BJP : బీజేపీ నయా స్ట్రేటజీ సెక్యులర్ భారత్ కోసమా? సొంత లాభం కోసమా?
BJP : బీజేపీ అంటే హిందుత్వ పార్టీ అని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ఆ పార్టీ అధిష్ఠానం ప్రయత్నిస్తుంది. ఇటీవల ఘటనలే అందుకు నిదర్శనం.
BJP : భారతీయ జనతా పార్టీ...సింపుల్ గా బీజేపీ. 1951 లో శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జన్ సంఘ్ టైం నుంచి అటల్ బిహారీ వాజ్ పేయ్, ఎల్ కే అద్వానీ లు తీర్చిదిద్దిన బీజేపీ వరకూ ఈ పార్టీ అంటే చాలు హిందూత్వ అనే ముద్రను వేశాయి మిగిలిన పార్టీలు. ప్రత్యేకించి బాబ్రీ మసీదు కూల్చివేత, గోద్రా ఘటనలు, ముంబై, పాత బస్తీ అల్లర్ల తర్వాత ఆ పార్టీని కేవలం హిందువులకు మాత్రమే అనే ట్యాగ్ లైన్ పెట్టడం ద్వారా చాలా ప్రాంతీయ, జాతీయ పార్టీలు మిగిలిన వర్గాలకు చేరువ అయ్యాయి. అఫ్ కోర్స్ రాజకీయ లబ్దినీ పొందాయి.
రాజాసింగ్ పై వేటు
అయితే ఇప్పుడు నరేంద్రమోదీ పరిపాలన మొదలయ్యాక.... హిందుత్వ అని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలకు బీజేపీ ప్రస్తుత రథసారధులు అర్థాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారా అనిపిస్తోంది. కారణం ఇటీవల బీజేపీ తమ పార్టీ నాయకుల విషయంలో తీసుకున్న రెండు కీలక నిర్ణయాలు. మొన్న నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ ల సస్పెన్షన్. నేడు తెలంగాణలో బీజేపీకి కీలకమైన, బలమైన నాయకుడు రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు. నుపుర్ శర్మ, రాజాసింగ్ రెండు వివాదాల్లోనూ వాళ్లు టార్గెంట్ చేసింది ఒక వర్గాన్నే. మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర, వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతోనే ఇద్దరిపైనా సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ కేంద్ర క్రమశిక్షణా సంఘం. నుపుర్ శర్మ జ్ఞాన్ వాపీ మసీదుపై వివాదం రేగిన సమయంలో ఓ టీవీ షోలో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఆమెపై సస్పెన్షన్ వేటు పడేలా చేశాయి. ఇప్పుడు మునావర్ ఫారుఖీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా రాజాసింగ్ చేసిన బెదిరింపు వీడియోల్లో ప్రవక్తపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు రాజా సింగ్ ను బీజేపీ నుంచి బయటకు గెంటేసేలా చేశాయి.
రాజాసింగ్ విషయంలో స్పీడ్ గా
నుపుర్ శర్మ వివాదం సమయంలో దేశవ్యాప్తంగా ముస్లింలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. అనేక అరబ్ దేశాలు భారత్ లో అధికార ప్రభుత్వం తరపు ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను బహిరంగంగానే ఖండించింది. అంతెందుకు నుపుర్ శర్మపై దాడి చేసే అవకాశం ఉందని ఓ ఐసిస్ ఉగ్రవాదిని రష్యాలో అరెస్ట్ చేశారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రాజా సింగ్ చేసిన వ్యాఖ్యల విషయంలో ఆందోళనలు ఇంకా హైదరాబాద్ కే పరిమితమై ఉండగానే బీజేపీ అప్రమత్తతతో వ్యవహరించింది. పాతబస్తీలో రాజాసింగ్ అరెస్ట్ కోసం చేసిన ఆందోళనలు ఆయన్ను అరెస్ట్ చేసేంత వరకూ ఆగలేదు. ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు రాజాసింగ్ నివాసానికి ఆయన్ను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగానే బీజేపీ కేంద్ర అదిష్ఠానం రాజా సింగ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజాసింగ్ వ్యాఖ్యలు కచ్చితంగా అభ్యంతరకరం అన్న బీజేపీ...అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఏదైనా వివరణ ఇచ్చుకోవాలని పదిరోజుల సమయం ఇచ్చింది.
బలంగా బీజేపీ
వాస్తవానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు బీజేపీ దేశవ్యాప్తంగా బలంగా ఉంది. ప్రధాని మోదీ నాయకత్వంలోని కాషాయ దళానికి వరుసగా రెండో సారి దేశం పట్టం కట్టింది. ఇప్పుడు మరో రెండేళ్లలో మోదీ కి మూడో పరీక్ష ఎదురుకానున్న తరుణంలో మైనార్టీలపై సొంత పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై తీసుకున్న ఈ చర్యలు ఒకింత ఆశ్చర్యానికి గురి చేసేవే. అయితే ఈ అంశంలో ప్రధాని మోదీ ఓ స్పష్టతతో ఉన్నారు. నుపుర్ శర్మ పై చర్యల అనంతరం హైదరాబాద్ లోనే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ...మతం ప్రాతిపదికన ఏ ఒక్కరినీ తాము వేరే చూసి చూడాలని అనుకోవట్లేదని ప్రటించారు. ప్రత్యేకించి మైనార్టీల్లో ఉన్న వెనుకబడిన తరగతుల ప్రజలకు సైతం చేరువయ్యేందుకు ఎంత కృషి చేయాలో అంతా బీజేపీ చేస్తోందన్నారు.
సెక్యులర్ అనిపించుకోవాలనే!
రాజకీయంగా, రాజ్యాంగపరంగా సెక్యులర్ అనిపించుకునే భారత దేశంలో వేరే మతాలను తక్కువ చేసి మాట్లాడటం...భావ ప్రకటనా స్వేచ్ఛ కింద మైనార్టీల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న సొంత పార్టీ నాయకులపైనే బీజేపీ చూపిస్తున్న ఈ కోపం..ధర్మాగ్రహం అయితే అంతకంటే కావాల్సింది ఏముందని సెక్యులరిస్టుల అభిప్రాయం. నుపుర్ శర్మ, రాజాసింగ్ లపై బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూనే జాతి, కులం, మతం, ప్రాంతం ఆధారంగా మన దేశ ప్రజల మధ్య పెరిగిపోతున్న ఈ అంతరాలను దూరం చేయాల్సిన బాధ్యత కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ తీసుకోవాలనేది అందరి అభిలాష.