాత్తుగా హిందూపురంపై దృష్టి పెట్టారు. అక్కడ్నుంచి పోటీ చేస్తానని అంటున్నారు. అయితే ఆయనకు హిందూపురానికి ఎలాంటి సంబంధం లేదు. పూర్తిగా ప్రజల్లో తిరిగి పార్టీని బలోపేతం చేసిన వారికే చాన్సిస్తారని విష్ణువర్ధన్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. మరో వారంలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.