YSRCP SAP office protest: శాప్ కార్యాలయం ముట్టడి రగడ - వైఎస్ఆర్‌సీపీ క్యాడర్‌పై కేసుల వర్షం.. నేతల వ్యూహాత్మక తప్పిదమేనా?
YSRCP cadre cases: విజయవాడ శాప్ ఆఫీస్ వద్ద డీఎస్సీ ఆందోళనలో 260 మంది వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. రెచ్చగొట్టారని వైసీపీ నేతలు వాదిస్తున్నా.. కార్యకర్తలపై రౌడీషీట్లు తప్పలేదు.

YS Jagan YSRCP cadre protection strategy: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ సిబిఐ విచారణ డిమాండ్‌తో వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు విజయవాడలోని శాప్ కార్యాలయాన్ని ముట్టడించిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇదే సమయంలో అక్కడ ఉన్న క్రీడా కోటా టీచర్లు, వైఎస్ఆర్‌సీపీ నేతల మధ్య మాటామాటా పెరిగి దాడుల వరకు వెళ్లడం, ఆ తర్వాత పోలీసులు సీసీటీవీ, డ్రోన్, సోషల్ మీడియా ఆధారంగా ఏకంగా 260 మందికి పైగా వైఎస్ఆర్‌సీపీ క్రియాశీలక కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
వరుసగా వైసీపీ క్యాడర్‌పై కేసులు, రౌడీషీట్లు
అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష హోదాలో వైఎస్ఆర్‌సీపీ వరుసగా చేపడుతున్న ఆందోళనల్లో తరచూ ఇలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం, అనంతరం వందలాది మంది కార్యకర్తలు కేసుల పాలవ్వడం ఒక పరిపాటిగా మారింది. ప్రజాసమస్యలపై పోరాడటం ప్రతిపక్షంగా సరైన మార్గమే అయినప్పటికీ, నిరసనల ప్రణాళికలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల క్షేత్రస్థాయి నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు చట్టపరమైన సమస్యల్లో ఇరుక్కుపోతున్నారు. ఈ పరిస్థితి వైఎస్ఆర్‌సీపీ భవిష్యత్తుకే పెద్ద ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఒకసారి నాన్-బెయిలబుల్ కేసులు లేదా తీవ్రమైన గొడవల కేసులు నమోదైతే, సదరు కార్యకర్తలు ఏళ్ల తరబడి కోర్టులు, పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఆర్థికంగా, మానసికంగా చితికిపోయే ఇటువంటి పరిస్థితుల్లో.. కాలక్రమేణా వారు పార్టీ కార్యక్రమాలకు దూరం కావడం లేదా రాజకీయాల్లో తిరగకుండా మారిపోవడం సహజంగా జరుగుతుంది.
కార్యకర్తల్ని ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు?
ఇక్కడ అసలైన ప్రశ్న ఏమిటంటే.. వైఎస్ఆర్‌సీపీ అధిష్టానం మరియు ముఖ్య నేతలు ఈ ప్రమాదాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? పార్టీకి నిజమైన వెన్నుముక లాంటి క్యాడర్‌ను కేసుల నుంచి కాపాడుకునే దిశగా ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టడం లేదు? నిరసన కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు శాంతియుతంగా, చట్టపరిధిలో నిరసన తెలిపేలా శ్రేణులకు దిశానిర్దేశం చేయడంలో అగ్రనేతలు విఫలమవుతున్నారనే విమర్శలు వ్యతిరేక వర్గాల నుంచే కాక సొంత పార్టీ వర్గాల నుంచి కూడా వినిపిస్తున్నాయి. కేవలం పిలుపునిచ్చి, కార్యకర్తలను రోడ్ల మీదకు రప్పించి, ఘటన జరిగాక ప్రెస్ మీట్లకు పరిమితమవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. కేసులు పడిన తర్వాత వారికి లీగల్ సెల్ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించడం ఎంత ముఖ్యమో, అసలు కేసులు పడకుండా వ్యూహాత్మక ప్రజాపోరాటాలు డిజైన్ చేయడం అంతకంటే ముఖ్యమని గుర్తు చేస్తున్నారు.
ఇరికించాలనే అధికారంలో ఉన్న వారు ప్లాన్ చేస్తారు!
ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం డిజిటల్ సాక్ష్యాల ద్వారా కఠినంగా వ్యవహరిస్తున్న వేళ, కార్యకర్తలు మరింత అప్రమత్తంగా ఉండేలా గైడెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నేతలపైనే ఉంది. వైఎస్ఆర్‌సీపీ గనుక తక్షణమే తన పోరాట వ్యూహాన్ని మార్చుకోకపోతే, నిరసనల పేరుతో ప్రతిసారీ కేసుల్లో చిక్కుకుంటున్న క్యాడర్ భయంతో వెనకడుగు వేసే ప్రమాదం ఉంది. నాయకులు మైకుల ముందుకు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతారు, కానీ కోర్టు బోనులో నిలబడాల్సింది మాత్రం సామాన్య కార్యకర్తలే. ఈ నిజాన్ని గుర్తించి, క్యాడర్‌కు భరోసానిస్తూ, చట్టబద్ధమైన , సురక్షితమైన మార్గాల్లో పోరాటాలు చేయడమే వైఎస్ఆర్‌సీపీ ముందున్న ఏకైక మార్గం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















