(Source: ECI/ABP News/ABP Majha)
BRS Vs BJP : మాటలతో మరక పోతుందా ? బీఆర్ఎస్‌తో తమది పోరాటమేనని బీజేపీ ఎలా నిరూపించుకుంటుంది ?
బీఆర్ఎస్, బీజేపీ మధ్య అవగాహన అంటూ ప్రచారందుష్ప్రచారమని బీజేపీ నేతల ఆగ్రహంగుంభనంగా ఉంటున్న బీఆర్ఎస్ బీఆర్ఎస్‌పై బీజేపీ నిజంగానే యుద్ధం చేస్తోందా ?ఏ స్థాయిలో యుద్ధం చేస్తే ప్రజలు నమ్ముతారు ?
BRS Vs BJP : తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అతి పెద్ద కష్టం వచ్చింది. తాము బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి అవగాహనతో లేమని ప్రజల ముందు నిరూపించాల్సి ఉంది. అందుకే రెండు రోజులుగా బీఆర్ఎస్‌పై ఘాటు విమర్శలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కేసీఆర్ ను వదిలేది లేదని ఒక రోజు తప్పించుకోవచ్చు కానీ.. తర్వాత తప్పించుకోలేరని ఈటల రాజేందర్ హెచ్చరించారు. కిషన్ రెడ్డి మరింత ఘాటుగా హెచ్చరికలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు అధికారంలో ఉండే అర్హత లేదన్నారు. రేపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో కూడా బీఆర్ఎస్‌పై ఘాటు విమర్శలు చేసే అవకాశం ఉంది. అవినీతి, కుటుంబపాలన పై భోపాల్‌లోనే అయన బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు తెలంగాణకు వచ్చి సాఫ్ట్ గా ఉండే అవకాశం లేదు. అయితే ఈ మాటల ద్వారానే తెలంగాణ ప్రజలు.. బీజేపీకి బీఆర్ఎస్‌కు మధ్య ఏమీ లేదని నమ్మేస్తారా అన్నదే కీలకం.
బీజేపీ మార్క్ రాజకీయాలు మఖ్యం !
బీజేపీ మాటలతో రాజకీయం చేసే పార్టీ కాదు. చేతలతో రాజకీయం చేస్తుంది. ముఖ్యంగా ఓ రాష్ట్రాన్ని టార్గెట్ చేసి అధికారంలోకి రావాలనుకుంటే ఏం చేస్తుందో.. ఎన్నో రాష్ట్రాలు కేస్ స్టడీలుగా ఉన్నాయి. పార్టీలను చీల్చడం సంగతి పక్కన పెడితే ఆ పార్టీలను బలహీనం చేయడానికి ఏం చేయాలో అది చేస్తుంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సగానికిపైగా తృణమూల్ నేతలు బీజేపీలో చేరిపోయారు. ఆ పార్టీ నుంచి వచ్చిన నేతే ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యారు. అక్కడ ఎన్నికలకు ముందు ఉన్న టెంపోను తెలంగాణలో బీజేపీ నుంచి ఆశిస్తున్నారు. కానీ అలాంటి దూకుడు కనిపించడం లేదు.
బీఆర్ఎస్ రాజకీయం కూడా బీజేపీకి టెన్షనే !
భారత రాష్ట్ర సమితి చేస్తున్న రాజకీయం కూడా బీజేపీకి ఇబ్బందికరంగానే ఉంది. మొన్నటిదాకా బీజేపీపై యుద్ధం ప్రకటించి హడావుడి చేసిన కేసీఆర్ హఠాత్తుగా బీజేపీ విషయంలో సైలెంట్ అయ్యారు. ఆ పార్టీని బహిరంగంగా విమర్శించడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఆయన బీజేపీకి దగ్గరవుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు సంస్థల దూకుడు తగ్గించడం కూడా బీజేపీకి సంకటంగా మారింది. ప్రమాదకరంగా మారుతున్న బీజేపీని కేసీఆర్ వ్యూహాత్మకంగా .. ఆ పార్టీకి తాము దగ్గరగా ఉన్నామన్న భావన కల్పించి బలహీనం చేస్తున్నారని..ఇదో రకమైన రాజకీయ వ్యూహమన్న అనుమానాలు బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని తిప్పి కొట్టే విషయంలో బీజేపీ నేతలు వెనుకబడుతున్నారు.
ఏదో ఓ కార్యచరణ ఉంటేనే బీజేపీకి మళ్లీ ఊపు !
బీఆర్ఎస్ పై తామ రాజీలేని పోరాటం చేస్తున్నామని నిరూపించేలా బీజేపీ ఏదో ఓ కార్యాచరణను అమల్లోకి తీసుకురాకపోతే.. బీఆర్ఎస్, బీజేపీది ఫ్రెండ్లీ ఫైట్ అనే అభిప్రాయం ప్రజల్లో బలపడుతుంది. అది ప్రభుత్వ వ్యతిరేక ఓటును బీజేపీ వైపు రాకుండా చేస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకుకుండా ఉండాలంటే.. బీజేపీ అన్నిరకాల అస్త్రాలను బీజేపీపై ప్రయోగించాల్సి ఉంది. దీనికి ఎంతో సమయం లేదు. మరో నాలుగు నెలల్లోనే అన్ని రకాల అస్త్రాలు ప్రయోగించి బీఆర్ఎస్‌పై బీజేపీ ఎడతెరిపి లేకుండా యుద్ధం చేయాల్సిన అవసరం బీజేపీకి ఏర్పడింది.