BJP Pawan Alliance : జనసేనను పూర్తిగా మర్చిపోయిన బీజేపీ - విలీనం కోసం పక్కా వ్యూహమా!?
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌ను బీజేపీ వ్యూహాత్మకంగా నిర్లక్ష్యం చేస్తోంది. ఒంటరిగా కష్టమని విలీనం చేయమని పరోక్షంగా ఒత్తిడి చేస్తోందని రాజకీయవర్గాలు అంచనాకు వస్తున్నాయి.
BJP Pawan Alliance : భారతీయ జనతా పార్టీ .. జనసేనతో పొత్తులో ఉంది. ఇది అధికారికం. కానీ ఆ రెండు పార్టీలు ఎక్కడా కలిసి కనిపించవు. ఆ పార్టీ నేతలు ఎక్కడా కలిసి ప్రభుత్వాలపై పోరాటం చేయరు. చివరికి ఎప్పుడైనా కలిసి ఎలాంటి ముందుకెళదాం అనే అంశం కూడా చర్చించరు. పొత్తులో ఉన్నామంటే ఉన్నామని చెబుతారు. జనసేన కలవడానికి సిద్ధంగా ఉన్నా బీజేపీ కావాలని దూరం పెడుతున్నట్లుగా పరిస్థితి ఉంది. ఇలా ఎందుకు జరుగుతోంది ? జనసేన వల్ల వచ్చే లాభాన్ని బీజేపీ ఎందుకు వద్దనుకుంటోంది ? వ్యూహాత్మకంగానే పవన్ కల్యాణ్ ఒంటరిగా రాజకీయం చేయలేరని నిరూపించాలనుకుంటోందా ?
తెలంగాణలో జనసేనతో పొత్తు ప్రసక్తే లేదన్న లక్ష్మణ్ !
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం పాలైంది. స్వయంగా పవన్ కల్యాణ్ కూడా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయన పార్టీకి ఆరు శాతం వరకూ ఓట్ల బలం ఉన్నట్లుగా తేలింది. తెలంగాణలోనూ ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. వారిలో ఎంత మంది ఓటర్లుగా మారుతారనే విషయం పక్కన పెడితే ఆయనలోని ఓ స్టార్ అట్రాక్షన్ పార్టీకి ఉపయోగకరమే. ఆ విషయం పార్టీ నేతలందరికీ తెలుసు. గతంలో ఉపఎన్నికలు, గ్రేటర్ ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ అభ్యర్థుల్ని నిలబెడతానంటే బీజేపీ నేతలు ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థుల్ని ప్రకటించి మరీ బీజేపీ కోసం వెనక్కి తగ్గారు. కానీ ఆ తర్వాత బీజేపీ నేతలు ఆయనను అవమానించేలా మాట్లాడారు. అందుకే గౌరవం లేని చోట ఉండలేనని ప్రకటించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కొన్ని చోట్ల పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. అదే సమయంలో బీజేపీ కూడా పవన్ కల్యాణ్‌ను లైట్ తీసుకుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో కొత్తగా నియమితులైన డాక్టర్ లక్ష్మణ్.. తెలంగాణలో తాము ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. దీంతో తెలంగాణలో పొత్తు లేదని తేలిపోయింది.
ఏపీలో పొత్తు ఉన్నా పట్టించుకోని బీజేపీ నేతలు
ఏపీలో జనసేనతో పొత్తు ఉందని ఆ పార్టీ నేతలు చెబుతూ ఉంటారు. అయితే అది పైకి మాత్రమే. ఎక్కడా జనసేన, బీజేపీ నేతలు కలిసినట్లుగా ఉండరు. కలవరు. కలసిపోరాటాలు చేసిన సందర్భాలు లేవు. పొత్తు పెట్టుకున్న కొత్తలో ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని కలిసి కార్యక్రమాలు నిర్వహించాలనుకున్నారు. కానీ ఆ కమిటీ నియామకం ఏమయిందో.. సభ్యులు ఏం చేశారో ఎవరికీ తెలియదు. రెండు పార్టీలు కలిసి నిర్వహించిన కార్యక్రమాలేవీ లేవు. అమరావతి విషయంలో రెండు పార్టీలదీ ఒకే మాట. కానీ కలసి రైతులకు సంఘిభావం చెప్పింది లేదు. ఇంకా చెప్పాలంటేబీజేపీ జనసేనను కలుపుకోవడానికి ఇష్టపడటం లేదని చెప్పుకోవచ్చు. తిరుపతి ఉపఎన్నికల తర్వాత నుంచి రెండు పార్టీలు పొత్తుల్లో ఉన్న లేనట్లేనన్న అభిప్రాయం వినిపిస్తూ వస్తోంది.
కూటమి సీఎం అభ్యర్థిగా పవన్‌ను ప్రకటించడానికీ వెనుకంజ !
ఇటీవల పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న నడిమాండ్ జనసేనవర్గాల నుంచి వచ్చింది. కానీ బీజేపీ అందుకు అంగీకరించలేదు. నిజానికి పవన్ లాంటి స్టామినా ఉన్న నాయకుడు బీజేపీలో లేరు. తిరుపతి ఉపఎన్నికల సమయంలో పవనే సీఎం అభ్యర్థి అని ప్రకటించారు కూడా. కానీ తర్వాత మాట మార్చేశారు. నిజానికి ఆ రెండు పార్టీలు కలసి పోటీ చేసినా కనీస మాత్రం అయినా సీట్లు వస్తాయో లేదో చెప్పలేరు. అలాంటి పరిస్థితుల్లోనూ పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి బీజేపీ అంగీకరించలేదు. దీంతో రెండు పార్టీల మధ్య దూరం మరింత పెరిగింది.
జనసేనను విలీనం చేసుకునే వ్యూహంో భాగమే పొత్తుల నిర్లక్ష్య రాజకీయమా ?
అయితే బీజేపీ చాలా కాలంగా జనసేనను తమ పార్టీలో విలీనం కావాలని కోరుతోంది. పవన్ కల్యాణ్ కూడా చాలా సార్లు ఇదే మాట చెప్పారు. కానీ పవన్ మాత్రం తాను విలీనం చేయనని పార్టీని నడుపుతానని అంటున్నారు. అందుకే పవన్ కల్యాణ్.. ఒంటరిగా ఏమీ చేయలేరని.. ఆయనను ఆశక్తుడ్ని చేయాలన్నట్లుగా బీజేపీ తీరు ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పార్టీని నడపలేని సమయంలో ఆయనే పార్టీని విలీనం చేస్తారని వారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ పార్టీ నిర్వీర్యం చేసే దిశగా వ్యూహాలు అమలు పరిచారని అంటున్నారు. ఇప్పటికీ బీజేపీ నేతలు తరచూ ... తాము 175 సీట్లలో పోటీ చేస్తామని చెబుతూ వస్తున్నారు. ఇది కూడా జనసేనను అవమానించడమే.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా చూసినా బీజేపీతో జనసేన పొత్తు అంత సాఫీగా సాగడం లేదు. అసలు పొత్తు అనేది కేవలం ప్రకటనల వరకే ఉందనుకోవాలి. వీరి పొత్తుల కత్తులు ఏ రూపానికి మారతాయో .. ముందు ముందు తెలియనుంది.