AP government social media influencer policy: ఇన్‌ఫ్లూయన్సర్లకు ఏపీ ప్రభుత్వం నజరానా - ప్రజాధనంతో ప్రచారమా.. పొలిటికల్ స్టంటా?
Gen Z digital promotion AP govt : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లను ఎంప్యానెల్ చేసి పారితోషికాలు ఇవ్వాలని నిర్ణయించింది. జెన్ జీకి చేరువయ్యే వ్యూహమా లేక పొలిటికల్ ప్రచారమా?

AP cabinet influencer empanelment: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయానికి తెరదీసింది. ఇప్పటి వరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ ,డిజిటల్ మీడియా సంస్థలకు మాత్రమే పరిమితమైన ప్రభుత్వ ప్రకటనల బడ్జెట్‌ను ఇకపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లు, కంటెంట్ క్రియేటర్లకు కూడా కేటాయించేలా ప్రత్యేక ఎంప్యానలింగ్ పాలసీని తీసుకొచ్చింది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం ఒకవైపు డిజిటల్ యుగానికి తగిన వ్యూహంగా కనిపిస్తున్నప్పటికీ, మరోవైపు ప్రజాధనం దుర్వినియోగం అవుతుందనే సరికొత్త వివాదానికి బీజం వేసింది.
కొత్త తరం ప్రచారకులు ఇన్‌ఫ్లూయన్సర్స్
ప్రస్తుత సమాజంలో, ముఖ్యంగా జెన్ జీ, మిలీనియల్స్ సంప్రదాయ వార్తాపత్రికలు , టీవీ ఛానళ్లను వీక్షించడం గణనీయంగా తగ్గించారు. ప్రతి చిన్న సమాచారానికి వారు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపైనే ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలోని యువతకు వేగంగా చేరాలంటే ఇన్‌ఫ్లూయన్సర్లు కీలక మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానం కింద యూట్యూబర్లు, ఇన్‌స్టాగ్రామర్లు, ఫేస్‌బుక్, ఎక్స్ క్రియేటర్లను వారి ఫాలోవర్లు, రీచ్ ఆధారంగా వివిధ కేటగిరీలుగా వర్గీకరించి అధికారిక చెల్లింపులు అందించనున్నారు. ప్రభుత్వ సమాచారాన్ని సంక్లిష్టమైన ప్రభుత్వ జీవోల రూపంలో కాకుండా, ప్రజలకు అర్థమయ్యే సరళమైన డిజిటల్ కంటెంట్‌గా మార్చడం ఈ పాలసీ ప్రాథమిక లక్ష్యంగా ప్రభుత్వం చెప్తోంది.
విపక్షాల నుంచి విమర్శలు
అయితే, ఈ నిర్ణయంపై రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పన్ను చెల్లింపుదారుల డబ్బుతో నడిచే ప్రజాధనాన్ని ప్రభుత్వ సంక్షేమం పేరుతో అధికార పార్టీ తన స్వంత ప్రచారం కోసం వినియోగించుకునే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సంక్షేమ సమాచారం పేరిట పరోక్షంగా అధికార పార్టీకి పొలిటికల్ మైలేజ్ ఇచ్చే క్రియేటర్లకే ఎంప్యానెల్‌మెంట్ లభిస్తుందా? అనే ప్రశ్నకు పాలసీలో స్పష్టమైన పరిమితులు లేకపోవడం వివాదాస్పదంగా మారింది. గతంలో రాజకీయ పార్టీలు తమ సొంత నిధులతో ఐటీ సెల్స్ లేదా పబ్లిక్ రిలేషన్స్ టీమ్‌లను నడిపేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వ నిధులతోనే డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఆర్మీని తయారుచేసుకునే వెసులుబాటు ఈ నిర్ణయంతో కలుగుతుందనే విమర్శలు వస్తున్నాయి.
పక్కా రూల్స్ పెట్టాలన్న డిమాండ్స్
ప్రకటనల కేటాయింపులో ఏవైనా నిర్దిష్ట పారదర్శక నిబంధనలు లేకపోతే, అధికారంలో ఉన్న ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉండే ఇన్‌ఫ్లూయన్సర్లకు మాత్రమే లబ్ధి చేకూరుస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తడం ఖాయం. సాంకేతికత మారినట్లే ప్రభుత్వాల ప్రచార సరళి కూడా మారడం సహజమే. కానీ ప్రభుత్వ ప్రచారానికి, పొలిటికల్ పిఆర్ కి మధ్య ఉన్న సన్నని గీత దాటకుండా ఉండటమే ఇక్కడ అసలైన సవాలు. నిష్పాక్షికమైన గైడ్‌లైన్స్, పారదర్శకమైన ఎంప్యానలింగ్ ప్రక్రియను పాటించకపోతే.. ప్రభుత్వ ప్రయత్నం జెన్ జీ కి చేరువవ్వడం మాట అటుంచి, ప్రజాధనం విచ్చలవిడిగా వృథా చేస్తున్నారనే తీవ్ర విమర్శలను మూటగట్టుకోవాల్సి వస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















