AP Minister Anitha: రాజకీయ లబ్ధి కోసమే హైకోర్టులో జగన్ పిటిషన్, అంత సెక్యూరిటీ అవసరమా?: హోంమంత్రి అనిత
AP Minister Vangalapudi Anitha: వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భద్రత పేరుతో రాజకీయ లబ్ధికి యత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
Andhra Pradesh News: రాజకీయ లబ్ధి కోసమే వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ కు సరిపడా భద్రత కల్పిస్తున్నామన్న ఆమె.. 980 మందితో భద్రతా అవసరమా..? అని ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు. భద్రత పేరుతో జగన్ రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నారని హోం మంత్రి అనిత ఎద్దేవా చేశారు. తనకు వస్తున్న ఫిర్యాదుల్లో చాలా వరకు గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ దోపిడీ, దాడులు, అక్రమాలకు సంబంధించినవే ఉంటున్నాయన్నారు. జగన్ బాధితులు భారీ సంఖ్యలో పులివెందులు నుంచి ప్రజాదర్భార్‌కు వస్తున్నారని ఆమె వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ బాధితులు ఫిర్యాదులకు వస్తుండడం గమనార్హమన్నారు. ఆయా ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని హోం మంత్రి స్పష్టం చేశారు.
పంచాయతీ స్థాయి సెక్యూరిటీ కోరుతున్న జగన్
సీఎం స్థాయిలో ఉన్న భద్రతను పునరుద్ధరించాలంటూ జగన్ కోరడం హాస్యాస్పదంగా ఉందన్న మంత్రి అనిత.. ఆయన హైకోర్టును ఆశ్రయించడం దారుణమన్నారు. 980 మందితో భద్రతను కల్పించాలని జగన్ కోరుతున్నారని, ఆ స్థాయిలో సెక్యూరిటీ అంటే చిన్న గ్రామంలోని ఓటర్ల సంఖ్య అంతని పేర్కొన్నారు. ఒక గ్రామ పంచాయతీ అంత సెక్యూరిటీ ఆయన కావాలని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ సీఎంగా ఆయనకు ఇవ్వాల్సిన భద్రతను కల్పిస్తున్నామని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. సీఎంగా ఉన్నప్పుడు కొనసాగిన భద్రతను కావాలని కోరడం దేనికి సంకేతమని, అంత భద్రత ఎలా ఇస్తారని ప్రశ్నింఆచరు. భద్రతకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేయడాన్ని తాము తప్పు పట్టడం లేదని, కానీ, ప్రభుత్వం బురదచల్లవద్దని స్పష్టం చేశారు. కోడికత్తి దాడి జరిగిందని ఐదేళ్ల తరువాత జగన్‌కు గుర్తుకు వచ్చిందా..? అని హోం మంత్రి ప్రశ్నించారు.
Also Read: Chandrababu : ఏపీలో యూట్యూబ్ అకాడెమీ - యూట్యూబ్ గ్లోబల్ సీఈవోతో చంద్రబాబు చర్చలు
సీఎంగా ఉన్న సమయంలో ఈ కేసును ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించిన మంత్రి అనిత.. ఎన్నిసార్లు కోర్టు విచారణకు హాజరుకావాలని పిలిచినా ఎందుకు వెళ్లలేదన్నారు. రకరకాల కారణాలు చెప్పి కోర్టుకు హాజరుకాకుండా విచారణ జాప్యానికి కారణమయ్యారని విమర్శించారు. దీన్నిబట్టి జగన్మోహన్‌రెడ్డి ఆడుతున్నదంతా డ్రామాగా ఆమె కొట్టిపారేశారు. ప్రతిపక్ష హోదా కావాలంటే పది శాతం అసెంబ్లీలో సీట్లు ఉండాలనే విషయం జగన్‌కు తెలుసని, అయినా హైకోర్టులో కేసు వేశారన్నారు. కోర్టులో కేసులు వేయడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నాన్ని ఆయన చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ఈ తరహా ఆలోచనలు మానుకోవాలని ఆమె హితవు పలికారు. జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికైనా తాను ముఖ్యమంత్రిని కాదన్న విషయాన్ని గుర్తించాలని, 11 స్థానాలు గెల్చుకున్న విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకోమన్నారు.
Also Read: YS Jagan: చంద్రబాబు, టీడీపీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారు - జగన్ సంచలన వ్యాఖ్యలు