Bhadrachalam: భద్రాద్రి రాముడి చుట్టూ రాజకీయ గలాటా, అమిత్‌షా వస్తారా? కేసీఆర్ అవి తెస్తారా?
Bhadrachalam: దక్షిణ అయోధ్యగా ప్రఖ్యాతిగాంచిన భద్రాచలం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతుంది.
రాష్ట్రంలో రాజకీయ వేడి ప్రస్తుతం భద్రాద్రి రాముడి చుట్టూ తిరుగుతుంది. దక్షిణ అయోద్యగా ప్రఖ్యాతిగాంచిన భద్రాచలం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు అవుతోంది. భద్రాచలంపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టిందనే వార్తల నేపథ్యంలో ఇప్పుడు గులాబీ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే విషయంపై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత భద్రాద్రి రాముడిపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పోలవరం ముంపు మండలాల పేరుతో తెలంగాణలోని ముంపు మండలాలను ఏపీలో కలిపివేయడంతో భద్రాచలం పట్టణం ఆంధ్రా – తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా మారిపోయింది. దీంతో భద్రాచలంలో కనీసం అభివృద్ధి పనులు చేసేందుకు సైతం అవకాశం లేకుండా పోయింది. ఈ విషయంపై ఇప్పటికే భద్రాద్రి వాసులు అఖిలపక్షంగా ఏర్పడి ఆందోళనలు సైతం చేశారు. కనీసం కొన్ని గ్రామాలను తెలంగాణలో కలపడం వల్ల భద్రాచలం అభివృద్ధి జరుగుతుందని స్థానికులు కోరుతున్నారు.
కేసీఆర్ (KCR) ముత్యాల తలంబ్రాలు తెస్తారా..?
భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తెచ్చే ఆనవాయితీ తానీషా కాలం నుంచి ఉంది. ఇదే ఆనవాయితీని ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పాటించింది. స్వయంగా ముఖ్యమంత్రులే స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తెస్తుంటారు. అయితే తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2015లో తొలిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణానికి హాజరయ్యారు. దీంతోపాటు యాద్రాద్రితోపాటు భద్రాద్రి రామాలయం అభివృద్ధికి రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై హడావుడిగా భద్రాద్రి అభివృద్ధికి సంబందించిన బ్లూప్రింట్ సైతం విడుదల చేశారు. అయితే ఏడేళ్లుగా కేసీఆర్ రాముడి కళ్యాణానికి కేసీఆర్ మాత్రం హాజరుకాలేదు. దీంతోపాటు ఓ వైపు యాద్రాద్రి పనులు శరవేగంగా పూర్తికాగా భద్రాచలంలో అభివృద్ధి పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
భద్రాచలం కేంద్రంగా బీజేపీ వ్యూహం..
తెలంగాణలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ భద్రాచలం కేంద్రంగా తన వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి రాముడి కళ్యాణానికి అమిత్‌షా హాజరవుతారని ప్రచారం సాగుతుంది. అయితే అమిత్ షా పర్యటనపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కానప్పటికీ బీజేపీ నాయకులు మాత్రం ఈ సారి అమిత్‌షా కళ్యాణానికి హాజరవుతారని చెబుతున్నారు. ఇదే జరిగితే భద్రాచలంపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపును ఎత్తి చూపుతూ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతోపాటు తెలంగాణలో పట్టు సాధించేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కరోనా ప్రభావంతో రెండేళ్ల తర్వాత అత్యంత వైభవంగా జరిగే రాములోరి కళ్యాణం చుట్టూ రాజకీయ క్రీనీడలు కమ్ముకున్నట్లు తెలుస్తోంది.