(Source: ECI/ABP News/ABP Majha)
Arvind Kejriwal: నాకు పనుంది, విచారణకు రాలేను: ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా
Enforcement Directorate: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావడం లేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు సమాచారం ఇచ్చారు.
ED Summons To Arvind Kejriwal: ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో విచారణకు హాజరుకావడం లేదని ఢిల్లీ సీఎం (Delhi Chief Minister) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate)కు సమాచారం ఇచ్చారు. చట్టవిరుద్ధంగా ఈడీ సమన్లు జారీ చేసిందని, కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడమే కేంద్రం ఏకైక లక్ష్యమని ఆప్ (Aam Aadmi Party) ఆరోపించింది. కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటి వరకు మూడుసార్లు నోటీసులు ఇచ్చింది. బుధవారం ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ.. తాను రావడం లేదని ఈడీకి ముఖ్యమంత్రి సమాచారం ఇచ్చారు.
దీనిపై ఆప్ స్పందిస్తూ.. దర్యాప్తు సంస్థకు సహకరించడానికి కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారని పేర్కొంది. ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఈ నోటీసులు ఎందుకు పంపారని..? ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు బీజేపీ యత్నిస్తోందని, అందుకే ఆయన్ను అరెస్టు చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆప్ ఆరోపించింది. ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, అవినీతి నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. బీజేపీతో చేతులు కలిపిన వారిపై దర్యాప్తు సంస్థలు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆప్ ఆరోపించింది. దర్యాప్తుకు సహకరించడం అంటే నాయకులను అరెస్టు చేయడం కాదని వ్యాఖ్యానించింది. మరోవైపు ఢిల్లీలోని రూస్ అవెన్యూలోని ఆప్ కార్యాలయం వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు.
మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే కేజ్రీవాల్‌ను సీబీఐ విచారించింది. గత ఏడాది ఏప్రిల్‌లో ఆయనను 9 గంటల పాటు ప్రశ్నించించింది. అనంతరం పలు సార్లు ఈడీ నుంచి కేజ్రీవాల్‌కు సమన్లు వచ్చాయి. నవంబర్ 2, డిసెంబరు 21న విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ ఈ విచారణలకు ఆయన హాజరు కాలేదు. రెండు నోటీసుల తర్వాత మూడో సారి బుధవారం విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన మరో సారి విచారణకు గైర్హాజరయ్యారు. ఈడీ సమన్లపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ తెలిపారు.
కేజ్రీవాల్ నేరస్తుడిలా దాక్కుంటున్నారు!
దీనిపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్లా ఢిల్లీ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ బుధవారం మూడో సమన్‌ను దాటవేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కేజ్రీవాల్ ఏదో దాచడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే నేరస్తుడిలా పరారీలో ఉన్నారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు.
మద్దతు తెలిపిన కాంగ్రెస్, శివసేన
కాంగ్రెస్ నాయకుడు ఉదిత్ రాజ్ స్పందిస్తూ.. దర్యాప్తు సంస్థలు తమ పనిని చేయడం లేదని, కేంద్రం చెప్పిన ప్రతిపక్ష నాయకులపై ఒత్తిడి తెస్తున్నాయని ఆరోపించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సన్నిహితులపై ఈడీ దాడులు నిర్వహిస్తోందని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్‌కు ఈడీలు నోటీసులు పంపిందన్నారు. శివసేన నాయకుడు సంజయ్ రౌత్ కూడా కేజ్రీవాల్‌కు మద్దతు తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ ధైర్యం తనకు తెలుసునని, అతను ఎవరికీ భయపడరని చెప్పారు.