AP Congress new incharge: ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
PC Mohan: ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్‌ఛార్జ్‌గా పీసీ మోహన్ నియామకం అయ్యారు. కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకును మళ్లీ ఆకర్షించగలిగితేనే పార్టీకి పునరుజ్జీవం. ఆ పని చేయగలుగుతారా?

YS Sharmila APCC Congress core vote bank YSRCP: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి అధిష్ఠానం ఇన్‌ఛార్జ్ ల మార్పు ప్రక్రియను పూర్తి చేసింది. శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాల నడుమ, మాణిక్యం ఠాగూర్ స్థానంలో కర్ణాటకకు చెందిన సీనియర్ నేత పీసీ మోహన్‌ను ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఏఐసీసీ నియమించింది. అయితే, 2014 రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయిన విషయాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పునాదులు కదిలిపోయిన చోట కేవలం పర్యవేక్షకులను, ఇన్‌ఛార్జ్‌లను మార్చడం వల్ల పార్టీకి కొత్త ఊపిరి వస్తుందా అంటే.. ప్రయోజనం శూన్యమనే సమాధానమే వస్తోంది.
వైసీపీకి వెళ్లిపోయిన కోర్ ఓటు బ్యాంక్
ఏపీ విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైన కోర్ ఓట్ బ్యాంక్ ఉండేది. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలు , దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కాంగ్రెస్‌కు వెన్నెముకగా నిలిచారు. కానీ, విభజన పర్యవసానాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. ఆ సాంప్రదాయ ఓటు బ్యాంక్ మొత్తాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలోకి మళ్లించుకుంది. గత పదేళ్లుగా వైఎస్సార్‌సీపీకి అదే ప్రధానమైన బలంగా మారింది. కాంగ్రెస్ పునర్వైభవం సాధించాలంటే ఆ కోల్పోయిన పునాదిని మళ్లీ దక్కించుకోవడం ఒక్కటే మార్గం, కానీ ఆ దిశగా పార్టీ కేంద్ర నాయకత్వం సీరియస్ ప్రయత్నాలు చేయడంలో పూర్తిగా విఫలమవుతోందనే విమర్శలు ఉన్నాయి.
సరైన వ్యూహం లేని హైకమాండ్
రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి స్పష్టమైన క్షేత్రస్థాయి వ్యూహం లేకపోవడమే అతిపెద్ద బలహీనత. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు లేదా అసెంబ్లీ వేళల్లో ప్రెస్ మీట్లు పెట్టడం, సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడానికే రాష్ట్ర నాయకత్వం పరిమితమవుతోంది. వైఎస్ షర్మిలకు ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన తర్వాత కొంతవరకు మీడియా మైలేజ్, క్యాడర్‌లో కొంత చలనం వచ్చినా.. అది ఓట్ల రూపంలోకి లేదా వైఎస్సార్‌సీపీ కోర్ ఓటు బ్యాంకును ఆకర్షించే స్థాయిలోకి మారలేదు. అసలైన జనాకర్షక నేతలు, క్షేత్రస్థాయిలో బలం ఉన్న స్థానిక నాయకత్వం లేకపోవడం వల్ల పార్టీ విస్తరణ ఆగిపోయింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు, రాష్ట్ర స్థాయిలో వైఎస్సార్‌సీపీకి ఉన్న ఓటు బ్యాంకు స్వరూపం ఒకటే. కానీ ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీని విమర్శించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమికి అనుకూలంగా ఉందనే భావన సాధారణ ప్రజల్లోకి వెళ్తోంది.
బీజేపీపై పోరాడలేని వైసీపీ - కాంగ్రెస్‌కు మంచి అవకాశం
ప్రత్యేకించి బీజేపీతో టీడీపీ పొత్తులో ఉన్న తరుణంలో, బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్‌కు మంచి అవకాశం ఉన్నప్పటికీ, కూటమి వైఫల్యాలపై ధ్వజమెత్తడంలో కాంగ్రెస్ వైఖరి స్పష్టంగా ఉండటం లేదనే విమర్శ ఉంది. ఈ వ్యూహాత్మక అయోమయం వల్ల మైనారిటీ, దళిత వర్గాలు కాంగ్రెస్ వైపు చూడటానికి వెనుకాడుతున్నాయి.
కర్ణాటకకు చెందిన పీసీ మోహన్ నాయకత్వంలోనైనా ఏపీ కాంగ్రెస్ రూట్ మ్యాప్ మారుతుందా అన్నది ఇప్పుడు సవాలు. కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన విజయం, అక్కడ అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాల మోడల్‌ను ఏపీ ప్రజల్లోకి తీసుకెళ్లడం మోహన్‌కు కొంతవరకు కలసివచ్చే అంశం. అయితే, కేవలం విజయవాడ లేదా అమరావతిలోని పార్టీ కార్యాలయాల్లో సమీక్షలు నిర్వహించడానికే ప్రాధాన్యత ఇస్తే ఎలాంటి ఫలితం ఉండదు. బూత్ స్థాయి నుంచి కమిటీలను పునర్నిర్మించడం, కూటమి ప్రభుత్వం , ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ రెండింటికీ సమదూరం పాటిస్తూ సొంత అజెండాతో ప్రజల్లోకి వెళ్లడం తక్షణ అవసరం.
కింది స్థాయి క్యాడర్ ముఖ్యం
రూట్ లెవల్‌లో నాయకత్వాన్ని తయారు చేయకుండా, డివైడ్ అయిన సాంప్రదాయ ఓటు బ్యాంకును ఆకట్టుకునేలా స్పష్టమైన ఆర్థిక-సామాజిక విధాన ప్రకటనలు చేయకుండా.. ఇన్‌ఛార్జ్‌లను ఎంతమందిని మార్చినా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మిగిలిపోతుంది. కొత్తగా వచ్చిన పీసీ మోహన్ అయినా కేవలం ఢిల్లీ మార్గదర్శకాలను అమలు చేసే ప్రతినిధిగా మిగలకుండా, ఏపీ కాంగ్రెస్‌కు కొత్త శ్వాస ఊదేలా కఠిన నిర్ణయాలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















