YS Jagan: చంద్రబాబు, టీడీపీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారు - జగన్ సంచలన వ్యాఖ్యలు
YSRCP News: వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం (ఆగస్టు 6) విజయవాడలోని సన్ రైజ్ హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ఓ వైసీపీ కార్యకర్తను పరామర్శించారు.
AP News: ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు అందర్నీ భయాందోళనకు గురి చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. ఇలాగే చేస్తే వేగంగా కూటమి ప్రభుత్వం దిగిపోతుందని, తర్వాత వైసీపీ ప్రభుత్వం వస్తుందని అన్నారు. చంద్రబాబు ఇలా భయపెట్టే పనులు చేస్తే, చంద్రబాబును, టీడీపీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేసే పరిస్థితులు వస్తాయని అన్నారు. వైఎస్ జగన్ మంగళవారం (ఆగస్టు 6) విజయవాడలోని సన్ రైజ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
కొత్త ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి ఎక్కడైనా కాస్త సమయం పడుతుందని, కానీ, చంద్రబాబుపై మాత్రం చాలా త్వరగా ప్రజల్లో విరక్తి మొదలైందని జగన్ చెప్పారు. వివిధ పథకాలను కూడా చంద్రబాబు మర్చిపోయారని అన్నారు. రైతు భరోసా సొమ్ము రెట్టింపు చేసి ఇస్తామని చెప్పి, వాటిని మర్చిపోయారని అన్నారు. బడులకు పోయే పిల్లల్ని విస్మరించి వారి తల్లులకు ఇవ్వాల్సిన నిధులను కూడా ఎగరగొట్టేశారని విమర్శించారు.
తప్పుడు సాంప్రదాయాలను ఆపేయాలని హితవు పలికారు. ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని, ప్రశ్నించినందున వైసీపీ కార్యకర్తలు సహా మహిళలపైన కూడా అఘాయిత్యాలు పెరిగిపోయాయని అన్నారు. వచ్చే శుక్రవారం తాను నంద్యాలకు వెళ్లి అక్కడ హత్యకు గురైన వ్యక్తి కుటుంబాన్ని కలుస్తానని అన్నారు. ఈ అంశాన్ని దేశ వ్యాప్తంగా హైలైట్ చేస్తామని అన్నారు. హైకోర్టుకే కాకుండా, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి పోరాడతామని జగన్ హెచ్చరించారు.